కేసీఆర్ పాలన బాగుందన్న ప్రచారంపై బీజేపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ పాలన బాగుందని ప్రచారం చేయడం అభూతకల్పన మాత్రమేనని బీజేపీ విమర్శించింది. టీఆర్‌ఎస్ పాలన, సీఎం పనితీరుపై మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత చేస్తున్న విచిత్ర ప్రకటనలతో ప్రజలు షాక్‌కు గురవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ఎద్దేవా చేశారు. విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ను తెలంగాణ డ్రామా సమితిగా మార్చుకుంటే బాగుంటుందని అన్నారు.
టీఆర్‌ఎస్ పాలనలో ఉన్నత విద్య నిర్లక్ష్యానికి గురైందని, విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకపోవడంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఎంతో చరిత్ర కలిగిన ఉస్మానియా వర్సిటీని సీఎం కేసీఆర్ అధోగతి పాలు చేశారన్నారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాకే ఓయూకు కేసీఆర్ వెళ్లాలని డిమాండ్ చేశారు. కూలీలను అవమానించేలా టీఆర్‌ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రూ.250 కూలికి కేసీఆర్ పనిచేస్తే బాగుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి మంత్రి హరీశ్‌రావు వెళ్లడం లేదని కేటీఆర్ చెప్పారంటే దానికి అర్థమేంటో టీఆర్‌ఎస్ వాళ్లే చెప్పాల్సి ఉందన్నారు.