
పిల్లలు కాదు.. పిడుగులు
* సృజనాత్మకతకు అద్దం పట్టిన విద్యార్థులు
* మ్యూజిక్, గానంలో ప్రతిభ
* నృత్యాలతో అదరగొట్టిన చిన్నారులు
* కథలతో ఆకట్టుకున్న పిల్లలు
కొత్తగూడెం : పిల్లలు కాదు. పిడుగులు అన్న విధంగా ఆ చిన్నారుల ప్రదర్శనలు సాగాయి. జాతీయస్థాయి బాలోత్సవ్‌లో చిన్నారులు ఒకరిని మించి ఒకరు ప్రదర్శనలు ఇచ్చిన ఔరా అనిపించారు. ఒకరిని మించిన ప్రతిభతో మరొకరు వారి సృజనాత్మకతను చాటిచెప్పారు. మూడు రోజుల పాటు కొత్తగూడెం పట్టణంలో క్లబ్‌లో నిర్వహించిన జాతీయస్థాయి బాలోత్సవ్(అంతర్ పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు) విజయవంతంగా ముగిశాయి.
చివరి రోజైన మూడో రోజు ఎనిమిది విభాగాల్లో పోటీలు జరుగగా సుమారు ఐదు వేల మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. భరతనాట్యం సీనియర్స్ విభాగంలో 150 మంది, కూచిపూడి సీనియర్స్ విభాగంలో 160 మంది, జానపద నృత్యం గ్రూప్ విభాగంలో 80 మంది, అనగ అనగా కథ చెబుతా విభాగం సబ్ జూనియర్స్‌లో 70 మంది, మట్టితో బొమ్మలు చేద్దాం సీనియర్స్ విభాగంలో 50 మంది, దాశరధి కవితలు సీనియర్స్ విభాగంలో 90, ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ రాగా విభాగంలో 120 మంది, తాళా విభాగంలో 150 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపారు.
సంగీతం.. గానంలో...
చివరిరోజు నిర్వహించిన ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ విభాగంలో విద్యార్థులు తమ ప్రతిభ చాటుకున్నారు. కీబోర్డ్, గిటార్, వీణ, పియానో, ఫ్లూట్ తదితర ఇన్‌స్ట్రుమెంట్స్‌తో వినసొంపైన రాగాలను పలికించారు. ఇన్‌స్ట్రుమెంట్ మ్యూజిక్ అంశంలో రాగ, తాళా విభాగాల్లో పోటీలు నిర్వహించడంతో సుమారు 270 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సినీ, లలిత, జానపద గీతాలాపన పోటీల్లో సైతం విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిభ చూపారు.
నృత్యాలతో అధరగొట్టిన పిల్లలు..
జానపదం, శాస్త్రీయ నృత్యం.. ఏ నృత్యమైనా మేం రెడీ అంటూ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జానపద నృత్యం జూనియర్స్, సీనియర్స్ విభాగాలతోపాటు గ్రూప్ డాన్స్ విభాగంలో పోటీలు జరిగాయి. కూచిపూడి, భరతనాట్యం అంశాల్లో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జానపద పోటీల్లో సుమారు 500 మంది పోటీపడగా శాస్త్రీయ నృత్య విభాగంలో సుమారు 300 మందికి పైగా పోటీపడ్డారు.
కథలతో ఆకట్టుకున్న చిన్నారులు...
నేడు కామిక్ బుక్స్, స్టోరీ బుక్స్‌కు అలవాటుపడిపోయిన చిన్నారులు కథల పోటీల్లో పాల్గొని తమ జ్ఞానాన్ని చాటుకున్నారు. అమ్మమ్మ, తాతయ్యలు చెప్పిన నీతి కథలను వింటూ నిద్రపోయే చిన్నారులు అవే కథలను పోటీల్లో చెప్పి ఆకట్టుకున్నారు. చందమామ కథలు, నీతి కథలు, చరిత్రను తెలియజేసే పలు కథలను ఎంతో వినసొంపుగా చెప్పారు. అదేవిధంగా దాశరధి కవితలు అనే అంశంలో సైతం విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.