విశ్వనగరం ఏమైంది?: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిని విశ్వనగరంగా మారుస్తామని, డాలస్, ఇస్తాంబుల్ చేస్తామన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ మాటలు, హామీలు ఏమయ్యాయని బీజేపీ శాసన సభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కనీసం ఈ మూడేళ్లలో నగరంలో రోడ్లు కూడా వేయలేక పోయారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగర ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని పేర్కొన్నారు. బుధవారం ఆయన బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామన్న మాటలతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గాలిలో మేడలు కట్టారని ఎద్దేవా చేశారు. చివరకు సీఎం ప్రయాణించే రోడ్లు సైతం గుంతలమయంగా మారాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. మూడేళ్లుగా జిల్లా అభివృద్ధి సమీక్ష (డీఆర్సీ) సమావేశాలకు దిక్కూమొక్కూ లేకుండా పోయిందని, ఆ సమావేశాలను ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రి విదేశాల్లో తిరుగుతున్నారని, ఆయనపై సోషల్ మీడియాలో జోక్స్ వేసుకుంటున్నారని తెలిపారు.
నగర ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయాలి
ఇదిలా ఉండగా హైదరాబాద్ సమస్యలపై చర్చించేందుకు నగర ఎమ్మెల్యేలతో వెంటనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎంకు ఓ లేఖ రాశారు.