రేపటి నుంచి ‘బాలోత్సవ్-14’
* వేదిక కానున్న కొత్తగూడెం
* ఆరు రాష్ట్రాల నుంచి ఎంట్రీలు...
* 18 వేలమంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం
కొత్తగూడెం: జాతీయ స్థాయి బాలల పండుగ బాలోత్సవ్‌కు ఖమ్మం జిల్లా కొత్తగూడెం వేదిక కానుంది. మూడు రోజులపాటు జరగనున్న బాలోత్సవ్‌కు ఆరు రాష్ట్రాల నుంచి 18 వేల మంది విద్యార్థులు తరలి రానున్నారు. ది కేసీపీ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో కొత్తగూడెం క్లబ్‌లో ఈనెల 7, 8, 9 తేదీల్లో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి సింగరేణి డెరైక్టర్ (పా) టి.విజయ్ కుమార్, ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్, వాగ్గేయకారుడు అంద్శై సినీ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.మొత్తం 24 అంశాలను 40 విభాగాలుగా చేసి పోటీలు నిర్వహిస్తున్నారు. 12 వేదికలు ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. పోటీల్లో గెలుపొందిన ప్రతి విభాగంలో మొదటి మూడు స్థానాలతోపాటు రెండు ప్రత్యేక బహుమతులు, ఇందులో పాల్గొన్న ప్రతి పాఠశాలకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు.
కీర్తిపతాకను ఎగురవేద్దాం: రమేష్‌బాబు
బాలోత్సవ్‌ను ఘనంగా నిర్వహించి కొత్తగూడెం పట్టణ కీర్తి పతాకాన్ని దేశ నలుమూలలా చాటి చెబుదామని బాలోత్సవ్ కన్వీనర్, ప్రముఖ వైద్యులు వాసిరెడ్డి రమేష్‌బాబు అన్నారు. బుధవారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాడుతూ.. 23 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ బాలల పండుగ మండల స్థాయి నుంచి నేడు జాతీయ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఏడాదికేడాది బాలోత్సవ్‌లో మార్పులు రావడం హర్షణీయమన్నారు.
మొదట నాలుగు కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ బాలోత్సవ్ నేడు 24 అంశాల్లో 40 విభాగాలతో నిర్వహించే స్థాయికి చేరుకుందన్నారు. ఇప్పటికే ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, పాండిచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ పాఠశాలల నుంచి ఎంట్రీలు వచ్చాయని, సుమారు 18 వేల మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలను కల్పించినట్లు రమేష్‌బాబు చెప్పారు.