పెద్దగోల్కొండ (శంషాబాద్ రూరల్), న్యూస్‌లైన్: బీహార్ దొంగల ముఠా రెచ్చిపోయింది. పక్కా పథకంతో ఓ ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు ఇంటిల్లిపాదినీ కత్తులతో బెదిరించి అందినకాడిని దోచుకెళ్లారు. బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండలో కలకలం రేపింది. ఔటర్ రింగు రోడ్డు రోటరీ జంక్షన్ నుంచి పెద్దగోల్కొండకు వెళ్లే దారి పక్కన ఆనెగౌని దేవయ్యగౌడ్.. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నాడు.
వీరంతా సాయంత్రం దేవయ్యగౌడ్ సోదరుడి ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లొచ్చి నిద్రపోయారు. అర్ధరాత్రి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో బెదిరించారు. అనంతరం రూ.50వేల నగదు, సుమారు 30తులాల బంగారం, 20తులాల వెండి దొచుకెళ్లారు. ఈ చోరీ మొత్తం కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిచేసిన దొంగలు.. ఆ సమయంలో సమీపంలోని రెండిళ్లకు బయటి నుంచి గడియ పెట్టారు. మొత్తం తొమ్మిది మంది ఈ చోరీలో పాల్గొన్నట్టు సమాచారం.
పక్కా ప్లాన్‌తోనే..
దుండగులు రెక్కీ నిర్వహించి దోపిడీకి తెగబడినట్లు తెలుస్తోంది. దేవయ్య ఇంటి సమీపంలోని రెండు ఇళ్లకు బయటి నుంచి గడియ పెట్టారు. దేవయ్య సోదరుడు వెంకటయ్య ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆయన, పై అంతస్తులో సురేందర్‌రెడ్డి, అస్ముద్దీన్ కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. దేవయ్య ఇంటి నుంచి కొద్ది దూరంలో పెద్దగోల్కొండ వెళ్లే దారి పక్కన ఉన్న నిర్దం బాల్‌రాజ్, శివకుమార్, దశరథ్ ఇళ్లతో పాటు వెంకటయ్య ఇంటికి బయట నుంచి దుండగులు గడియ పెట్టారు. దేవయ్య ఇంట్లోకి ఐదుగురు దుండగులు చొరబడ్డారు. మరో నలుగురు బయట కాపలా ఉన్నట్లు భావిస్తున్నారు. దుండగులు ముసుగులు, గ్లౌజులు ధరించారు.
ఓ వ్యక్తి కేవలం డ్రాయర్‌తోనే ఉన్నాడు. బయటకు వెళ్లేటప్పుడు పక్కనే ఉన్న వెంకటయ్య ఇంటిని కూడా దోచుకుంటామని, మీరెవరూ కేకలు వేయొద్దని బెదిరించి వెళ్లారు. దేవయ్య కొద్దిసేపటి తర్వాత ఎలాగోలా చేతులను విప్పుకొని బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఒకరిద్దరు వెంకటయ్య ఇంటి వద్ద తచ్చాడుతున్నారు. దొంగలు.. అంటూ దేవయ్య గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయారు.
గిల్ట్ నగలు వదిలేసి..
దుండగులు ఇంట్లోంచి దోచుకెళ్లిన ఆభరణాల్లో కొన్ని గిల్ట్ నగలు ఉన్నాయి. నగలు ఓ బ్యాగులో తీసుకుని పారిపోయిన దుండగులు ఊరి బయటకు వెళ్లిన తర్వాత వాటిని పరిశీలించారు. అందులో కొన్ని గిల్ట్ నగలు ఉండడంతో బ్యాగుతో పాటు వాటిని అక్కడే వదిలేసి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్ అక్కడికి వెళ్లడంతో విషయం తెలిసింది. దుండగులు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడారని బాధితులు తెలిపారు. దుండగులు వాహనంలో వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఔటర్‌పై నిఘా లోపం..
దుండగులు దోపిడీ తర్వాత గ్రామ సమీపంలోని పొలాల మధ్య నుంచి ఉన్న ఓ రోడ్డు మార్గం గుండా పరారయ్యారు. సంఘటనా స్థలం నుంచి దుండగులు ఈ మార్గంలో వెళ్లి ఔటర్‌కు చేరుకొని ఉండొచ్చు. ఇక్కడి ఔటర్ జంక్షన్ వద్ద టోల్‌గేటులో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో వాహనాలను గుర్తించడం కష్టంగా మారింది.
వివరాలు సేకరించిన డీసీపీలు, ఏసీపీ, ఎమ్మెల్యే
శంషాబాద్ డీసీపీ రమేష్‌నాయుడు, ఏసీపీ సుదర్శన్, ఎస్‌ఓటీ డీసీపీ నర్సింగ్‌రావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. బీహార్ ముఠానే దోపిడీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ బాధితులను పరామర్శించారు. కాగా ఈ నెల 2న శంకర్‌పల్లి మండలం పత్తేపూర్‌లో ఇలాంటి తరహాలోనే దోపిడీ జరిగింది.
పెద్దగోల్కొండలో కలకలం
Published Thu, Mar 13 2014 11:05 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM
Advertisement
Advertisement