సాక్షి, కరీంనగర్ : సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. నేడు నేటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాలోని రెండు లోక్‌సభ, పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధారం నుంచే నామినేషన్ల స్వీకరిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. ఈ నెల 9వ వరకు నామినేషన్ల దాఖలుకు గడువుందన్నారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. ఈ నామినేషన్లను కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఆయనే స్వీకరిస్తారు.
పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. ఆ సెగ్మెంట్‌కు సంబంధించిన నామినేషన్లను ఆయన తన కార్యాలయంలో స్వీకరిస్తారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాలున్న నియోజకవర్గాల్లో ఆర్డీవోలకు, ఇతర ప్రాంతాల్లో ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయవచ్చు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు ఫారం నంబరు 26ను అఫిడవిట్ చేసి సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరిచి, నామినేషన్ ఫీజు మొదలు ఎన్నికల ఖర్చులన్నీ ఆ ఖాతా నుంచే చూపించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. నియోజకవర్గానికి ఒకరు చొప్పున 13 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామన్నారు. 316 సెక్టోరల్ అధికారులను నియమించడంతో పాటు ఎన్నికల సంఘం వారికి మెజిస్ట్రేరియల్ అధికారాలు ఇచ్చిందని తెలిపారు. వీరు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రల పరిరక్షణ, మోడల్ పోలింగ్ కోడ్ నిబంధనల అమలు తీరుతెన్నులను పర్యవేక్షిస్తారని చెప్పారు. ఆరు నుంచి ఎనిమిది పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టోరల్ అధికారిని నియమించామన్నారు. అభ్యర్థుల ఖర్చు పర్యవేక్షణ కోసం 15 ఉపవ్యయ అధికార, 15 అకౌంటింగ్ బృందాలు నియమించామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ కోసం 17 బృందాలు, 43 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, 40 ఎస్‌ఎస్‌టీ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్ జేసీ ఆధ్వర్యంలో 62 బృందాలు మోడల్ కోడ్ కండక్ట్‌ను పర్యవేక్షిస్తాయని వివరించారు.
పెరిగిన ఓటర్లు
జిల్లాలో ఓటర్ల సంఖ్య 28,09,744కు చేరిందని కలెక్టర్ తెలిపారు. జనవరి 31 వరకు జిల్లావ్యాప్తంగా 27,43,655 మంది ఓటర్లున్నారని, గతనెల 9, 16 తేదీల్లో ఓటుహక్కుకు దరఖాస్తు ఇవ్వడంతో జిల్లావ్యాప్తంగా 66,089 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. వీరందరికీ ఓటుహక్కు కల్పించామన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వీరికి ఓటేసే హక్కు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 14,09,562 మంది పురుష, 14,00,182 మంది మహిళా ఓటర్లున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకున్న 3,393 పోలింగ్ కేంద్రాలకు అదనంగా 26 కేంద్రాలు కలుపుకుని మొత్తం 3,419 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
పటిష్ట బందోబస్తు
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నామని ఎస్పీ శివకుమార్ తె లిపారు. జిల్లాలో 1,286 సమస్యాత్మక, 559 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు, 67 కమ్యూనల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో గట్టి బందోబస్తు చేపడతామన్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 9వేల మందిని బైండోవర్ చేశామని, వాళ్లు చట్టాన్ని ఉల్లంఘిస్తే పూచీకత్తు జప్తు చేయడంతో పాటు ఆరేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రశీదు లేకుండా తరలిస్తున్న రూ.2.27 కోట్ల నగదుతో పాటు 2.22 కిలోల బంగారం స్వాధీనం చేశామన్నారు. జిల్లాలో 19 చెక్‌పోస్టులు ఎన్నికల వరకు కొనసాగుతాయని ఎస్పీ చెప్పారు. విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో 57 జెడ్పిటీసీ, 817 ఎంపీటీసీ స్ధానాలకు జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 6న మంథని, జగిత్యాల, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్లలో, 11న కరీంనగర్, సిరిసిల్ల డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలో 20,35,317 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు.
సార్వత్రిక సందడి
Published Wed, Apr 2 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM
Advertisement
Advertisement