
బర్డ్‌ఫ్లూ దెబ్బకు పౌల్ట్రీ విలవిల
సాక్షి, హైదరాబాద్: బర్డ్‌ఫ్లూ పంజాకు కోళ్ల పరిశ్రమ విలవిలలాడుతోంది. వ్యాధి సోకిన కోళ్లను చంపి భూమిలో పాతిపెడుతున్నారు. గుడ్లను ధ్వంసం చేస్తున్నారు. బర్డ్‌ఫ్లూ దెబ్బకు రంగారెడ్డి హయత్‌నగరం మండలం తొర్రూరు పరిసర గ్రామాలు వణికిపోతున్నాయి. మరోవైపు అధికారులు అప్రమత్తమై వైరస్ విస్తరించకుండా నివారణ చర్యలు ముమ్మరం చేశారు. శుక్రవారం నాటికి గుర్తించిన ఐదు ఫారాల్లోని 1.60 లక్షల కోళ్లను చంపి పాతిపెట్టారు. 2.30 లక్షల గుడ్లను ధ్వంసం చేశారు. 200 మెట్రిక్ టన్నుల దాణానూ నాశనం చేసి భూమిలో పాతిపెట్టారు. తొర్రూరుకు 10 కిలోమీటర్ల పరిధిలోని 18 గ్రామాల్లో గల 32 కోళ్ల ఫారాల్లో 35 ప్రత్యేక బృందాలు అణవణువునా బర్డ్‌ఫ్లూ ఛాయలపై గాలించాయి. ఎక్కడా బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. బర్డ్‌ఫ్లూ వచ్చిన ఐదు కోళ్ల ఫారాలను పూర్తిస్థాయిలో శుభ్రపరిచి వాటిని సీజ్ చేయనున్నారు. బర్డ్‌ఫ్లూ ప్రభావిత 10 కిలోమీటర్ల పరిధిలో చికెన్ దుకాణాలన్నింటినీ మూసేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు పశుసంవర్థశాఖ ప్రత్యేక కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. కోళ్లకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది.
రోగ నియంత్రణ సంస్థ ఏర్పాటు
బర్డ్‌ఫ్లూను పర్యవేక్షించేందుకు రాష్ట్రానికి వచ్చిన జాతీయ అంటువ్యాధుల సంస్థ(ఎన్‌ఐసీడీ) జాయింట్ డెరైక్టర్లు డాక్టర్ ఎస్.కె.జైన్, డాక్టర్ కర్మాకర్, ప్రత్యేక నిపుణుడు డాక్టర్ ప్రణయ్‌వర్మ, కేంద్ర ఛాతి వైద్య నిపుణుడు డాక్టర్ పవన్‌కుమార్ శుక్రవారం ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ఫ్లూ వంటి వైరస్‌లు సోకుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో జాతీయ కేంద్ర రోగ నియంత్రణ సంస్థ(ఎన్‌సీడీసీ) శాఖను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించగా సానుకూలంగా స్పందించారు.
ఆ సంస్థ కోసం మూడు ఎకరాల స్థలం కేటాయించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. భూమిని గుర్తించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్‌ను సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 26 రాష్ట్రాల్లో ఎన్‌సీడీసీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించగా మొదటగా తెలంగాణకు అవకాశం రావడం గమనార్హం. వ్యాధి నిర్ధార ణకు సంబంధించి ఇప్పటివరకు ఫూణేలోని ప్రయోగశాలపై ఆధారపడాల్సి వచ్చేది. అనంతరం కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌నూ కలిసింది. ఆ తర్వాత ఐపీఎం కేంద్రానికి వెళ్లి బర్డ్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు చేయడానికి ఉన్న వసతులపై ఆరా తీసినట్లు రాష్ట్ర అంటువ్యాధుల నివారణ సంస్థ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. ఈ బృందం శనివారం గాంధీ ఆసుపత్రిని సందర్శిస్తుందని పేర్కొన్నారు.
ఆపరేషన్ బర్డ్‌ఫ్లూ పూర్తి
హయత్‌నగర్ మండలం తొర్రూరులో ఈ నెల 13వ తేదీన వెలుగుచూసిన బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాపించకుండా సమర్ధవంతంగా ఆపరేషన్ బర్డ్‌ఫ్లూ కార్యక్రమాన్ని పూర్తి చేశామని పశు సంవర్ధక శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. తొర్రూరులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బర్డ్‌ఫ్లూ వెలుగుచూసిన మరుసటి రోజు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి వైరస్ సోకిన కోళ్ళను చంపేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రెండు రోజుల్లో లక్షా 59 వేల 953 కోళ్ళను చంపగా, 2 లక్షల 28వేల 428 గుడ్లను పాతిపెట్టినట్లు తెలిపారు. పెంపుడు కోళ్ళలో వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వైవల్ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కోళ్ళ ఫారాల నుంచి కోళ్ళను, గుడ్లను ఇతర ప్రాంతాలకు తరలించకుండా పోలీసులు నిరంతరం నిఘా పెంచారని చెప్పారు. ఇకపై చికెన్, గుడ్లను నిర్భయంగా తినవచ్చన్నారు.