బేగంబజార్‌లో సోదాలు
- అనువణువూ పోలీసుల జల్లెడ
- అసాంఘికశక్తుల సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి
అబిడ్స్/అఫ్జల్‌గంజ్: ‘కార్డన్ అండ్ సెర్చ్’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ జోన్ పోలీసులు బుధవారం సాయంత్రం బేగంబజార్‌ను జల్లెడ పట్టారు. బేగంబజార్‌కు వెళ్తే అన్ని ద్వారాలను మూసివేసి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
సెంట్రల్ జోన్ డీసీ పీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు ఫీల్‌ఖానా, తోఫ్‌ఖానాలకు దారి తీసే 20 రహదారులను బారికేడ్లతో పూ ర్తిగా మూసివేసి సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి ఒక్కరినీ సోదా చేశారు. అబిడ్స్, అసెంబ్లీ, సెక్రటేరియట్‌ల ఏసీపీలు జైపాల్, సంజీవ, వీరన్నల నేతృత్వంలో బేగంబజార్, అబిడ్స్, నారాయణగూడ ఇన్‌స్పెక్టర్లు గంగసాని శ్రీధర్, ఉమామహేశ్వరరావు, భీమ్‌రెడ్డిలు, ఎస్‌ఐలు తమ సిబ్బందితో కలిసి బృందాలుగా విడిపోయి ప్రతి వీధిలోనూ తనిఖీలు నిర్వహించారు.
విధ్వంసకర చర్యలను సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు తమ కు సహకరించాలని ఈ సందర్భంగా పోలీసు లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసాంఘిక శక్తుల వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అసాంఘిక శక్తులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
ఎన్నో సత్ఫలితాలు: డీసీపీ కమలాసన్‌రెడ్డి
ఈ తనిఖీల ద్వారా ప్రజలకు ఎన్నో సత్ఫలితాలు కలుగుతున్నాయని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. తనిఖీల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం కూడా తా ము ఇలాంటి తనిఖీలు చేశామన్నారు. ప్రతీ వ్యాపారి తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించి తీరాల్సిందేనన్నారు. సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు అమర్చుకోని వ్యాపారులకు ముందుగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అయినా వా రు భద్రతా ప్రమాణాలు పాటించకపోతే నోటీసులు ఇచ్చి 2013 పోలీస్‌చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు తీసుకొని పోలీస్ శాఖకు సహకరించాలని డీసీపీ కోరారు.