బాల్యాన్ని చిదిమేయొద్దు
- బాలోత్సవ్ ముగింపు వేడుకల్లో మంత్రి కేటీఆర్
- బాలోత్సవ్ విశ్వవ్యాప్తం కావడానికి చర్యలు తీసుకుంటాం
- దీనికి భవిష్యత్‌లో సీఎం కేసీఆర్ వస్తారు: తుమ్మల
సాక్షి, కొత్తగూడెం: అలవిగాని కోరికలతో పసి హృదయాలపై ఒత్తిడితో కూడిన చదువుల భారం మోపవద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోరారు. మానవీయత, నైతిక విలువలు పెంపొందించే సమాజం సృష్టిం చడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నాలుగు రోజులపాటు జరిగిన జాతీయస్థారుు బాలోత్సవ్ ఆదివారం ముగిసింది. ఉదయం నుంచి విద్యార్థులు తమ ప్రదర్శనలతో హోరెత్తించారు. రాత్రి జరిగిన ముగింపు సభలో మంత్రి మాట్లాడుతూ బాలోత్సవ్‌ను రాష్ట్ర, జాతీయ స్థారుులో మరింత మెరుగులు దిద్దుతూ నిర్వహించాలని, ఇందుకు అవసరమైతే ప్రభుత్వం బాధ్యత తీసుకుని బాలల వేడుకలను మరింత ప్రయోజనకరంగా నిర్వహించేందుకు తోడ్పడుతుందన్నారు.
పసిమనసుల్లో చదువుల భారం పెరుగుతోందని, కళాత్మకత, సమాజం లోని అంశాలను తెలుసుకునే సమయం తగ్గిపోతోందని, పుస్తకాలతో కుస్తీపట్టడంతోపాటు మానసిక ఉల్లాసానికి ఉపయోగపడే అంశాలపై తల్లిదండ్రులు దృష్టి సారిం చాలని కోరారు. తండ్రిగా తాను సైతం అదే బాటలో నడుస్తానని కేటీఆర్ వివరించారు. బాలల మనోవికాసానికి ఉపయోగపడే బాలోత్సవ్‌ను రెండున్నర దశాబ్దాలపాటు ఏకనాయకత్వం నిరాటంకంగా నిర్వహించడం చరిత్రాత్మక మని, ఈ అద్భుత ఘట్టానికి కారకులైన డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబును అభినందిస్తున్నామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ బాలోత్సవ్‌కు భవిష్యత్తులో సీఎం కేసీఆర్ హాజరవుతారన్నారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ నలుగురు తెలుగువాళ్లు ఉన్నచోట అనేక సంఘాలు ఏర్పడతాయన్న నానుడికి భిన్నంగా రెండున్నర దశాబ్దాలపాటు బాలల సేవలో తరిస్తూ బాలల మనోవికాసానికి అన్నీ తానై నిర్వహిస్తున్న కొత్తగూడెం బాలోత్సవ్ నిర్వాహకులు అభినందనీయులన్నారు.
అమెరికా వంటి దేశాల్లో వక్తలు అమూల్యమైన సందేశమిస్తున్న సమయంలో తమ ఆనందాన్ని ఆమోదాన్ని ప్రకటించడానికి సభికులు నిల్చుని చప్పట్లు కొట్టి ప్రోత్సహించే సంప్రదాయం ఉందని, దీనిని స్టాండింగ్ ఒబేషన్ అంటారని, ఇదే ఒరవడి, సంప్రదాయం తెలుగు ప్రాంతాల్లో ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. తెలుగు వారికి ఆగ్రహం ప్రదర్శించడమే తెలుసునన్న భావన నుంచి.. నిల్చుని చప్పట్లు కొట్టే పద్ధతి పాటించి తెలుగువాళ్ల మనసేమిటో.. భావజాలమేమిటో ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. బాలోత్సవ్ విశ్వవ్యాప్తం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని, కార్యక్రమాలను సీఎం, పీఎంల దృష్టికి వెళ్లాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మెల్యే జలగం వెంకటరావు మాట్లాడారు. సభలో వందేమాతరం శ్రీనివాస్ చదువుల భారంపై వినిపించిన గేయం ఆకట్టుకుంది. సభకు బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేశ్‌బాబు అధ్యక్షత వహించగా పరుచూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మినారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి, స్టార్ హాస్పిటల్ అధినేత గోపీచంద్, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, మున్సిపల్ చైర్‌పర్సన్ గీత తదితరులు పాల్గొన్నారు.