Balotsav
-
సృజనాత్మకత బయటపడుతుంది...
విజయవాడ (మొగల్రాజపురం): ఎప్పుడు చదువే కాకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల వైపు దృష్టి పెట్టడం వల్ల వారిలో ఉన్న సృజనాత్మకత బయటపడుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలోత్సవ్–2016 పేరుతో పాఠశాల స్థాయి విద్యార్థులకు పి.బి.సిద్ధార్థ ఆడిటోరియంలో వివిధ అంశాల్లో సోమవారం పోటీలు నిర్వహించారు. అనురాధ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్స్ వారు సంఘంగా ఏర్పడి ఐదేళ్లుగా క్రమం తప్పకుండా బాలోత్సవ్ నిర్వహిస్తున్న సంఘం సభ్యులను అభినందించారు. సభకు అధ్యక్షత వహించిన విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు చండ్ర సరళ మాట్లాడుతూ స్పోర్ట్స్, అకడమిక్, కల్చరల్ విభాగాల్లో సుమారు 80కి పైగా అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. బాలోత్సవ్–2016 కన్వీనర్ వెనిగళ్ల మురళీమోహన్ మాట్లాడుతూ ఐదేళ్లుగా క్రమం తప్పకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సుందరరామ్ మాట్లాడుతూ విద్యార్ధుల మానసిక, శారీరక ఎదుగుదలకు పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పారు. కార్యక్రమంలో వి.సి.యస్.అండ్ టి.ఏ. కార్యదర్శి దాసరి వెంకటనాగసుధాకర్, కోశాధికారి అనుమాటి చెన్నయ్య, మీడియా కో ఆర్డినేటర్ ఎ.సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. సందడే...సందడి... ఎప్పుడూ తరగతి గదుల్లో ఉండే చిన్నారులు ఒక్కసారిగా బయటకు వచ్చి సందడి చేశారు. సభ అనంతరం మొదలైన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆ«ధ్యంతం ఆకట్టుకున్నాయి. క్లాసికల్ డ్యాన్స్‌లో భక్తి పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. శివపార్వుతులు, హరిదాసు, హనుమంతుడు, పెళ్ళికూతురు, అల్లూరి సీతారామరాజు, సరస్వతిదేవి, మహిషాసురమర్ధిని, కృష్ణుడు వంటి వేషాలు ఆకట్టుకున్నాయి. జానపద నృత్యాలతో అదరగొట్టారు. వి.పి.సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆవరణలోని మైదానంలో విద్యార్థులకు స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించారు. బేబీ జూనియర్స్‌కు పలు పోటీలు నిర్వహించారు. విజేతలకు బుధవారం జరిగే ముగింపు సభలో బహుమతులు అందచేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
ఘనంగా ముగిసిన బాలోత్సవ్ వేడుకలు
-
బాల్యాన్ని చిదిమేయొద్దు
- బాలోత్సవ్ ముగింపు వేడుకల్లో మంత్రి కేటీఆర్ - బాలోత్సవ్ విశ్వవ్యాప్తం కావడానికి చర్యలు తీసుకుంటాం - దీనికి భవిష్యత్‌లో సీఎం కేసీఆర్ వస్తారు: తుమ్మల సాక్షి, కొత్తగూడెం: అలవిగాని కోరికలతో పసి హృదయాలపై ఒత్తిడితో కూడిన చదువుల భారం మోపవద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోరారు. మానవీయత, నైతిక విలువలు పెంపొందించే సమాజం సృష్టిం చడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నాలుగు రోజులపాటు జరిగిన జాతీయస్థారుు బాలోత్సవ్ ఆదివారం ముగిసింది. ఉదయం నుంచి విద్యార్థులు తమ ప్రదర్శనలతో హోరెత్తించారు. రాత్రి జరిగిన ముగింపు సభలో మంత్రి మాట్లాడుతూ బాలోత్సవ్‌ను రాష్ట్ర, జాతీయ స్థారుులో మరింత మెరుగులు దిద్దుతూ నిర్వహించాలని, ఇందుకు అవసరమైతే ప్రభుత్వం బాధ్యత తీసుకుని బాలల వేడుకలను మరింత ప్రయోజనకరంగా నిర్వహించేందుకు తోడ్పడుతుందన్నారు. పసిమనసుల్లో చదువుల భారం పెరుగుతోందని, కళాత్మకత, సమాజం లోని అంశాలను తెలుసుకునే సమయం తగ్గిపోతోందని, పుస్తకాలతో కుస్తీపట్టడంతోపాటు మానసిక ఉల్లాసానికి ఉపయోగపడే అంశాలపై తల్లిదండ్రులు దృష్టి సారిం చాలని కోరారు. తండ్రిగా తాను సైతం అదే బాటలో నడుస్తానని కేటీఆర్ వివరించారు. బాలల మనోవికాసానికి ఉపయోగపడే బాలోత్సవ్‌ను రెండున్నర దశాబ్దాలపాటు ఏకనాయకత్వం నిరాటంకంగా నిర్వహించడం చరిత్రాత్మక మని, ఈ అద్భుత ఘట్టానికి కారకులైన డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబును అభినందిస్తున్నామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ బాలోత్సవ్‌కు భవిష్యత్తులో సీఎం కేసీఆర్ హాజరవుతారన్నారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ నలుగురు తెలుగువాళ్లు ఉన్నచోట అనేక సంఘాలు ఏర్పడతాయన్న నానుడికి భిన్నంగా రెండున్నర దశాబ్దాలపాటు బాలల సేవలో తరిస్తూ బాలల మనోవికాసానికి అన్నీ తానై నిర్వహిస్తున్న కొత్తగూడెం బాలోత్సవ్ నిర్వాహకులు అభినందనీయులన్నారు. అమెరికా వంటి దేశాల్లో వక్తలు అమూల్యమైన సందేశమిస్తున్న సమయంలో తమ ఆనందాన్ని ఆమోదాన్ని ప్రకటించడానికి సభికులు నిల్చుని చప్పట్లు కొట్టి ప్రోత్సహించే సంప్రదాయం ఉందని, దీనిని స్టాండింగ్ ఒబేషన్ అంటారని, ఇదే ఒరవడి, సంప్రదాయం తెలుగు ప్రాంతాల్లో ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. తెలుగు వారికి ఆగ్రహం ప్రదర్శించడమే తెలుసునన్న భావన నుంచి.. నిల్చుని చప్పట్లు కొట్టే పద్ధతి పాటించి తెలుగువాళ్ల మనసేమిటో.. భావజాలమేమిటో ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. బాలోత్సవ్ విశ్వవ్యాప్తం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని, కార్యక్రమాలను సీఎం, పీఎంల దృష్టికి వెళ్లాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మెల్యే జలగం వెంకటరావు మాట్లాడారు. సభలో వందేమాతరం శ్రీనివాస్ చదువుల భారంపై వినిపించిన గేయం ఆకట్టుకుంది. సభకు బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేశ్‌బాబు అధ్యక్షత వహించగా పరుచూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మినారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి, స్టార్ హాస్పిటల్ అధినేత గోపీచంద్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, మున్సిపల్ చైర్పర్సన్ గీత తదితరులు పాల్గొన్నారు. -
భళా.. బాలోత్సవ్
అలరించిన ప్రదర్శనలు నేడు ముగింపు వేడుకలు సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరుగుతున్న బాలల పండుగ బాలోత్సవ్ మూడో రోజూ ఉత్సాహభరితంగా కొనసాగింది. పాఠశాలల్లో తరగతి గదులకే పరిమితమనుకున్న విద్యార్థులు బాలోత్సవ్‌లో తమలోని కళను ప్రదర్శించి అబ్బురపరిచారు. ఈ నెల 10న ప్రారంభమైన బాలోత్సవ్‌లో భాగంగా మూడోరోజు శనివారం వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి నిర్విరామంగా కొనసాగిన కార్యక్రమాల్లో వేలాది మంది చిన్నారులు వివిధ అంశాల్లో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి న్యాయ నిర్ణేతలనే ఆలోచనలో పడేశారు. సుమారు 14 వేదికలపై నిరంతరంగా కొనసాగిన పలు కళా ప్రదర్శనల్లో అనేకం సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉన్నారుు. వరకట్నపు జాఢ్యాన్ని నిర్మూలించాలన్న సందేశాత్మక నృత్యంతోపాటు గ్రామీణ వాతావరణానికి అద్దంపట్టి ఐక్యతారాగాన్ని ఆలపించేలా చేసిన పలు జానపద గీతాలు, నృత్యాలు ఆకట్టుకున్నారుు. ఇక పేరిణి నాట్యం శనివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనేకమంది చిన్నారులు పోటాపోటీగా పేరిణి ప్రదర్శనలు చేయడంతో న్యాయనిర్ణేతలు ఆలోచనలో పడాల్సి వచ్చింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలలో పలువురు విద్యార్థినులు చేసిన సాహసోపేతమైన ప్రదర్శనలు ప్రేక్షకులను కనులవిందు చేశారుు. విద్యార్థుల్లో కళాత్మకతను వెలికితీసేందుకు మట్టితో బొమ్మలు చేసే అంశంలో నిర్వహించిన పోటీలో పలువురు పోటీపడి అద్భుత కళాఖండాలను సృష్టించారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు మట్టివిగ్రహాల ప్రాధాన్యతను వివరించారు. ఈ బాలోత్సవ్ ఆదివారం ముగియనుంది. ఏడు రాష్ట్రాల నుంచి వేలాది మంది బాలలు ఈ వేదికపై కళా ప్రదర్శనలిచ్చి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. అనేకమంది బాలలకు ఇక్కడి బాష తెలియకపోరుునా తమ హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. నేటితో ముగియనున్న బాలోత్సవ్.. ఈనెల 10న ప్రారంభమైన బాలోత్సవ్ ఆదివా రంతో ముగియనుంది. ముగింపు సభకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రముఖ సినీ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, రసమరుు బాలకిషన్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరు కానున్నారు -
అంబరాన్నంటిన బాలోత్సవ్
► వ్యర్థానికి అర్థం చెప్పిన చిన్నారులు ► ఆలోచింపజేసిన కార్యక్రమాలు ► ఆకట్టుకున్న ప్రదర్శనలు సాక్షి, కొత్తగూడెం: బాలల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి.. వారిలోని ప్రతిభా పాటవాలను చాటిచెప్పేందుకు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహిస్తున్న బాలల పండగ బాలోత్సవ్‌కు రెండో రోజైన శుక్రవారం అనూహ్య స్పందన లభించింది. దాదాపు 7 రాష్ట్రాలకు చెందిన బాలబాలికలు వివిధ అంశాల్లో తమ ప్రతిభను చాటేందుకు బాలోత్సవ్‌ను వేదికగా చేసుకున్నారు. కొత్తగూడెం క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన 14 వేదికలపై జూనియర్, సీనియర్ విభాగాలకు పోటీలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం కథారచన, భరతనాట్యం, కూచిపూడి, నీతిపద్యాలు, ఏకపాత్రాభినయం, ఫోక్ డాన్స, ఫ్యాన్సీ డ్రెస్, స్పెల్‌బీ, సినీ, లలిత, జానపద గీతాలు, క్విజ్, లేఖారచన, వ్యర్థంతో అర్థం, నాటికలు నిర్వహించారు. అనేక మంది విద్యార్థులు వ్యర్థ వస్తువులతో అద్భుతాలు సృష్టించి వేదికపై ప్రదర్శించడం, వాటి ప్రయోజనాలను వివరణాత్మకంగా విశ్లేషించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎందుకూ పనికిరావనుకున్న అరటి తొక్కలను ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న అంశాన్ని ఇల్లెందు మండలం మాదారం పాఠశాలకు చెందిన విద్యార్థులు వివరించారు. అరటి తొక్కను రెండు రోజులపాటు నానబెట్టి, అనంతరం పెరట్లో పెరుగుతున్న మొక్కలకు ఔషధంగా వేస్తే అవి అద్భుతంగా పెరుగుతాయని వివరించిన తీరు ఆకట్టుకుంది. ఇక చెత్త కాగితాలతో తమకేం పని అనుకునే వారికి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో.. పాల్వంచకు చెందిన డీఏవీ పాఠశాల విద్యార్థులు వివరించారు. చిత్తు కాగితాలు, వాడి పడేసిన ఇంజక్షన్ బాటిళ్లతో చీకటి గదుల్లో వెలుగులు నింపవచ్చని నిరూపించారు. వీటిని బెడ్ ల్యాంప్‌లుగా ఎలా చేయాలో చూపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాలబాలికలు చేసిన జానపద, కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ ఖమ్మంలోని జాన్సన్ కిడ్స పాఠశాలకు చెందిన విద్యార్థి చేసిన నృత్యం ఆకట్టుకుంది. అలాగే ఓ చిన్నారి ‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా.. రక్తబంధం విలువ నీకు తెలియ దురా’ పాటకు చేసిన నృత్యం ఆకట్టుకుంది. పలువురు చిన్నారులు ఫ్యాన్సీ డ్రెస్, తమ వేషభాషల తో, హావభావాలతో ఇచ్చిన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరింపజేశాయి. బాలోత్సవ్ కన్వీనర్ రమేష్‌బాబు అన్ని వేదికలను పర్యవేక్షిస్తూ.. కార్యక్రమాలను వీక్షించారు. -
ఒక స్వప్నం ఒక కుటుంబం
బాలోత్సవ్ మంచి పని చేయాలని అందరికీ ఉంటుంది. ఆలోచన గొప్పదే! కానీ కార్యరూపం దాల్చాలంటే... ఆ స్వప్నానికి ఒక కుటుంబం తోడు కావాలి. అది భార్య పిల్లలు అమ్మ నాన్నే కాదు... సమాజం అన్న కుటుంబం కావాలి! కొత్తగూడెంలో రమేశ్‌బాబు పిల్లలకి చదువులే కాదు, సృజనాత్మక పోటీలు అవసరమని ఒక వేదికను సమకూర్చారు. అంతే! సమాజంలోని కుటుంబాలన్నీ ఆ వేదికకు తోరణాలు కట్టాయి. అన్నీ రోడ్లు రోమ్కు దారితీస్తాయో లేదో కాని నవంబర్ వచ్చిందంటే చాలు అన్ని స్కూళ్లు కొత్తగూడెంకే దారి తీస్తాయి. నవ్వే పిల్లలు, ఉత్సాహంగా చేతులు ఊపే పిల్లలు, కళ్లు నక్షత్రాల్లా మెరిసే పిల్లలు... అత్యద్భుతమైన ప్రతిభను తమలో నింపుకున్న పిల్లలు... తమకు ఇంత ప్రతిభ ఉందని ఏమాత్రం తెలియని పిల్లలు వీరంతా కొత్తగూడెం వచ్చి తోటి పిల్లలను కలుస్తారు. పోటీల్లో కలబడతారు. గెలిచి ఆనందపడతారు. ఓడిపోయి మరుసటి సంవత్సరానికి కావలసిన పట్టుదలను ఓడిపోవడంలోని ఘనతను స్వీకరించి వెళతారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక సాదాసీదా పట్టణం ఇలాంటి వినూత్నమైన విన్యాసానికి పూనుకోవడం ఈ పిల్లల వేడుకను 24 ఏళ్లు నిర్వహించి 25వ ఏట నిర్వహించుకునే స్థితికి ఎదగడం ఏమాత్రం ఆషామాషీ కాదు. ఎంతో పట్టుదల, వాత్సల్యం, ప్రజల సహకారం, పిల్లల ఉత్సహం తోడైతేనే ఇది సాధ్యం అవుతుంది. 1991లో మొదలైన వేడుకలు స్కూళ్లంటే చదువులు... హోమ్‌వర్క్‌లు... మార్కులు... ర్యాంకులు... ఇవి మాత్రమే కాదు. నిజానికి ఇవి పిల్లల జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆ సంగతి అందరూ మర్చి పోతున్నారు అనిపించింది కొత్తగూడెంకు చెందిన డాక్టర్ వాసిరెడ్డి రమేశ్‌బాబుకు. కొత్తగూడెం క్లబ్‌కు కార్యదర్శి అయిన వెంటనే క్లబ్ ద్వారా పిల్లలకు సృజనాత్మక కళల్లో ప్రోత్సాహం ఇవ్వాలని అనుకున్నారాయన. చక్కటి పాట పాడకుండా, గొప్పగా వేణువు ఊదకుండా, హాయిగా తోటి బాలలతో బృందనృత్యం చేయకుండా గడిచే బాల్యం బాల్యమే కాదనేది ఆయన భావనే. పిల్లలకు చదువు మాత్రమే నూరి పోయాలనుకునే తల్లిదండ్రుల ఆలోచనాధోరణిలో మార్పు తేవడానికి కూడా ఆయన సాంస్కృతిక పోటీలు అవసరమని భావించారు. అలా మొదలయ్యిందే ‘బాలోత్సవ్’. 1991లో ఏ ముహూర్తాన ఆ ఉత్సవం మొదలైందో కాని పదులు వందల సంఖ్యల్లో పాల్గొనే వేడుక నుంచి నేడు దాదాపు 15000 మంది బాలలు పాల్గొనే ఉత్సవంగా అది ఎదిగింది. అందరూ గర్వపడే స్థాయికి చేరింది. ఈసారి నాలుగురోజుల పాటు... ప్రతి సంవత్సరం 3 రోజులపాటు నిర్వహించే బాలోత్సవ్ ఈసారి రజతోత్సవం సందర్భంగా 4 రోజులపాటు జరగనుంచి. వివిధ రంగాలలో నిష్ణాతులుగా పేరొంది, బాలలకు స్ఫూర్తిదాయకంగా నిలిచే అగ్రగణ్యులను ఈ ఉత్సవాలకు ఆహ్వానించనున్నారు. ప్రముఖ కవి గూడ అంజయ్య కవితలపై పోటీలు నిర్వహించనున్నారు. తొలుత భరతనాట్యం, వక్తృత్వం, క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలకే పరిమితమైన బాలోత్సవ్ ఇప్పుడు బాలల చేత వీధినాటికలు వేయించి వాటిని విశ్లేషించడం, షార్ట్‌ఫిల్మ్స్ (లఘుచిత్రాలు) చూపించి వాటి ప్రాధాన్యతను విశ్లేషించడం వంటి 29 రకాల పోటీలు నిర్వహిస్తున్నది. మొత్తం 29 అంశాల్లో 48 విభాగాలలో పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం క్లబ్ ప్రాంగణంలో 12 వేదికలు ఏర్పాటు కానున్నాయి. ఈ వేదికలపై ఏకకాలంలో పోటీలు జరుగుతుంటాయి. ప్రతి ఇల్లూ విడిదే... కొత్తగూడెంలో పెద్ద పెద్ద హోటళ్లు లేవు. వేలాది గదులు ఉన్న బసలు లేవు. మరి ఇంత పెద్ద వేడుక ఎలా జరుగుతున్నట్టు? కొత్తగూడెం వాసుల వల్లే. అక్కడ బాలోత్సవ జరిగే ఈ నాలుగురోజులూ ప్రతి ఇల్లూ ఒక విడిది గృహం అయిపోతుంది. ప్రతి నివాసం ఒక ఆత్మీయ సదనం అయిపోతుంది. బాలోత్సవ్‌కు సహకరించేదుకు ముందుకు వచ్చిన కుటుంబాలు తమకు కేటాయించిన పిల్లలకూ వారి తల్లిదండ్రులకూ తమ ఇంట్లోనే విడిడి కల్పిస్తారు. వారికి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ పోటీల్లో పాల్గొనేందుకు సహకరిస్తారు. అంతేకాదు తమ పిల్లలను సైతం క్రమం తప్పకుండా ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా కొత్తగూడెం వాసులు ఉత్సాహపరుస్తూ ఈ వేడుకు విజయం కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈసారి బాలోత్సవ్ పోటీ అంశాలు 1. చిత్రలేఖనం (స్పాట్ డ్రాయింగ్); 2. తెలుగు మాట్లాడుదాం; 3. వీధినాటికా విశ్లేషణ (స్ట్రీట్ ప్లే ఎనాలసిస్); 4. లఘుచిత్ర సమీక్ష (షార్ట్ ఫిలిం రివ్యూ); 5. కవితా రచన; 6. కథారచన; 7. కథా విశ్లేషణ; 8. భరత నాట్యం; 9. కూచిపూడి; 10. పేరిణి నాట్యం (లాస్యం - తాండవం, సోలో); 11. జానపద నృత్యం; 12. క్విజ్; 13. సినీ, లలిత జానపద గీతాలు; 14. విచిత్ర వేషాధారణ (ఫ్యాన్సీడ్రెస్); 15. అనగా అనగా.. (కథచెబుతా వింటారా!); 16. నీతి పద్యం; 17. లేఖారచన; 18. వ్యర్థంతో అర్థం 19. వాద్య సంగీతం (ఇన్స్ట్రుమెంటల్ మ్యూజికల్); 20. గ్రూప్ డాన్స్ జానపదం (అందరికీ); 21. నాటికలు; 22. మట్టితో బొమ్మలు చేద్దాం; 23. ఏకపాత్రాభి నయం 24. స్పెల్ బీ; 25. వక్తృత్వం (ఇంగ్లీష్, తెలుగు); 26. గ్రూప్‌డాన్స్ భరతనాట్యం (అందరికీ); 27. గ్రూప్‌డాన్స్ కూచిపూడి నృత్యం (అందరికీ); 28. సంప్రదాయం 29. గూడ అంజయ్య గీతాలు పిల్లల ముఖాల్లో సంతోషం చూశా! మీరొక డాక్టరు. మీకు ఉంటే పేషంట్లతో అనుబంధం ఉండాలి. మరి పిల్లలంటే ఎందుకింత ప్రేమ.... రమేశ్: నేను వృత్తిరీత్యా డాక్టర్నే అయినా నాలోనూ ఒక తండ్రి తాత ఉన్నాడు. నేను కూడా బాల్యాన్ని గడిపి పెద్దవాణ్ణయ్యాను. మా అమ్మది మధిర దగ్గర మహదేవపురం. నాన్నది తెనాలి దగ్గర చెన్నపాలెం. నేను రైతు కుటుంబంలో జన్మించాను. పల్లెటూరూ ఏటి గట్టున స్వేచ్ఛగా ఆడుకోవడం ఇలాంటి బాల్యం నాకు తెలుసు. రాను రాను ఆ బాల్యం మిస్సవడం గమనించాను. పాఠశాలలు కారాగారాల్లా మారాయి. చదువుతో పాటు ఆటా పాటా కళ ఉండేదే నిజమైన పాఠశాల. పిల్లలు స్కూళ్లలో ఏవైతే మిస్సవుతున్నారో అవి బాలోత్సవ్‌లో ఉండాలని ఈ ఉత్సవాన్ని మొదలెట్టాం. ఈ పనిలో మీకు తోడు నిలిచింది ఎవరు? చటర్జీగారని ఒక లెక్చరర్ చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు రిటైర్డ్ అధ్యాపకులు శర్మగారు, సింగరెణి ఉద్యోగులు చంద్రశేఖర్, మాధవరావు గార్లు ఇంకా చాలామంది ఈ పనిలో నాకు సపోర్ట్‌గా ఉన్నారు. 25 సంవత్సరాలలో మీకు బాగా సంతృప్తినిచ్చిన సంవత్సరం ఏది? ప్రతి సంవత్సరం సంతృప్తినిచ్చింది. దానికి కొలబద్దగా పొగడ్తలని కాకుండా పిల్లల మొహాల్లో ఆనందాన్ని మేం తీసుకుంటాం. ఈ ఈవెంట్‌కు వచ్చిన పిల్లలు ఎవరూ డిజప్పాయింట్ అవరు. ఈ బాలోత్సవ్ వల్ల మీరేమి సాధించారు? ఒక పిల్లవాడు వెయ్యి మంది పిల్లల ఎదుట నిలుచుని ఒక కథ చెబుతాయి. ఒక అమ్మాయి పాట పాడుతుంది. ఇంకొందరు ఒక నాటకం వేస్తారు. ఇవన్నీ ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచేవే. పర్సనాల్టీ డెవలప్మెంట్ అంటే కొటేషన్స్ చెప్పడం కాదు. ఇలాంటి పనులు చేయాలి. బాలోత్సవ్ సాధించినది మానసిక ఫలితాలను. అవి పైకి కనిపించేవి కాదు. సాహిత్యాన్ని కూడా ఇన్వాల్వ్ చేసినట్టున్నారు? అవును. మేము కథారచనను, కథాపఠనాన్ని ఒక ముఖ్యమైన పోటీగా బాలోత్సవ్‌లో నిర్వహిస్తాం. పిల్లలు అప్పటికప్పుడు ఒక కథ రాస్తారు. చాలా బాగా రాస్తారు. వాసిరెడ్డి నవీన్, ఓల్గా, వాడ్రేవు వీరలక్ష్మిదేవి, చంద్రలత వంటి సాహిత్యకారులు నేరుగా బాలోత్సవ్‌లో పాల్గొని పిల్లలతో సంభాషించడంమంచి రిజల్ట్స్‌కు కారణం. ఈసారి ఎన్నిరాష్ట్రాల నుంచి పిల్లలు వస్తున్నారు? తెలుగు మాతృభాషగా కలిగినవారు ఏ రాష్ట్రంలో ఉన్నా పాల్గొనవచ్చని చెబుతున్నాం. ఈసారి ఆంధ్ర, తెలంగాణ, చత్తిస్గఢ్, డిల్లీ, కర్నాటక, పాండిచ్చేరి, గుజరాత్... రాష్ట్రాల నుంచి పిల్లలు పాల్గొంటారు. ప్రతి రోజూ సుమారు ఎంతమంది పాల్గొంటారు? ఎన్నివేలో సరిగ్గా చెప్పలేను. కాని కొత్తగూడెం వాళ్లు కాకుండా సుమారు 7000 మంది ఈ పోటీల్లో పాల్గొంటారు. ఎందుకంటే మేము అంతమందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు రాత్రికి వెళ్లిపోగా 5000 మంది రాత్రి పూట భోజనం చేస్తారు. డబ్బు ఎలా చేస్తారు? ఎవర్నీ రూపాయి అడగం. మా పని తెలిసి తమకు తాము ఇచ్చేవారే అందరూ. కెసిపి సిమెంట్స్ ఇందిరాదత్గారు, ఆగ్రోటెక్ సాంబశివరావుగారు ముఖ్యులు. మా అన్న కొడుకు శ్రీనివాసరావు - బాబాయ్... నువ్వు మంచిపని చేస్తున్నావు భోజనం ఖర్చులు నేను చూసుకుంటాను అని వాడే చూసుకుంటున్నాడు. దీని కొనసాగింపు ఏమిటి? బాలోత్సవ్ ఒక్క కొత్తగూడెంలోనే కాదు ప్రతి ఊళ్లోనూ జరగాలని నా కోరిక. ప్రతి ఊళ్లోనూ పిల్లలకు ఇలాంటి వేదికలు కావాలి. మమ్మల్ని చూసిన తర్వాత భద్రాచలంలో, మధిరలో చేస్తున్నారు. కాకినాడలో భారీగా బాలోత్సవం జరుగుతోంది. ఇక మీదట చిలుకలూరిపేట, విజయవాడ, గుంటూర్లలో చేయడానికి ఆ ప్రాంతవాసులు ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి? -
గూడెం అంటే బాలోత్సవ్ ..
కొత్తగూడెం అంటే అదే గుర్తుకు వస్తోంది.. ప్రముఖ రచయిత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ఘనంగా ‘బాలోత్సవ్–2016’ బ్రోచర్ ఆవిష్కరణ కొత్తగూడెం అర్బన్ : ‘ఒకప్పుడు బొగ్గు గనులు, కేటీపీఎస్ అంటే కొత్తగూడెం అని గుర్తు. కానీ, ఇప్పుడు బాలోత్సవ్ పేరు చెబితేనే కొత్తగూడెం గుర్తుకు వస్తోంది. అంతాల ఈ కార్యక్రమంల మదిలో నిలిచిపోయింది’ అని ప్రముఖ రచయిత, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అన్నారు. రజతోత్సవం జరుపుకుంటున్న బాలోత్సవ్–2016 బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వాహకుడు వాసిరెడ్డి రమేష్‌బాబు అధ్యక్షతన ఆదివారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా బాలోత్సవ్ బ్రోచర్‌ను ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థిని వర్షిత ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇనాక్ మాట్లాడుతూ ఎవరైతే తన కోసం ఇతరులు తెలుసుకోవాలని అనుకుంటారో.. వారిలో అగ్ని జ్వాల ఏర్పడి వారి లక్ష్య సాధనకు ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తే గొప్ప వ్యక్తులవుతారని చెప్పారు. సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు తయారు కావడానికి ఈ బాలోత్సవ్ ఎంతో ఉపయోగపడుతుందని కితాబునిచ్చారు. బాలలంటే.. బాలోత్సవ్.. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ కుల, మతాలు, పేద, గొప్ప తేడాలు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు అన్ని వర్గాల వారిని ఏకీకృతం చేస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలని, రాష్ట్రంలోని కళారంగ శాఖకు సంబంధించిన వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. సాహిత్యం, సాంస్కృతిక రంగాలు ఎంతో గొప్పవని, వాటికి అంతముండదని, వాటిని విస్మరించే వారికి రోజులుండవని పేర్కొన్నారు. రజతోత్సవ వేడుకలు నిర్వహించబోతున్నాం.. బాలోత్సవ్ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్‌బాబు మాట్లాడుతూ చిన్న బిందువుగా మొదలై.. మహా సముద్రంగా బాలోత్సవ్ మారిందని, ఈ ఏడాది 25వ సంవత్సర రజతోత్సవ వేడుకలు నిర్వహించబోతున్నామన్నారు. 25 సంవత్సరాలుగా బాలోత్సవ్ నిర్వహణకు సహకరిస్తున్న క్లబ్ సభ్యులకు, పట్టణ ప్రజలకు ధన్యవాదలు తెలిపారు. బాలోత్సవ్‌లో జరుగుతున్న కార్యక్రమాల ద్వారా విద్యార్థులు అనేక అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారని తెలిపారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలాల విద్యార్థులు 25 మంది చేత క్లబ్ ఆవరణలో మొక్కలు నాటించారు. ప్రముఖ నృత్య కళాకారిణి డాక్టర్ సీతాప్రసాద్ శిష్యబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పులి గీత, సింగరేణి ఉద్యోగి గుండా రమేష్, జేవీఎస్ చైతన్య కళాశాలల చైర్మన్ జేవీస్.చౌదరి, టీఆర్ఎస్ నాయకులు కంచర్ల చంద్రశేఖరరావు, కొదుమసింహం పాండురంగాచార్యులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎడారిలో ఒయాసిస్..బాలోత్సవ్
కొత్తగూడెం: ‘చిన్నారులు ఆడుకుందామంటే సరైన ఆటస్థలాలు లేవు.. చదువుకుందామంటే పుస్తకాలు సక్రమంగా లేవు.. ఇలాంటి పరిస్థితిలో చిన్నారుల్లో అభిరుచిని వెలికితీసేందుకు ఈ జాతీయ స్థాయి బాలోత్సవ్ ఎడారిలో ఒయాసిస్‌లా పని చేస్తుంది.’ అని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 24వ అంతర్‌బాలల సాంస్కృతిక ఉత్సవాలు (జాతీయ స్థాయి బాలోత్సవ్ - 2015) ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ఖమ్మంకు చెందిన బాలమేధావి ఎస్.కె. సాధిక్‌పాషా బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కోదండరాం మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులు వారి అభిరుచులకు అనుగుణంగా చదివే పరిస్థితులు లేవన్నారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో రంగంలో ప్రావీణ్యం ఉంటుందని, దానిని ప్రొత్సహిస్తే వారిలో ఉన్న ప్రతిభ, వారిని ఉన్నతస్థానాలకు తీసుకెళ్తుందన్నారు. గతంలో కొత్తగూడెం పట్టణం అంటే తనకు కేవలం బొగ్గు మాత్రమే గుర్తుకు వచ్చేదని, కానీ ఇప్పుడు ఇక్కడకు వచ్చిన తర్వాత ఇంతమంది చిన్నారులను చూసి మరోకోణం నేర్చుకున్నానన్నారు. 24 ఏళ్లుగా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమాన్ని మరో వందేళ్లపాటు కొనసాగించాలన్నారు. పిల్లలు పెద్దలై.. పెద్దలకు నేర్పే విషయాలను ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలన్నారు. వచ్చే ఏడాది కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరవుతానన్నారు. బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబు మాట్లాడుతూ 24 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వందల మంది తనకు తోడ్పాటునందించారన్నారు. బాలల కోసం ఏదైనా చేయాలనే తపనతో తాను ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖకవి అంద్శై మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు, కొత్తగూడెం ఆర్డీవో రవీంద్రనాథ్, డీఎస్పీ సురేందర్‌రావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, టీజేఏసీ జిల్లా చైర్మన్ కూరపాటి రంగరాజు, మున్సిపల్ చైర్పర్సన్ పులి గీత తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు 16 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీలకు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన పాఠశాలల నుంచి సుమారు తొమ్మిదివేల మంది బాలబాలికలు హాజరయ్యారు. -
టాటా.. వీడ్కోలు
ముగిసిన బాలోత్సవ్ * ఉల్లాసంగా తిరిగి వెళ్లిన చిన్నారులు * ఆరు రాష్ట్రాల నుంచి హాజరైన 18 వేల మంది * తొలిసారిగా ‘పేరిణి నృత్యం’, ‘మట్టిబొమ్మలు చేద్దాం’లో పోటీలు కొత్తగూడెం: చిట్టి పొట్టి మాటలు.. అదరగొట్టే డ్యాన్సులు.. అబ్బురపరిచే కళాకృతులు.. ఆలోచింపజేసిన చిన్నారుల ప్రదర్శనలు. జాతీయ బాలోత్సవ్ -14లో భాగంగా కొత్తగూడెంలో పట్టణంలో మూడు రోజులుగా సందడి చేసిన చిన్నారులు తిరిగి వెళ్లారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసి ఆనందంగా గడిపిన వారు ‘మళ్లీ వచ్చే ఏడాది వస్తాం.. అప్పుడు కలుద్దాం..’ అంటూ స్నేహితులకు వీడ్కోలు పలికారు. కొత్తగూడెం పట్టణంలో మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి 23వ అంతర్ పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు(బాలోత్సవ్ - 14) ఆదివారం ముగిశాయి. ఈ ఉత్సవాలకు ఆరు రాష్ట్రాలకు చెందిన 570 పాఠశాలలకు సుమారు 18వేలకుపైగా విద్యార్థులకు హాజరయ్యారు. బాలోత్సవ్ కార్యక్రమాన్ని ప్రముఖ రేలారే రేలా ఫేం సయ్యద్ రషీద్ ప్రారంభించారు. ప్రారంభవేడుకల్లో నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన తేజా స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఈ సారి పోటీల్లో పాల్గొనే వారి వివరాలు తెలియకుండా ఉండేందుకు నిర్వాహకులు వారికి నంబర్లు ఏర్పాటు చేశారు. వివిధ అంశాల్లో నిష్ణాతులైన వారిని న్యాయనిర్ణేతలుగా పిలిపించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో మొదటి రోజు ఐదు వేల మంది, రెండు రోజు ఎనిమిది వేల మంది, మూడో రోజు 5వేల మంది హాజరయ్యారు. మంత్రముగ్ధుల్ని చేసిన చిన్నారుల ప్రతిభ బాలోత్సవ్‌లో చిన్నారుల ప్రతిభను చూసిన వారు మంత్రముగ్ధులయ్యారు. పోటీల్లో భాగంగా ‘ వ్యర్థంలో అర్థం’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు తమ మేథస్సును చాటారు. నిత్యం వాడి పడేసిన వస్తువులను తిరిగి ఎలా వాడుకోవాలో వివరించిన చిన్నారుల మేధాశక్తిని చూసి పెద్దలు సైతం ఆశ్చర్య చకితులయ్యారు. వర్షం నీటిని మంచినీటిగా మార్చడం, కొబ్బరి పీచు, ప్లాస్టిక్ సీసాలను, చిరిగిన దుస్తులను తిరిగి ఎలా అందంగా, పనికివచ్చేలా తయారు చేసుకోవాలో తమ ప్రదర్శనల ద్వారా వివరించారు. చిట్టి గొంతుల నుంచి తియ్యని తెలుగుదనం.. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియం పుణ్యమాని మాతృభాషను మర్చిపోతున్న తరుణంలో బాలోత్సవ్ వేదికగా చిన్నారులు తమలోని తెలుగుదనాన్ని నిరూపించారు. తెలుగు మాట్లాడుదాం, కవితారచన, కథా విశ్లేషణ, నీతిపద్యం, అనగనగా కథ చెబుతా వింటారా.. పోటీలలో తెలుగు భాషపై తమకు ఉన్న పట్టును నిరూపించారు. ప్రస్తుతం సాంకేతిక విప్లవం రావడంతో లేఖలు మరిచిపోయిన నేపథ్యంలో లేఖారచన విభాగంలో నిర్వహించిన పోటీల్లో చిన్నారులు రాసిన ఉత్తరాలు చూసి న్యాయ నిర్ణేతలు సైతం అశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రకృతిపై ప్రేమను చాటిన చిన్నారులు.. పోటీలలో భాగంగా జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో చిన్నారులు ప్రకృతిపై తమకున్న ప్రేమను చాటారు. అడవులను నరకడం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ చేసినప్రదర్శనలు, అలంకరణలు ఆకట్టుకున్నాయి. వీటితోపాటు పండుగల సంస్కృతి, విష్ణుమూర్తి, రామాయణ ఘట్టం, గ్రామ దేవతల అలంకరణలు వేసి దేవుళ్లపై తమకున్న భక్తిని చాటుకున్నారు. ఉర్రూతలూగించిన జానపద నృత్యాలు.. బాలోత్సవ్‌లో ప్రధానంగా జానపదనృత్యాలకు ఎక్కువ ఆదరణ లభించింది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో జరిగిన పోటీలకు ఎక్కువగా మంది పాల్గొని తమ సత్తాచాటారు. ఒక్క జానపదనృత్యం విభాగంలోనే 450 ప్రదర్శనలు జరగడం గమనార్హం. క్లబ్‌లోని ప్రధాన స్టేడియంలో జరిగిన ఈ పోటీలను చూసేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపారు. చివరి రోజు గ్రూప్ డ్యాన్స్ విభాగంలో జరిగిన పోటీలకూ అత్యధికంగా ఎంట్రీలు రావడంతో రాత్రి వరకు పోటీలు కొనసాగాయి. చివరి రోజు జరిగిన పోటీల్లో జానపదనృత్యాలను చూసిన చిన్నారులు ఉల్లాసాన్ని నింపుకున్నారు. శాస్త్రీయతను మరువలేదు.. బాలోత్సవ్‌లో నిర్వహించిన కూచిపూడి, భరతనాట్యం పోటీలకు సైతం విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించారు. మూడు విభాగాల్లో 500 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. ఒకరిని మించి ఒకరు తామెవరికీ తీసిపోమని తమలోని ప్రతిభను చాటారు. నాటికల పోటీలకు కూడా మంచి స్పందన లభించింది. అలాగే చివరి రోజు ఏర్పాటు చేసిన ఇనుస్ట్రుమెంటల్ పోటీలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. తొలిసారిగా పేరిణి నృత్యం, మట్టితో బొమ్మలు చేద్దాం.. తెలంగాణ నృత్యంగా పేరున్న పేరిణి నృత్యాన్ని తొలిసారిగా జాతీయస్థాయి బాలోత్సవ్‌లో ప్రవేశపెట్టారు. మొదటిసారి అయినప్పటికీ ఈ పోటీకి విశేష స్పందన లభించింది. సుమారు 26 మంది కళాకారులు పేరిణి నృత్యంలో తమ ప్రతిభ కనపర్చారు. ఇక మట్టితో బొమ్మలు చేద్దాం అనే అంశానికి సైతం పిల్లల నుంచి మంచి స్పందన వచ్చింది. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీసి బొమ్మలను తయారుచేశారు. శివుడు, వినాయకుడి బొమ్మలతోపాటు గ్లోబల్ వార్మింగ్, ఆడపిల్లలను సంరక్షించాలని, కాకతీయ కళాతోరణం, ఎర్రకోట తదితర బొమ్మలను రూపొందించి ఆకట్టుకున్నారు. మూడురోజులపాటు విజయవంతంగా జరిగిన పోటీలకు హాజరైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నిర్వాహకులు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. -
పిల్లలు కాదు.. పిడుగులు
* సృజనాత్మకతకు అద్దం పట్టిన విద్యార్థులు * మ్యూజిక్, గానంలో ప్రతిభ * నృత్యాలతో అదరగొట్టిన చిన్నారులు * కథలతో ఆకట్టుకున్న పిల్లలు కొత్తగూడెం : పిల్లలు కాదు. పిడుగులు అన్న విధంగా ఆ చిన్నారుల ప్రదర్శనలు సాగాయి. జాతీయస్థాయి బాలోత్సవ్‌లో చిన్నారులు ఒకరిని మించి ఒకరు ప్రదర్శనలు ఇచ్చిన ఔరా అనిపించారు. ఒకరిని మించిన ప్రతిభతో మరొకరు వారి సృజనాత్మకతను చాటిచెప్పారు. మూడు రోజుల పాటు కొత్తగూడెం పట్టణంలో క్లబ్లో నిర్వహించిన జాతీయస్థాయి బాలోత్సవ్(అంతర్ పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు) విజయవంతంగా ముగిశాయి. చివరి రోజైన మూడో రోజు ఎనిమిది విభాగాల్లో పోటీలు జరుగగా సుమారు ఐదు వేల మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. భరతనాట్యం సీనియర్స్ విభాగంలో 150 మంది, కూచిపూడి సీనియర్స్ విభాగంలో 160 మంది, జానపద నృత్యం గ్రూప్ విభాగంలో 80 మంది, అనగ అనగా కథ చెబుతా విభాగం సబ్ జూనియర్స్‌లో 70 మంది, మట్టితో బొమ్మలు చేద్దాం సీనియర్స్ విభాగంలో 50 మంది, దాశరధి కవితలు సీనియర్స్ విభాగంలో 90, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ రాగా విభాగంలో 120 మంది, తాళా విభాగంలో 150 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపారు. సంగీతం.. గానంలో... చివరిరోజు నిర్వహించిన ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ విభాగంలో విద్యార్థులు తమ ప్రతిభ చాటుకున్నారు. కీబోర్డ్, గిటార్, వీణ, పియానో, ఫ్లూట్ తదితర ఇన్స్ట్రుమెంట్స్తో వినసొంపైన రాగాలను పలికించారు. ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ అంశంలో రాగ, తాళా విభాగాల్లో పోటీలు నిర్వహించడంతో సుమారు 270 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సినీ, లలిత, జానపద గీతాలాపన పోటీల్లో సైతం విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిభ చూపారు. నృత్యాలతో అధరగొట్టిన పిల్లలు.. జానపదం, శాస్త్రీయ నృత్యం.. ఏ నృత్యమైనా మేం రెడీ అంటూ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జానపద నృత్యం జూనియర్స్, సీనియర్స్ విభాగాలతోపాటు గ్రూప్ డాన్స్ విభాగంలో పోటీలు జరిగాయి. కూచిపూడి, భరతనాట్యం అంశాల్లో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జానపద పోటీల్లో సుమారు 500 మంది పోటీపడగా శాస్త్రీయ నృత్య విభాగంలో సుమారు 300 మందికి పైగా పోటీపడ్డారు. కథలతో ఆకట్టుకున్న చిన్నారులు... నేడు కామిక్ బుక్స్, స్టోరీ బుక్స్‌కు అలవాటుపడిపోయిన చిన్నారులు కథల పోటీల్లో పాల్గొని తమ జ్ఞానాన్ని చాటుకున్నారు. అమ్మమ్మ, తాతయ్యలు చెప్పిన నీతి కథలను వింటూ నిద్రపోయే చిన్నారులు అవే కథలను పోటీల్లో చెప్పి ఆకట్టుకున్నారు. చందమామ కథలు, నీతి కథలు, చరిత్రను తెలియజేసే పలు కథలను ఎంతో వినసొంపుగా చెప్పారు. అదేవిధంగా దాశరధి కవితలు అనే అంశంలో సైతం విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
రేపటి నుంచి ‘బాలోత్సవ్-14’
* వేదిక కానున్న కొత్తగూడెం * ఆరు రాష్ట్రాల నుంచి ఎంట్రీలు... * 18 వేలమంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం కొత్తగూడెం: జాతీయ స్థాయి బాలల పండుగ బాలోత్సవ్‌కు ఖమ్మం జిల్లా కొత్తగూడెం వేదిక కానుంది. మూడు రోజులపాటు జరగనున్న బాలోత్సవ్‌కు ఆరు రాష్ట్రాల నుంచి 18 వేల మంది విద్యార్థులు తరలి రానున్నారు. ది కేసీపీ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో కొత్తగూడెం క్లబ్లో ఈనెల 7, 8, 9 తేదీల్లో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సింగరేణి డెరైక్టర్ (పా) టి.విజయ్ కుమార్, ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్, వాగ్గేయకారుడు అంద్శై సినీ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.మొత్తం 24 అంశాలను 40 విభాగాలుగా చేసి పోటీలు నిర్వహిస్తున్నారు. 12 వేదికలు ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. పోటీల్లో గెలుపొందిన ప్రతి విభాగంలో మొదటి మూడు స్థానాలతోపాటు రెండు ప్రత్యేక బహుమతులు, ఇందులో పాల్గొన్న ప్రతి పాఠశాలకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. కీర్తిపతాకను ఎగురవేద్దాం: రమేష్‌బాబు బాలోత్సవ్‌ను ఘనంగా నిర్వహించి కొత్తగూడెం పట్టణ కీర్తి పతాకాన్ని దేశ నలుమూలలా చాటి చెబుదామని బాలోత్సవ్ కన్వీనర్, ప్రముఖ వైద్యులు వాసిరెడ్డి రమేష్‌బాబు అన్నారు. బుధవారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాడుతూ.. 23 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ బాలల పండుగ మండల స్థాయి నుంచి నేడు జాతీయ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఏడాదికేడాది బాలోత్సవ్‌లో మార్పులు రావడం హర్షణీయమన్నారు. మొదట నాలుగు కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ బాలోత్సవ్ నేడు 24 అంశాల్లో 40 విభాగాలతో నిర్వహించే స్థాయికి చేరుకుందన్నారు. ఇప్పటికే ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, పాండిచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ పాఠశాలల నుంచి ఎంట్రీలు వచ్చాయని, సుమారు 18 వేల మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలను కల్పించినట్లు రమేష్‌బాబు చెప్పారు. -
నృత్యాలతో అలరించిన చిన్నారులు..
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: ‘ఆదివారం మీకోసం’ ఆధ్వర్యంలో ఖమ్మంనగరంలో బాలోత్సవ్ నిర్వహించడం ఆనందంగా ఉందని బోడేపూడి విజ్ఞాన కేంద్రం(బీవీకే) చైర్మన్ తమ్మినేని వీరభద్రం అన్నారు. మూడురోజులుగా ఖమ్మంలోని మంచికంటి భవనం కొండబోలు వెంకయ్య మీటింగ్ హాల్లో జరుగుతున్న బాలోత్సవ్ ఆదివారం ముగిసింది. సాహితి స్రవంతి రాష్ట్ర బాధ్యులు కే. ఆనందాచారి అధ్యక్షత జరిగిన ముగింపు సభకు తమ్మినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ఆదివారం మీకోసం’ ఆధ్వర్యంలో ఖమ్మంలో బాలోత్సవ్ నిర్వహించడం ఆనందంగా ఉందని, భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని అన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆదివారం మీకోసం అధ్వర్యంలో ఇప్పటి వరకు 113 ఆదివారాలు వివిధ సమస్యలపై కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, వైద్యులు బారవి, రాజేష్, మురళి, దమయంతి, సమత, శ్రీనివాస్, రమ, ఏవీఎం అధ్యక్ష,కార్యదర్శులు ఐ. జోసెఫ్, కె. హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఈ మూడు రోజుల బాలోత్సవ్ ఏర్పాట్లను బీవీడీ ప్రసాద్, చావా వీరభద్రం, టి.జనార్ధన్, స్వామి, సురేఖ, అరుణ, శ్రీదేవి, పింకి, హైమ, సత్తెనపల్లి శ్రీను, అబీద్‌అలీ, హబీబ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో 25 గ్రూపుల విద్యార్థులు డాన్స్ చేసి ఉర్రూతలూగించారు. కథ చెబుతా ఊ..కొడతారా అనే కార్యక్రమానికి 17 పాఠశాలలు నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు 58 పాఠశాలలకు చెందిన 1200 మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాలొన్నారు. వారిలో 97 మంది విద్యార్థులు వివిధ పోటీల్లో విజేతలయ్యారు. విజేతల వివరాలు ‘డ్రాయింగ్’ సబ్ జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని జి.తరుణ్, ద్వితీయ బహుమతిని లహరి, తృతీయ బహుమతిని వైష్ణవ్, జూనియర్స్ విభాగంలో నాగ ప్రజ్ఞశ్రీ ప్రథమ, లోహిత్ ద్వితీయ, డి.మేఘనాధ్రెడ్డి తృతీయ బహుమతి, సీనియర్స్ విభాగంలో సీహెచ్.ఉమామహేష్ మొదటి, సూర్యవంశీ ద్వితీయ, బి.జీవన్‌జ్యోతి తృతీయ బహుమతి పొందారు. ‘భరతనాట్యం’లో సబ్ జూనియర్ విభాగంలో మొదటి బహుమతి మానస, ద్వితీయ బహుమతి సాయిరాధిక, తృతీయ బహుమతి శ్రీహిత, జూనియర్స్ విభాగంలో స్వర్ణ ఆశ్రీత, చైత్రిక, విష్ణుశ్రీలు మొదటి మూడు స్థానాలు సాధించారు. సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని ఏ.గాయత్రి, ద్వితీయ బహుమతి సాయిశ్రీ, మూడో బహుమతిని ప్రావీణ్య గెలుచుకున్నారు. ‘ఫ్యాన్సీ డ్రస్ కాంపిటీషన్’లో సబ్ జూనియర్స్ విభాగంలో కార్తీక్ ప్రథమ, ఆదిత్య రెండో బహుమతి, నవ్యశ్రీ మూడో బహుమతి గెలుచుకున్నారు. జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి శ్రీచైతన్య, ద్వితీయ బహుమతి సోఫియా, తృతీయ బహుమతిని అపర్ణ, సీనియర్స్ విభాగంలో మహేష్, విజ్ఞత, గౌమతి మొదటి మూడు బహుమతులు గెలుచుకున్నారు. ‘వ్యాసరచన’ జూనియర్స్ విభాగంలో కె.సాహితి, ఎం.మహేష్, స్వర్ణ మొదటి మూడు బహుమతులు సాధించారు. సీనియర్స్ విభాగంలో ఏ.సురేష్, జె.నవ్య,కె.నాగూర్‌లు మూడు బహుమతులు సాధించారు. ‘ఫోక్ డ్యాన్స్’ సబ్ జూనియర్స్ (సోలో ) విభాగంలో అపర్ణ, నందు, పావనీ మొదటి మూడు బహుమతులు సాధించారు. ‘డిబేటింగ్’ జూనియర్స్ విభాగంలో పి.లక్ష్మీప్రసన్న, ఏవీఎస్ రామతులసి, పి.సిరి మొదటి మూడు బహుమతులు, సీనియర్స్ విభాగంలో ఇస్రత్ పర్వీన్, ఎస్కె.పర్వీన్, ఎస్.సంధ్యారాణి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ‘కథ చెబుతా ఊ కొడతారా’ సబ్ జూనియర్స్ విభాగంలో పావని ప్రియ, ఆశ్రీత, నవదీప్‌లు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించగా, జూనియర్స్ విభాగంలో రమణ, కుముదిని, చైతన్య ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులు సాధించార . ‘తెలుగులో మాట్లాడుదాం’లో జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి కీర్తన, ద్వితీయ బహుమతి రామతులసి, తృతీయ బహుమతి శ్రీవర్ష, సీనియర్స్ విభాగంలో సాయిశరత్ ప్రథమ, రవితేజ ద్వితీయ, అభినవ్ తృతీయ బహుమతిని గెలుచుకున్నారు.