ఒక స్వప్నం ఒక కుటుంబం | "Balotsav 'convener Ramesh Babu | Sakshi
Sakshi News home page

ఒక స్వప్నం ఒక కుటుంబం

Published Tue, Nov 1 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

‘బాలోత్సవ్’ కన్వీనర్ డా.వాసిరెడ్డి రమేశ్‌బాబుతో ఇంటర్వ్యూ

‘బాలోత్సవ్’ కన్వీనర్ డా.వాసిరెడ్డి రమేశ్‌బాబుతో ఇంటర్వ్యూ

బాలోత్సవ్

మంచి పని చేయాలని అందరికీ ఉంటుంది.
ఆలోచన గొప్పదే!
కానీ కార్యరూపం దాల్చాలంటే...
ఆ స్వప్నానికి ఒక కుటుంబం తోడు కావాలి.
అది భార్య పిల్లలు అమ్మ నాన్నే కాదు...
సమాజం అన్న కుటుంబం కావాలి!
కొత్తగూడెంలో రమేశ్‌బాబు పిల్లలకి చదువులే కాదు,
సృజనాత్మక పోటీలు అవసరమని ఒక వేదికను సమకూర్చారు.
అంతే! సమాజంలోని కుటుంబాలన్నీ ఆ వేదికకు తోరణాలు కట్టాయి.


అన్నీ రోడ్లు రోమ్‌కు దారితీస్తాయో లేదో కాని నవంబర్ వచ్చిందంటే చాలు అన్ని స్కూళ్లు కొత్తగూడెంకే దారి తీస్తాయి. నవ్వే పిల్లలు, ఉత్సాహంగా చేతులు ఊపే పిల్లలు, కళ్లు నక్షత్రాల్లా మెరిసే పిల్లలు... అత్యద్భుతమైన ప్రతిభను తమలో నింపుకున్న పిల్లలు... తమకు ఇంత ప్రతిభ ఉందని ఏమాత్రం తెలియని పిల్లలు వీరంతా కొత్తగూడెం వచ్చి తోటి పిల్లలను కలుస్తారు. పోటీల్లో కలబడతారు. గెలిచి ఆనందపడతారు. ఓడిపోయి మరుసటి సంవత్సరానికి కావలసిన పట్టుదలను ఓడిపోవడంలోని ఘనతను స్వీకరించి వెళతారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక సాదాసీదా పట్టణం ఇలాంటి వినూత్నమైన విన్యాసానికి పూనుకోవడం ఈ పిల్లల వేడుకను 24 ఏళ్లు నిర్వహించి 25వ ఏట నిర్వహించుకునే స్థితికి ఎదగడం ఏమాత్రం ఆషామాషీ కాదు. ఎంతో పట్టుదల, వాత్సల్యం, ప్రజల సహకారం, పిల్లల ఉత్సహం తోడైతేనే ఇది సాధ్యం అవుతుంది.

1991లో మొదలైన వేడుకలు
స్కూళ్లంటే చదువులు... హోమ్‌వర్క్‌లు... మార్కులు... ర్యాంకులు... ఇవి మాత్రమే కాదు. నిజానికి ఇవి పిల్లల జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆ సంగతి అందరూ మర్చి పోతున్నారు అనిపించింది కొత్తగూడెంకు చెందిన డాక్టర్ వాసిరెడ్డి రమేశ్‌బాబుకు. కొత్తగూడెం క్లబ్‌కు కార్యదర్శి అయిన వెంటనే క్లబ్ ద్వారా పిల్లలకు సృజనాత్మక కళల్లో ప్రోత్సాహం ఇవ్వాలని అనుకున్నారాయన. చక్కటి పాట పాడకుండా, గొప్పగా వేణువు ఊదకుండా, హాయిగా తోటి బాలలతో బృందనృత్యం చేయకుండా గడిచే బాల్యం బాల్యమే కాదనేది ఆయన భావనే.  పిల్లలకు చదువు మాత్రమే నూరి పోయాలనుకునే తల్లిదండ్రుల ఆలోచనాధోరణిలో మార్పు తేవడానికి కూడా ఆయన సాంస్కృతిక పోటీలు అవసరమని భావించారు. అలా మొదలయ్యిందే ‘బాలోత్సవ్’. 1991లో ఏ ముహూర్తాన ఆ ఉత్సవం మొదలైందో కాని పదులు వందల సంఖ్యల్లో పాల్గొనే వేడుక నుంచి నేడు దాదాపు 15000 మంది బాలలు పాల్గొనే ఉత్సవంగా అది ఎదిగింది. అందరూ గర్వపడే స్థాయికి చేరింది.

ఈసారి నాలుగురోజుల పాటు...
ప్రతి సంవత్సరం 3 రోజులపాటు నిర్వహించే బాలోత్సవ్ ఈసారి రజతోత్సవం సందర్భంగా 4 రోజులపాటు జరగనుంచి. వివిధ రంగాలలో నిష్ణాతులుగా పేరొంది, బాలలకు స్ఫూర్తిదాయకంగా నిలిచే అగ్రగణ్యులను ఈ ఉత్సవాలకు ఆహ్వానించనున్నారు. ప్రముఖ కవి గూడ అంజయ్య కవితలపై  పోటీలు నిర్వహించనున్నారు. తొలుత భరతనాట్యం, వక్తృత్వం, క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలకే పరిమితమైన బాలోత్సవ్ ఇప్పుడు బాలల చేత వీధినాటికలు వేయించి వాటిని విశ్లేషించడం, షార్ట్‌ఫిల్మ్స్ (లఘుచిత్రాలు) చూపించి వాటి ప్రాధాన్యతను విశ్లేషించడం వంటి 29 రకాల పోటీలు నిర్వహిస్తున్నది. మొత్తం 29 అంశాల్లో 48 విభాగాలలో పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం  క్లబ్ ప్రాంగణంలో 12 వేదికలు ఏర్పాటు కానున్నాయి. ఈ వేదికలపై ఏకకాలంలో పోటీలు జరుగుతుంటాయి.

ప్రతి ఇల్లూ విడిదే...
కొత్తగూడెంలో పెద్ద పెద్ద హోటళ్లు లేవు. వేలాది గదులు ఉన్న బసలు లేవు. మరి ఇంత పెద్ద వేడుక ఎలా జరుగుతున్నట్టు? కొత్తగూడెం వాసుల వల్లే. అక్కడ బాలోత్సవ జరిగే ఈ నాలుగురోజులూ ప్రతి ఇల్లూ ఒక విడిది గృహం అయిపోతుంది. ప్రతి నివాసం ఒక ఆత్మీయ సదనం అయిపోతుంది. బాలోత్సవ్‌కు సహకరించేదుకు ముందుకు వచ్చిన కుటుంబాలు తమకు కేటాయించిన పిల్లలకూ వారి తల్లిదండ్రులకూ తమ ఇంట్లోనే విడిడి కల్పిస్తారు. వారికి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ పోటీల్లో పాల్గొనేందుకు సహకరిస్తారు. అంతేకాదు తమ పిల్లలను సైతం క్రమం తప్పకుండా ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా కొత్తగూడెం వాసులు ఉత్సాహపరుస్తూ ఈ వేడుకు విజయం కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈసారి బాలోత్సవ్ పోటీ అంశాలు    
1. చిత్రలేఖనం (స్పాట్ డ్రాయింగ్); 2. తెలుగు మాట్లాడుదాం; 3. వీధినాటికా విశ్లేషణ (స్ట్రీట్ ప్లే ఎనాలసిస్); 4. లఘుచిత్ర సమీక్ష (షార్ట్ ఫిలిం రివ్యూ); 5. కవితా రచన; 6. కథారచన; 7. కథా విశ్లేషణ; 8. భరత నాట్యం; 9. కూచిపూడి;  10. పేరిణి నాట్యం (లాస్యం - తాండవం, సోలో); 11. జానపద నృత్యం; 12. క్విజ్; 13. సినీ, లలిత జానపద గీతాలు; 14. విచిత్ర వేషాధారణ (ఫ్యాన్సీడ్రెస్); 15. అనగా అనగా.. (కథచెబుతా వింటారా!); 16. నీతి పద్యం; 17. లేఖారచన; 18. వ్యర్థంతో అర్థం 19. వాద్య సంగీతం (ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజికల్);  20. గ్రూప్ డాన్స్ జానపదం (అందరికీ); 21. నాటికలు; 22. మట్టితో బొమ్మలు చేద్దాం; 23. ఏకపాత్రాభి నయం 24. స్పెల్ బీ; 25. వక్తృత్వం (ఇంగ్లీష్, తెలుగు); 26. గ్రూప్‌డాన్స్ భరతనాట్యం (అందరికీ); 27. గ్రూప్‌డాన్స్ కూచిపూడి నృత్యం (అందరికీ); 28. సంప్రదాయం 29. గూడ అంజయ్య గీతాలు

 

పిల్లల  ముఖాల్లో సంతోషం చూశా!
మీరొక డాక్టరు. మీకు ఉంటే పేషంట్లతో అనుబంధం ఉండాలి. మరి పిల్లలంటే ఎందుకింత ప్రేమ....
రమేశ్: నేను వృత్తిరీత్యా డాక్టర్‌నే అయినా నాలోనూ ఒక తండ్రి తాత ఉన్నాడు. నేను కూడా బాల్యాన్ని గడిపి పెద్దవాణ్ణయ్యాను. మా అమ్మది మధిర దగ్గర మహదేవపురం. నాన్నది తెనాలి దగ్గర చెన్నపాలెం. నేను రైతు కుటుంబంలో జన్మించాను. పల్లెటూరూ ఏటి గట్టున స్వేచ్ఛగా ఆడుకోవడం ఇలాంటి బాల్యం నాకు తెలుసు. రాను రాను ఆ బాల్యం మిస్సవడం గమనించాను. పాఠశాలలు కారాగారాల్లా మారాయి. చదువుతో పాటు ఆటా పాటా కళ ఉండేదే నిజమైన పాఠశాల. పిల్లలు స్కూళ్లలో ఏవైతే మిస్సవుతున్నారో అవి బాలోత్సవ్‌లో ఉండాలని ఈ ఉత్సవాన్ని మొదలెట్టాం.

ఈ పనిలో మీకు తోడు నిలిచింది ఎవరు?
చటర్జీగారని ఒక లెక్చరర్ చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు రిటైర్డ్ అధ్యాపకులు శర్మగారు,  సింగరెణి ఉద్యోగులు చంద్రశేఖర్, మాధవరావు గార్లు ఇంకా చాలామంది ఈ పనిలో నాకు సపోర్ట్‌గా ఉన్నారు.

25 సంవత్సరాలలో మీకు బాగా సంతృప్తినిచ్చిన సంవత్సరం ఏది?
ప్రతి సంవత్సరం సంతృప్తినిచ్చింది. దానికి కొలబద్దగా పొగడ్తలని కాకుండా పిల్లల మొహాల్లో ఆనందాన్ని మేం తీసుకుంటాం. ఈ ఈవెంట్‌కు వచ్చిన పిల్లలు ఎవరూ డిజప్పాయింట్ అవరు.

ఈ బాలోత్సవ్ వల్ల మీరేమి సాధించారు?
ఒక పిల్లవాడు వెయ్యి మంది పిల్లల ఎదుట నిలుచుని ఒక కథ చెబుతాయి. ఒక అమ్మాయి పాట పాడుతుంది. ఇంకొందరు ఒక నాటకం వేస్తారు. ఇవన్నీ ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచేవే. పర్సనాల్టీ డెవలప్‌మెంట్ అంటే కొటేషన్స్ చెప్పడం కాదు. ఇలాంటి పనులు చేయాలి. బాలోత్సవ్ సాధించినది మానసిక ఫలితాలను. అవి పైకి కనిపించేవి కాదు.

సాహిత్యాన్ని కూడా ఇన్‌వాల్వ్ చేసినట్టున్నారు?
అవును. మేము కథారచనను, కథాపఠనాన్ని ఒక ముఖ్యమైన పోటీగా బాలోత్సవ్‌లో నిర్వహిస్తాం. పిల్లలు అప్పటికప్పుడు ఒక కథ రాస్తారు. చాలా బాగా రాస్తారు. వాసిరెడ్డి నవీన్, ఓల్గా, వాడ్రేవు వీరలక్ష్మిదేవి, చంద్రలత వంటి సాహిత్యకారులు నేరుగా బాలోత్సవ్‌లో పాల్గొని పిల్లలతో సంభాషించడంమంచి రిజల్ట్స్‌కు కారణం.

ఈసారి ఎన్నిరాష్ట్రాల నుంచి పిల్లలు వస్తున్నారు?
తెలుగు మాతృభాషగా కలిగినవారు ఏ రాష్ట్రంలో ఉన్నా పాల్గొనవచ్చని చెబుతున్నాం. ఈసారి ఆంధ్ర, తెలంగాణ, చత్తిస్‌గఢ్, డిల్లీ, కర్నాటక, పాండిచ్చేరి, గుజరాత్... రాష్ట్రాల నుంచి పిల్లలు పాల్గొంటారు.

ప్రతి రోజూ సుమారు ఎంతమంది పాల్గొంటారు?
ఎన్నివేలో సరిగ్గా చెప్పలేను. కాని కొత్తగూడెం వాళ్లు కాకుండా సుమారు 7000 మంది ఈ పోటీల్లో పాల్గొంటారు. ఎందుకంటే మేము అంతమందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు రాత్రికి వెళ్లిపోగా 5000 మంది రాత్రి పూట భోజనం చేస్తారు.

డబ్బు ఎలా చేస్తారు?
ఎవర్నీ రూపాయి అడగం. మా పని తెలిసి తమకు తాము ఇచ్చేవారే అందరూ.  కెసిపి సిమెంట్స్ ఇందిరాదత్‌గారు, ఆగ్రోటెక్ సాంబశివరావుగారు ముఖ్యులు. మా అన్న కొడుకు శ్రీనివాసరావు - బాబాయ్... నువ్వు మంచిపని చేస్తున్నావు భోజనం ఖర్చులు నేను చూసుకుంటాను అని వాడే చూసుకుంటున్నాడు.

దీని కొనసాగింపు ఏమిటి?
బాలోత్సవ్ ఒక్క కొత్తగూడెంలోనే కాదు ప్రతి ఊళ్లోనూ జరగాలని నా కోరిక. ప్రతి ఊళ్లోనూ పిల్లలకు ఇలాంటి వేదికలు కావాలి. మమ్మల్ని చూసిన తర్వాత భద్రాచలంలో, మధిరలో  చేస్తున్నారు. కాకినాడలో భారీగా బాలోత్సవం జరుగుతోంది. ఇక మీదట చిలుకలూరిపేట, విజయవాడ, గుంటూర్లలో చేయడానికి ఆ ప్రాంతవాసులు ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement