
టాటా.. వీడ్కోలు
ముగిసిన బాలోత్సవ్
* ఉల్లాసంగా తిరిగి వెళ్లిన చిన్నారులు
* ఆరు రాష్ట్రాల నుంచి హాజరైన 18 వేల మంది
* తొలిసారిగా ‘పేరిణి నృత్యం’, ‘మట్టిబొమ్మలు చేద్దాం’లో పోటీలు
కొత్తగూడెం: చిట్టి పొట్టి మాటలు.. అదరగొట్టే డ్యాన్సులు.. అబ్బురపరిచే కళాకృతులు.. ఆలోచింపజేసిన చిన్నారుల ప్రదర్శనలు. జాతీయ బాలోత్సవ్ -14లో భాగంగా కొత్తగూడెంలో పట్టణంలో మూడు రోజులుగా సందడి చేసిన చిన్నారులు తిరిగి వెళ్లారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసి ఆనందంగా గడిపిన వారు ‘మళ్లీ వచ్చే ఏడాది వస్తాం.. అప్పుడు కలుద్దాం..’ అంటూ స్నేహితులకు వీడ్కోలు పలికారు. కొత్తగూడెం పట్టణంలో మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి 23వ అంతర్ పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు(బాలోత్సవ్ - 14) ఆదివారం ముగిశాయి.
ఈ ఉత్సవాలకు ఆరు రాష్ట్రాలకు చెందిన 570 పాఠశాలలకు సుమారు 18వేలకుపైగా విద్యార్థులకు హాజరయ్యారు. బాలోత్సవ్ కార్యక్రమాన్ని ప్రముఖ రేలారే రేలా ఫేం సయ్యద్ రషీద్ ప్రారంభించారు. ప్రారంభవేడుకల్లో నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన తేజా స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఈ సారి పోటీల్లో పాల్గొనే వారి వివరాలు తెలియకుండా ఉండేందుకు నిర్వాహకులు వారికి నంబర్లు ఏర్పాటు చేశారు. వివిధ అంశాల్లో నిష్ణాతులైన వారిని న్యాయనిర్ణేతలుగా పిలిపించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో మొదటి రోజు ఐదు వేల మంది, రెండు రోజు ఎనిమిది వేల మంది, మూడో రోజు 5వేల మంది హాజరయ్యారు.
మంత్రముగ్ధుల్ని చేసిన చిన్నారుల ప్రతిభ
బాలోత్సవ్‌లో చిన్నారుల ప్రతిభను చూసిన వారు మంత్రముగ్ధులయ్యారు. పోటీల్లో భాగంగా ‘ వ్యర్థంలో అర్థం’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు తమ మేథస్సును చాటారు. నిత్యం వాడి పడేసిన వస్తువులను తిరిగి ఎలా వాడుకోవాలో వివరించిన చిన్నారుల మేధాశక్తిని చూసి పెద్దలు సైతం ఆశ్చర్య చకితులయ్యారు. వర్షం నీటిని మంచినీటిగా మార్చడం, కొబ్బరి పీచు, ప్లాస్టిక్ సీసాలను, చిరిగిన దుస్తులను తిరిగి ఎలా అందంగా, పనికివచ్చేలా తయారు చేసుకోవాలో తమ ప్రదర్శనల ద్వారా వివరించారు.
చిట్టి గొంతుల నుంచి తియ్యని తెలుగుదనం..
ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియం పుణ్యమాని మాతృభాషను మర్చిపోతున్న తరుణంలో బాలోత్సవ్ వేదికగా చిన్నారులు తమలోని తెలుగుదనాన్ని నిరూపించారు. తెలుగు మాట్లాడుదాం, కవితారచన, కథా విశ్లేషణ, నీతిపద్యం, అనగనగా కథ చెబుతా వింటారా.. పోటీలలో తెలుగు భాషపై తమకు ఉన్న పట్టును నిరూపించారు. ప్రస్తుతం సాంకేతిక విప్లవం రావడంతో లేఖలు మరిచిపోయిన నేపథ్యంలో లేఖారచన విభాగంలో నిర్వహించిన పోటీల్లో చిన్నారులు రాసిన ఉత్తరాలు చూసి న్యాయ నిర్ణేతలు సైతం అశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రకృతిపై ప్రేమను చాటిన చిన్నారులు..
పోటీలలో భాగంగా జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో చిన్నారులు ప్రకృతిపై తమకున్న ప్రేమను చాటారు. అడవులను నరకడం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ చేసినప్రదర్శనలు, అలంకరణలు ఆకట్టుకున్నాయి. వీటితోపాటు పండుగల సంస్కృతి, విష్ణుమూర్తి, రామాయణ ఘట్టం, గ్రామ దేవతల అలంకరణలు వేసి దేవుళ్లపై తమకున్న భక్తిని చాటుకున్నారు.
ఉర్రూతలూగించిన జానపద నృత్యాలు..
బాలోత్సవ్‌లో ప్రధానంగా జానపదనృత్యాలకు ఎక్కువ ఆదరణ లభించింది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో జరిగిన పోటీలకు ఎక్కువగా మంది పాల్గొని తమ సత్తాచాటారు. ఒక్క జానపదనృత్యం విభాగంలోనే 450 ప్రదర్శనలు జరగడం గమనార్హం. క్లబ్‌లోని ప్రధాన స్టేడియంలో జరిగిన ఈ పోటీలను చూసేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపారు. చివరి రోజు గ్రూప్ డ్యాన్స్ విభాగంలో జరిగిన పోటీలకూ అత్యధికంగా ఎంట్రీలు రావడంతో రాత్రి వరకు పోటీలు కొనసాగాయి. చివరి రోజు జరిగిన పోటీల్లో జానపదనృత్యాలను చూసిన చిన్నారులు ఉల్లాసాన్ని నింపుకున్నారు.
శాస్త్రీయతను మరువలేదు..
బాలోత్సవ్‌లో నిర్వహించిన కూచిపూడి, భరతనాట్యం పోటీలకు సైతం విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించారు. మూడు విభాగాల్లో 500 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. ఒకరిని మించి ఒకరు తామెవరికీ తీసిపోమని తమలోని ప్రతిభను చాటారు. నాటికల పోటీలకు కూడా మంచి స్పందన లభించింది. అలాగే చివరి రోజు ఏర్పాటు చేసిన ఇనుస్ట్రుమెంటల్ పోటీలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది.
తొలిసారిగా పేరిణి నృత్యం, మట్టితో బొమ్మలు చేద్దాం..
తెలంగాణ నృత్యంగా పేరున్న పేరిణి నృత్యాన్ని తొలిసారిగా జాతీయస్థాయి బాలోత్సవ్‌లో ప్రవేశపెట్టారు. మొదటిసారి అయినప్పటికీ ఈ పోటీకి విశేష స్పందన లభించింది. సుమారు 26 మంది కళాకారులు పేరిణి నృత్యంలో తమ ప్రతిభ కనపర్చారు. ఇక మట్టితో బొమ్మలు చేద్దాం అనే అంశానికి సైతం పిల్లల నుంచి మంచి స్పందన వచ్చింది. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీసి బొమ్మలను తయారుచేశారు. శివుడు, వినాయకుడి బొమ్మలతోపాటు గ్లోబల్ వార్మింగ్, ఆడపిల్లలను సంరక్షించాలని, కాకతీయ కళాతోరణం, ఎర్రకోట తదితర బొమ్మలను రూపొందించి ఆకట్టుకున్నారు. మూడురోజులపాటు విజయవంతంగా జరిగిన పోటీలకు హాజరైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నిర్వాహకులు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు.