లేని వాహనానికి మూడేళ్ల బిల్లులు.. | Bills Sanctions Without Vehicles From Three Years | Sakshi
Sakshi News home page

స్వాహా..!

Published Mon, Apr 9 2018 9:31 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM

Bills Sanctions Without Vehicles From Three Years - Sakshi

బినామీ వాహనంతో మూడేళ్ల బిల్లులు నొక్కేసేందుకు విద్యుత్‌శాఖ అధికారులు సిద్ధమయ్యారు. యుటిలిటీ వాహనం పేరిట విద్యుత్‌ శాఖ ఇచ్చిన సౌలభ్యాన్ని ఆసరా చేసుకొని వాహనాన్ని వాడకుండానే రూ.10.83 లక్షల బిల్లులు స్వాహా చేసేందుకు గుట్టుగా ప్రయత్నం సాగిస్తున్నారు. ఓ పోలీస్టేషన్‌లో ఉన్న వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ నమోదు చేసి బిల్లులు సమర్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఉన్నతాధికారుల అనుమతులు లేకుండానే వాహనం అద్దె, బిల్లుల చెల్లించేందుకు అగ్రిమెంట్లు సైతం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే  ఏడాది అద్దెకు సంబంధించి రూ.3 లక్షలు చెల్లింపులు జరిగినట్లు సమాచారం. విషయం బయటకు రావడంతో బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిలిపివేయడంతో పాటు విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం..

సాక్షి, మెదక్‌:మెదక్‌ విద్యుత్‌ డివిజన్‌ పరిధిలోని పాపన్నపేట సబ్‌డివిజన్‌లో ఓ అధికారి నిబంధనలకు విరుద్ధంగా మూడేళ్లకు సంబంధించి యుటిలిటీ వాహనం బిల్లులు కాంట్రాక్టర్‌ పేరిట పొందడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ప్రజలకు మెరుగైన విద్యుత్‌ సేవలు అందించడానికి ప్రతి ఏడాది సబ్‌ డివిజన్‌ అధికారులకు ఒక యుటిలిటీ వాహనం ఇస్తారు. ఈ వాహనం విద్యుత్‌ సామగ్రి రవాణా చేసేందుకు అనుకూలంగా ఉండాలి. అయితే కొంతమంది అధికారులు తమ సొంత వాహనాలను దీనికోసం వాడుతూ యుటిలిటీ వాహనం పేరిట బిల్లులు వసూలు చేస్తున్నారు. కారులాంటి వాహనాలకునెలకు రూ.20వేలు చెల్లిస్తుండగా ట్రక్కు లాంటి వాహనాలకు రూ.32వేలు క్లయిమ్‌ చేసే అవకాశం ఉంటుంది.  యుటిలిటీ వాహన సేవలు వినియోగించుకుంటున్నట్లు తప్పుడు బిల్లులు సమర్పిస్తూ...డబ్బు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

మూడేళ్ల బిల్లులకు అగ్రిమెంట్‌
ఆ విద్యుత్‌ అధికారి  కాంట్రాక్టర్‌ పేరిట నవంబర్‌ 2015 నుంచి సెప్టెంబర్‌ 2017 వరకు పాత డివిజన్‌లో ఉన్న జోగిపేటలో బిల్లులు పొందడానికి యత్నించినట్లు సమాచారం. అయితే అవి బినామీ కావడంతో అక్కడి అధికారులు వాటిని క్లయిమ్‌ చేయనట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పాపన్నపేట సబ్‌ డివిజన్‌ మెదక్‌ డివిజన్‌ పరిధిలోనికి మారింది. దీంతో పాపన్నపేటకు చెందిన అధికారి మెదక్‌ డివిజన్‌లో మూడేళ్లకు సంబంధించిన బిల్లులు క్లయిమ్‌ చేయించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కొంత వరకు ఈ ప్రయత్నం సఫలమైనట్లు తెలుస్తోంది. నవంబర్‌ 2015 నుంచి నవంబర్‌ 2017 వరకు లేని వాహనానికి  ఓ కాంట్రాక్టర్‌ పేరిట రూ.10.83 లక్షల బిల్లులు తయారు చేసి మంజూరీ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు.

చిత్రం ఏమిటంటే మెదక్‌ డివిజన్‌లోకి మారిన కేవలం ఆరు నెలల కాలంలో మూడేళ్ల బిల్లులకు అగ్రిమెంట్‌ సైతం చేయించుకొని నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పొందేందుకు అధికారులను ప్రసన్నం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఒక ఏడాదికి సంబంధించి సుమారు రూ.3లక్షల వరకు బిల్లులు క్లయిమ్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్‌ నంబరు 56001919362 ద్వారా రూ.4,00,907  అగ్రిమెంట్‌ నంబరు 560022811 ద్వారా రూ.1,72,052, అగ్రిమెంట్‌ నంబరు 560022812 ద్వారా రూ.1,72,052, అగ్రిమెంట్‌ నంబరు 5600267270 ద్వారా రూ.3,38,400 మొత్తం రూ.10,83,860 బిల్లుల చెల్లింపుల కోసం  బిల్లులు సమర్పించినట్లు ఆరోపణలున్నాయి. అలాగే 2017లో ఈదురు గాలులు వచ్చి పాపన్నపేట మండలంలో విద్యుత్‌ స్తంభాలు పడిపోయిన సమయంలో ఓ కాంట్రాక్టర్‌ పేరిట అగ్రిమెంట్‌ చేయించుకొని సుమారు రూ.5లక్షల వరకు నిధులు కాజేసినట్లు ఆరోపణలున్నాయి.

బిల్లులు చెల్లించలేదు..
పాపన్ననపేట ఏడీఈ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో యుటిలిటీ వాహనం బిల్లులు చెల్లింపుల వ్యవహారంపై డీఈ వెంకటరత్నం వివరణ కోరగా అగ్రిమెంట్‌ వివరాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పోలీస్టేషన్‌లో ఉన్న వాహనంపై బిల్లులు క్లెయిమ్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టేశారు. ఒక వాహనం వినియోగించినట్లు బిల్లులు సమర్పించటం జరిగిందన్నారు. ఏడాదికి సంబంధించిన బిల్లులు మంజూరు చేశామన్నారు. ఇంకా డబ్బులు డ్రా కాలేదని తెలిపారు. యుటిలిటీ వాహనం వినియోగం, బిల్లులు సమర్పించిన తీరుపై అనుమానాలు ఉండటంతో విచారణకు ఆదేశించామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement