ఆవకాయ బిర్యానీ, పొట్లం బిర్యానీ, మిరియాల బిర్యానీ, రాజు గారి కోడిపలావ్... ఇలా కొత్త కొత్తఅవతారాలతో ఆకట్టుకుంటున్న సిటీ బిర్యానీకి మరో కొత్త లుక్. ఈసారి విశేషం ఏమిటంటే.. ఆ బిర్యానీకి రంగు, రుచి, రూపు అన్నీ మనమే ఇవ్వాలి. అంటే ఎలాంటి బిర్యానీ తినాలనుకుంటున్నామో అది మనమే డిజైన్ చేసుకోవచ్చునన్నమాట. అంటే మన ధమ్ మనదేనన్నమాట. ఇంకో విశేషం ఏమిటంటే.. దీనిని వండిన చోటే తినొచ్చు. ఇంటికొచ్చినిమిషాల్లో వండుకుని కూడా తినొచ్చు.
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌కీ బిరియానీకి ఉన్న అనుబంధం ఎలాంటిదో కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే సిటీ బిరియానీల గురించి మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పుకుంటూనే ఉండాలి. సిటీలోని బిర్యానీ లవర్స్ గురించి మాత్రమే కాదు ఇతర నగరాల నుంచి దాని కోసం ఇక్కడి దాకా వచ్చే ఫుడీస్‌ని కూడా మెప్పించేందుకు రోజుకో రకం కొత్త శైలిని పుట్టిస్తున్నాయి రెస్టారెంట్స్. అందులో భాగంగానే ఇప్పుడు కుక్కర్ పలావ్‌ని సృష్టించింది కూచిపూడి పలావ్.
ఎంచుకో.. చవులూరించుకో..
ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లి ‘‘నాకు మటన్ బిర్యానీ కావాలి. తక్కువ స్పైసీగా ఉండాలి. రైస్ మాత్రం బాస్మతీయే ఉండాలి. మర్చిపోయా అందులోకి ఫ్రైడ్ ఎగ్ కూడా ఉండాలి..’’ ‘‘నాకు వెజిటబుల్ బిర్యానీ కావాలి. అందులో పనీర్ మిక్స్ చేయాలి. నట్స్ కూడా కలిపితే బెటర్, అయితే కేరట్స్ మాత్రం వద్దు’’. ఇలాంటి కోరికల లిస్ట్ బయటకు తీస్తే.. వెంటనే స్టివార్డ్ నుంచి మీకొచ్చే సమాధానం ‘‘మా దగ్గర ఉన్న బిర్యానీలు ఇవి. తింటే తిను లేకపోతే పో..’’దాదాపుగా ఇంతే కదా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది గురూ. మియాపూర్‌లోనో, కేపీహెచ్‌బీలోనో రెస్టారెంట్‌కి వెళితే.. మీకు కావాల్సిన విశేషాల జాబితా రాసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అనంతరం మన ఆర్డర్ ప్రకారం అన్నీ మిక్స్ చేసేసి కుక్కర్‌లో వేసి మన ఎదురుగా టేబుల్ మీదే పెడతారు.
లిక్విడ్.. ప్యాక్డ్
చాలా మంది ఇళ్లకు వెళుతూ వెళుతూ బిర్యానీ ప్యాక్ చేసి తీసుకెళతారు. ఇంట్లోకి వెళ్లి స్నానపానాదులన్నీ కానిచ్చి అరగంటో గంటో తర్వాత తీరుబాటుగా కంచం ముందు కూర్చునే సరికి చల్లగా లేదా చప్పబడిపోయిన బిర్యానీ నోటికి తగులుతుంది. అలా కాకుండా అచ్చం హోటల్లో వడ్డించినట్టు మనింట్లో మన కళ్ల ముందు ఆ ఘుమఘుమలు పొగలు సెగలు కక్కుతూ పరిమళ సహితంగా బిర్యానీ ఆస్వాదించాలంటే.. ఇంపాజిబుల్ అనుకుంటాం కదా. కానీ దీని కోసం లిక్విడ్ ప్యాక్ బిర్యానీ అందుబాటులోకి వచ్చింది. మసాలాలూ కర్రీ, రైస్ అన్ని మిక్స్ చేసిన ప్యాక్‌ని మనకు ఇస్తారు. మనం చేయాల్సిందల్లా ఇంటికి రాగానే దాన్ని ప్రెషర్ కుక్కర్ లేదా ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వేసుకుని కాసేపాగి వేడిగా వడ్డించుకోని తినడమే. మరో విషయం దీన్ని కావాలంటే ఒకటి రెండ్రోజులు శుభ్రంగా ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేసుకుని ఆ తర్వాత కూడా వండుకోవచ్చు.
వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా..
ఇది ప్రపంచపు తొలి కస్టమైజ్డ్ పలావ్‌గా కుక్కర్‌లో వడ్డించే పలావ్, లిక్విడ్ పలావ్‌లు అని కూచిపూడి పలావ్ రెస్టారెంట్‌కు చెందిన వెంకట్ అంటున్నారు. భిన్న రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో భోజన ప్రియుల అభి‘రుచులు’ నిమిషానికి ఒకలా మారిపోతున్నాయని అంటున్న ఆయన ఎవరో తామిష్టం వచ్చినట్టు వండింది తినక తప్పని పరిస్థితి కన్నా తమ ఇష్టం వచ్చిన బిర్యానీ తమ శారీరక స్థితిగతులు, ఇష్టాఇష్టాలకు అనుగుణంగా తయారు చేసుకునే వెసులుబాటు ఉండడం నవతరాన్ని ఆకట్టుకునే అంశం అన్నారు. ‘‘కొందరు బిర్యానీ పొడి పొడిగా కొందరు తడిగా ఉండాలనుకుంటారు. అది కూడా చెప్పి తయారు చేయించుకునేంత ఫ్లెక్సిబులిటీ ఇందులో ఉంటుంది’’ అని చెప్పారు.
టేబుల్‌కో కుక్కర్..
ప్రతి సీటింగ్‌కీ 1.2 లీటర్ల కుక్కర్ ఉంటుంది. రెస్టారెంట్‌లో కుకింగ్ టైమ్ (షుమారు 10 నిమిషాలు), కూలింగ్ టైమ్ (షుమారు 6 నిమిషాలు) మొత్తం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపు మనం డిజైన్ చేసుకున్న మన బిర్యానీ రెడీ. ఒక కుక్కర్‌లో ఇద్దరికి సరిపోయే పోర్షన్ వస్తుంది. దీనికి జతగా గోంగూర గ్రేవీ, పెరుగు పచ్చడి వగైరాలను అందిస్తారు. అదండీ.. ఇప్పుడు సిటీలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన బిర్యానీ స్టోరీ.. ఇక మీ కుక్కర్ మీదే..
Comments
Please login to add a commentAdd a comment