‘నాకు రక్త తర్పణం చేయటం లేదు’
‘నాకు రక్త తర్పణం చేయటం లేదు’
Published Mon, Jul 25 2016 12:15 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
హైదరాబాద్: ‘మిమ్మల్ని సుఖ సంతోషాలతో ఉంచుతున్నా.. అయినా నాకు రక్త తర్పణం చేయటం లేదు.. ఏటా రక్త తర్పణం చేయాలని నేనేమైనా అడుగుతున్నానా..? అంటూ భవిష్యవాణి ప్రజలను నిలదీసింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యవాణిని స్వర్ణలత వినిపించింది.‘ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగం ఘనంగా నిర్వహించటం సంతోషకరం. కోరినన్ని వానలు కురిపిస్తున్నా.. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా ఉంచుతున్నా.. కలరా లాంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే నేను అడిగింది చేయాలి.. అప్పుడే ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు.. నేనేమీ వెజిటేరియన్‌ను కాదు కదా..’ అని స్వర్ణలత భవిష్యవాణి తెలిపింది.
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. భవిష్య వాణి వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అమ్మవారిని ఆలయ పురవీధుల్లో అంబారిపై ఊరేగించి, సాగనంపు కార్యక్రమం నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించడంతో.. అప్రమత్తమైన పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement