మత్తెక్కిస్తాండ్లు..
పల్లె వాకిట్లో చీప్ లిక్కర్ ప్రవాహం
నవంబర్‌లో 25,848 కేసుల మద్యం అమ్మకం
గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన విక్రయం
బెల్ట్ షాపులకు ఎక్సైజ్ సిబ్బంది ప్రోత్సాహం
మద్యం రహిత గ్రామాల్లో మళ్లీ వెలుస్తున్న షాపులు
జిల్లాలోని పలు గ్రామాల్లో గుడుంబా అమ్మకాలు, తయారీని నియంత్రిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా మద్యం.. ఇందులో చీప్ లిక్కర్ వినియోగం వేల రెట్లు పెరిగిపోతున్నా, గ్రామాల్లో బెల్ట్ షాపుల సంఖ్య రెట్టింపవుతున్నా విస్మరించడం
ఆందోళన కలిగిస్తోంది.
వరంగల్ : పల్లెల్లో మద్యం విపరీతంగా పారుతోంది. మద్యపాన నియంత్రణపై అవగాహన కల్పించాల్సిన ఎక్సైజ్ శాఖే బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తోంది. ఎక్సైజ్ అధికారులు గుడుంబా విక్రయాలు నిర్వహించే వారిని అది మాన్పించి.. బెల్ట్ షాపుల నిర్వహణ వైపు మళ్లిస్తున్నారు. దీంతో ప్రతి ఊరిలోనూ బెల్ట్ షాపుల సంఖ్య రెట్టింపవుతోంది. మద్యం అమ్మకాలు కూడా ఇదే తీరుగా పెరుగుతున్నాయి. గుడుంబాను నియంత్రిస్తున్నట్లు ప్రకటించుకుంటున్న ఎక్సైజ్ అధికారులు మద్యం వినియోగం భారీగా పెరుగుతున్నా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగేలా వైన్‌షాపుల నిర్వాహకులను ప్రోత్సహిస్తున్నారు. మద్యం తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందులో చీప్ లిక్కర్‌తో ఇంకా ఎక్కువ ప్రమాదం. ఇలాంటి చీప్ లిక్కర్ వినియోగం వేల రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం అమ్మకాలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ గణాంకాలు ప్రమాదకర పరిస్థితులను సూచిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం 2014 నవంబరులో జిల్లా వ్యాప్తంగా 1209 కేసుల (పెట్టెల) చీప్ లిక్కర్ అమ్మకాలు జరగగా.. ఈ ఏడాది ఏకంగా 25,848 కేసులు అమ్ముడుపోరుుంది. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన తక్కువ ధర ఉన్న(లీటరు రూ.80) ఛీప్ లిక్కర్ విక్రయం గ్రామాల్లో భారీగా పెరిగింది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని చెప్పుకుంటున్న ఎక్సైజ్ శాఖ.. మద్యం వినియోగం వల్ల గ్రామాల్లో నెలకొంటున్న ఆందోళనకర పరిస్థితులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏడాది క్రితం వరకు బెల్ట్ షాపులను నియంత్రించే పనిలో ఉన్న ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు ఈ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు. కొత్తగా బెల్ట్ షాపులు పెట్టుకుంటే ఫర్వాలేదనే పద్ధతిలో ఈ శాఖ పనితీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులు ఈ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఏడాదిగా జిల్లాలోని చాలా గ్రామాలు మద్యం రహిత పల్లెలుగా ప్రకటించుకుంటున్నాయి. ఇలాంటి వాటిలో 90 శాతానికిపైగా గ్రామాల్లో ప్రస్తుతం బెల్ట్ షాపులు వెలిశాయి. మద్యం రహిత పల్లెలుగా ప్రకటించకముందు కంటే ఇప్పుడు ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి. మద్యం రహిత పల్లెలుగా ప్రకటించిన గ్రామాల్లో మళ్లీ ఈ మహమ్మారి పెరుగుతుంటే ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని మహిళలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బెల్ట్ షాపుల నియంత్రణ కోసం సర్పంచ్‌లు ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితులతో జిల్లాలో మద్యం వినియోగం పెరిగి ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు.
మద్యం రహిత గ్రామాలుగా ప్రకటించినా ప్రస్తుతం బెల్ట్ షాపులు ఉన్నవి..
కేసముద్రం : కల్వల, కోరుకొండపల్లి, కాట్రపల్లి, రంగాపురం, కేసముద్రం, అర్పనపల్లి
మహబూబాబాద్ : అనంతారం, అయోధ్య, ముడుపుగల్, రెడ్యాల, సింగారం, వేంనూరు, వి.ఎస్.లక్ష్మీపురం
రాయపర్తి : గన్నారం, తిర్మలాయపల్లి.
పాలకుర్తి : లక్ష్మీనారాయణపురం, వావిలాల, దర్దెపల్లి, విస్నూరు, గూడూరు, చెన్నూరు, బొమ్మెర
జనగామ : మరిగడి, యశ్వంతాపూర్, గానుగుపహాడ్, వెంకిర్యాల, ఎర్రగొల్లపహాడ్, వడ్లకొండ
బచ్చన్నపేట : బండనాగారం, దబ్బగుంటపల్లి, కట్కూరు, పడమటికేశ్వాపూర్, లింగంపల్లి, చిన్నరామన్‌చర్ల, సాల్వాపూర్, రాంచంద్రాపూర్, మన్‌సాన్‌పల్లి, నారాయణపురం, అలీంపూర్, నాగిరెడ్డిపల్లి, పోచన్నపేట
చేర్యాల : ఐనాపూర్, వేచరేణి
మద్దూరు : లద్నూరు, రేబర్తి, గాగిళ్లాపూర్, లింగాపూర్, దూల్మిట్ట, వంగపల్లి, బైరాన్‌పల్లి, కూటిగల్
నర్మెట్ట : వెల్దండ, అమ్మాపూర్, హన్మంతాపూర్, అంకుషాపురం, బొత్తలపర్రె, అబ్ధుల్‌నాగారం
రఘునాథపల్లి : కంచనపల్లి, గబ్బెట, కోడూర్, ఖిలాషాపూర్, ఇబ్రహీంపూర్, మేకలగట్టు, మండెలగూడెం, జాపర్‌గూడెం, కోమళ్ల, గోవర్దనగిరి, కుర్చపల్లి, వెల్ది, మంగళిబండ తండ
ధర్మసాగర్ : మల్లక్‌పల్లి, పీచర, సాయిపేట, క్యాతంపల్లి
నల్లబెల్లి : కొండాపూర్, కన్నారావుపేట, మేడిపల్లి, రాంపూర్, ఆసరవెల్లి, గొల్లపల్లి, కొండాయిపల్లి ఏటూరునాగారం : కొండాయి, చెల్పాక