
సాక్షి, హైదరాబాద్ : మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని ఆదివారం ఘనంగా నిర్వహించిన బీబీకాఆలం సామూహిక ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. ఇస్లాం మతం పరిరక్షణకు ప్రాణత్యాగం చేసిన హజ్రత్ ఇమాం హుస్సేన్, హసన్‌లను స్మరిస్తూ వేలాది మంది యువకులు, చిన్నారులు విషాద గీతాలు ఆలపిస్తూ చేతులకు బ్లేడ్లను అమర్చుకొని ఎదపై బాదుకుంటూ రక్తం చిందించారు.
డబీర్‌పురా బీబీకా అలావా నుంచి ప్రారంభమైన భారీ ఊరేగింపు చాదర్‌ఘాట్ వరకు కొనసాగింది. దారి పొడవునా ఏర్పాటు చేసిన స్వాగత వేదికలపై నుంచి పలువురు అధికార, అనధికార ప్రముఖులు బీబీకాఆలంకు స్వాగతం పలికి పూలు, దట్టీలు సమర్పించారు.
చార్మినార్ వద్ద నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, పురానీహవేలి వద్ద గ్రేటర్ డిప్యూటీ మేయర్ బాబా ఫసివుద్దీన్, సెట్విన్ చైర్మన్ మీర్ ఇనాయత్ అలీ బాక్రీ, టీఆర్‌ఎస్ సీనియర్‌నేత లయాఖ్ అలీ, దారుషిఫా వద్ద ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, గ్రేటర్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు హాజరై బీబీకా ఆలంకు స్వాగతం పలికి పూలు, దట్టీలు సమర్పించారు.
(ఫొటో స్లైడ్ చూడండి..)




