బెట్టింగ్ | betting happened in district | Sakshi
Sakshi News home page

బెట్టింగ్

Published Sat, Apr 26 2014 3:58 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

betting happened in district

 మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ :  ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు ఐపీఎల్. రాజకీయ హోరు.. క్రికెట్ జోరు.. వెరసి ప్రచారంతో అభ్యర్థులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, బెట్టింగులతో పందెం రాయుళ్లు మజా చేస్తున్నారు. దీంతో రోజూ జిల్లాలో రూ.లక్షలు బెట్టింగుల రూపంలో చేతులు మారుతున్నాయి. ఈ నెల 30వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుంది? ఎన్ని ఓట్ల తేడాతో ఓడుతారు? డిపాజిట్ దక్కుతుందా? అని పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులపై బెట్టింగులు సాగుతున్నాయి.

మరోవైపు ఇటీవలే మొదలైన ఐపీఎల్‌లో ఏ టీం గెలుస్తుంది? ఏ బాల్‌కు ఎన్ని పరుగులు చేస్తారు? ఎవరి వికెట్ ఎవరు తీస్తారు? రనౌట్, క్యాచ్‌ఔట్, డక్కౌట్, క్లీన్‌బౌల్డ్, స్టంప్‌ఔట్ ఇలా రకరకాల అంశాలపై బంతి, బంతికి బెట్టింగులు కాస్తూ, ఆటలో మజాను, అందుకు రెట్టింపు డబ్బులు బెట్టింగుల్లో పెడుతూ యువత జేబులు గుల్ల చేసుకుంటోంది. గతంలో ముఖ్య పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్‌ల పర్వం ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలకు, మండలాలకు కూడా విస్తరించింది.

 పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాలోని తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో సింగరేణి ఉద్యోగులు అధికంగా ఉండడం, ఉద్యోగుల పిల్లలు అధికంగా బెట్టింగుల వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. దీనికి తోడు పశ్చిమ ప్రాంతంలోని ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో కూడా బెట్టింగ్‌లు సాగుతున్నాయి.

 ఫోన్‌లలోనే ఈ తంతు
 ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-7లపై బెట్టింగులు ఫోన్లలోనే పూర్తిగా జరుగుతున్నాయి. గతంలో పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకోవడంతో, ఈ సారి బెట్టింగులను పకడ్బందీగా నిర్వహించేందుకు సెల్‌ఫోన్లను వినియోగిస్తున్నారు. 20-20 మ్యాచ్‌కు సంబంధించి, ప్రతి మ్యాచ్‌లోనూ టాస్ గెలవడం మొదలుకుని వికెట్లు, రన్స్, ఒక ఓవర్‌లో కొట్టే ఫోర్లు, సిక్స్‌లతోపాటు చివరి బాల్‌కు చేసే రన్స్‌పై, సూపర్ ఓవర్‌పై ఫోన్ల ద్వారా బెట్టింగులు జరుగుతున్నాయి. బలమైన టీంలు తలపడినప్పుడు 1కి పది రెట్లు అదనంగా చెల్లిస్తున్నారు.

ఇందులో రూ. 100కు-రూ.1000, రూ.1000కి-రూ.10వేలు, రూ.10వేలకు-రూ.లక్ష వరకు చెల్లింపులు జరుపుతుండడంతో పలువురు యువకులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ ఊబిలో దిగుతున్నారు. బెట్టింగులకు కావాల్సిన డబ్బులు లేక ఒంటిపై ఉన్న బంగారం, బైక్‌లను తాకట్టు పెట్టడం మొదలుకుని వాటిని అమ్ముకునే స్థాయికి  చేరుకుంటున్నారు. బెట్టింగుల్లో నష్టపోయిన వారు తెలిసిన చోటల్లా అప్పులు చేస్తూ, వాటిని తీర్చేందుకు నానా తంటాలు పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బెట్టింగులను నిర్వహించేందుకు చిరువ్యాపారస్తులను ఉపయోగిస్తూ, బెట్టింగులో పాల్గొనే వారి నుంచి డబ్బు వసూళ్లను వారితోనే చేయిస్తున్నట్లు సమాచారం.

 ఎన్నికల విధుల్లో పోలీసులు బిజీ బిజీ..
 ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్‌లో రోజుకు రూ.లక్షల్లో బెట్టింగులు గుట్టుచప్పుడు కాకుండా నడుస్తుంటాయి. బెట్టింగులను అరికట్టేందుకు పోలీసులు నిఘా పెంచి గట్టిగా కృషి చేస్తుండడంతో గతంలో బెట్టింగులను చాలా వరకు అరికట్టారు. కాని ఈ ఏడాది ఎన్నికల పుణ్యమాని బెట్టింగులు జోరందుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పోలీసుశాఖ బిజీగా మారడం బెట్టింగ్ రాయుళ్లలకు కలిసొచ్చింది. దీంతో  వారం రోజులుగా బెట్టింగులో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.

 బెట్టింగులో వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు పాల్గొంటున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు శాయశక్తులా విధులను నిర్వర్తిస్తుంటే, బెట్టింగులను ఎంతమేరకు పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో బెట్టింగు రాయుళ్లు ముందుకు వెళుతున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుంటూ బెట్టింగులతో పలువురు లక్షలు సంపాదిస్తుంటే, బెట్టింగులో పాల్గొన్న వారు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తండ్రులు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాల్లో బెట్టింగులో పాల్గొంటుంటే, వారి పిల్లలు ఐపీఎల్‌లో ఏ టీం గెలుస్తుందనే అంశాలపై బెట్టింగ్ చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement