గిరిజన యువతి పట్టుదలముందు తలవంచిన పేదరికం
రామాయంపేట: ఆమె పట్టుదల, లక్ష్యంముందు పేదరికం తలవంచింది. తమ కుటుంబం తరతరాలుగా వ్యవసాయానికే పరిమితంకాగా, ఎలాగైనా తాను అందరిలా కాకుండా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని కలలుగంది. వివాహామైనా ఆమె చదువుకు ఎలాంటి ఆటంకంలేకుండా భర్త ప్రోత్సాహంతో ముందుకుసాగి అనుకున్నది సాధించింది.
వివరాల్లోకి వెలితే... రామాయంపేట గిరిజన తండాకు చెందిన లంబాడి మంగ్యా, పద్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు. వారి పెద్ద కూతురు మీనా చదువులో ముందుంజలో ఉండగా, ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. వారి ఆశలను అడియాశలు చేయకుండా పట్టుదలతో చదివి ఇంటర్‌లో 917 మార్కులు సాధించి గుర్తింపు పొందింది. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించిన మీనాను ఆమె తల్లిదండ్రులు ఇంజనీరింగ్‌లో చేర్పించారు.
ఇంజనీరింగ్ చదువుతున్న క్రమంలోనే మీనాకు మండలంలోని జడ్చెరువు తండాకు చెందిన రామావత్ రవినాయక్‌తో వివాహాం జరిగింది. దీనితో ఆమెకు మరింతగా భర్త ప్రోత్సాహాం లభించింది. దీనితో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్న మీనా ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ఆమె రాత్రింబవళ్లు కష్టపడి చదివి గ్రామీణ నీటి సరఫరా విభాగం( ఆర్‌డబ్ల్యూఎస్)లో ఏఈఈగా ఉద్యోగం సాదించింది. ఆమె మొదటి పోస్టు నిజామాబాద్ జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఏఈఈగా విధుల్లో చేరింది.
భర్త ప్రోత్సాహాంతోనే...
-మీనా...
నాభర్త రవి ప్రోత్సాహాంతోనే ఉద్యోగం సాధించాను. పెళ్లయితే చదువుకు పులిస్టాప్ పడుతుందని చాలామంది అమ్మాయిలు బావిస్తుంటారు... ఇందుకు విరుద్దంగా రవి మాత్రం తన వెనుక ఉండి ప్రోత్సహించారు. తండాలో ఇతర విద్యార్థినులు చదువులో ముందుండేలా వారిని పోత్సహించడంతోపాటువారికి సలాహాలు, సూచనలు అందజేస్తాను...