భంగపడిన ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాకు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించి భంగపడిన ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాకు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోందా..? అర్బన్‌లో ప్రజాదరణ కలిగిన అభ్యర్థి వేటలో ఉన్న కాంగ్రెస్ ఇప్పు డు సూర్యనారాయణను పార్టీలో చేర్చుకునే యోచనలో ఉందా..? ఈ విషయమై జిల్లా కాంగ్రెస్‌లోని కీలక నేత పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించారా.? ఇప్పుడు నగర రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. అర్బన్ బీజేపీ అభ్యర్థిత్వంపై ధన్‌పాల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ తనకే వస్తుందనే ధీమాతో ఉన్నారు. కానీ ఆ పార్టీ అధినాయకత్వం ఈ స్థానాన్ని యెండల లక్ష్మీనారాయణకు కేటాయించడంతో ధన్‌పాల్‌కు నిరాశే ఎదురైంది.
దీంతో శనివారం అనుచరులతో సమావేశమైన సూర్యనారాయణగుప్తా అభ్యర్థిత్వం విషయంలో పార్టీ మరోమారు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు తాను ఈసారి ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని ధన్‌పాల్ ప్రకటించారు. రెండు రోజుల్లో తన కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో ఆయన భవిష్యత్ కార్యచరణపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ భావాలు కలిగిన సూర్యనారాయణగుప్తా కాంగ్రెస్ పార్టీలో ఇమడగలరా..? అందులో ఉన్న గ్రూపు రాజకీయాలను తట్టుకుని రాణించగలరా? అనే చర్చ జరుగుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది.. అనే దానిపై కూడా ఆయన సన్నిహితులు బేరీజు వేసుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ కూడా «గతంలో ధన్‌పాల్‌ను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే.
కమలదళంలో లుకలుకలు..
నిజామాబాద్ అర్బన్ స్థానంలో బీజేపీలోని లుకలుకలు బట్టబయలయ్యాయి. యెండలకు టికెట్ కేటాయించడంపై అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. శనివారం నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో సూర్యనారాయణగుప్తా తమ అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి నగరంలోని విశ్వహిందూ పరిషత్, హిందూవాహిని వంటి సంస్థలతో పాటు, బీజేపీలోని పలు జోన్ల అధ్యక్షులు కూడా హాజరవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా పోటీ చేయాలని అనుచరులు ధన్‌పాల్‌పై ఒత్తిడి తెస్తున్నారు. వివిధ వ్యాపార, వాణిజ్య వర్గాలు ధన్‌పాల్‌కు మద్దతు పలికాయి. ధన్‌పాల్ సూర్యనారాయణకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు శివసేన పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే కూడా ప్రచారానికి వస్తానని హామీనిచ్చినట్లు తెలిసింది. మరోవైపు బీజేపీలోని ముఖ్యనేతల మధ్య కూడా గ్రూపు విభేదాలున్నాయి. యెండలకు టికెట్ కేటాయించడంపై బస్వా లక్ష్మీనర్సయ్య అనుచరవర్గం కూడా అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
అధినాయకత్వం దృష్టికి..
నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిత్వం విషయంలో పార్టీ పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ధన్‌పాల్ ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కలవాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ వెళ్లి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు బండారు దత్తాత్రేయ వంటి నేతలను కలవనున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని అవసరమైతే ఆ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమిత్‌షాను కలిసేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు.
బీజేపీ కార్యాలయంలో సమావేశం
మరోవైపు బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కూడా ఆ పార్టీ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన అనుచరవర్గం ఈ సమావేశానికి హాజరైంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని శ్రేణులు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment