విలేకరులతో మాట్లాడుతున్న షబ్బీర్‌అలీ
సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందుతుందని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. శనివారం కామారెడ్డిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల మూలంగా ప్రభుత్వ ఖజానాపై భారం పడిందన్నారు. మూడు నెలలుగా రాష్ట్రంలో పాలన కుంటుపడిపోయిందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు మూడు నెలలుగా ప్రచారం నిర్వహిస్తే, తమ పార్టీ అభ్యర్థులు కేవలం ఇరవై రోజులే ప్రచారంలో పాల్గొని కబడ్డీ ఆడుకున్నారని తెలిపారు. జిల్లాలో చాలాచోట్ల పోలీసులు టీఆర్‌ఎస్‌కు ఏజెంట్లుగా పనిచేసి వారి ఆగడాలను అడ్డుకోలేకపోయారన్నారు. చాలాచోట్ల టీఆర్‌ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదులు చేస్తే కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపైనే దాడులు జరిగితే, తమవారిపైనే కేసులు పెట్టారని ఆరోపించారు.
ఓటర్లకు ఒకవైపు ప్రలోభాల ఎరచూపారని, మరోవైపు టీఆర్‌ఎస్‌కు ఓటేయకుంటే పింఛన్లు రద్దవుతాయని బెదిరించారని తెలిపారు. ఎన్ని రకాల ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడినప్పటికీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారన్నారు. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థులు సురేందర్, బాల్‌రాజులపై రకరకాల ఒత్తిడి తీసుకువచ్చారని, వాళ్లు భయపడకుండా ప్రజల్లోకి వెళ్లి ప్రజల ఆశీర్వాదం పొందారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులంతా భారీ మెజారిటీతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఓట్లు గల్లంతయ్యాయని, తమ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదులు చేసినా, కోర్టుల్లో కేసులు వేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున నిరంతరం శ్రమించిన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ఓటు వేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎల్లారెడ్డి నియోజక వర్గ అభ్యర్థి నల్లమడుగు సురేందర్, నాయకులు ఎంజీ వేణు, నల్లవెల్లి అశోక్, కైలాస్ శ్రీను, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, కారంగుల అశోక్‌రెడ్డి, భీంరెడ్డి, బాల్‌రాజు, మోత్కూరి శ్రీను, అన్వర్, గోనె శ్రీను, అంజద్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ నేతలతో సమాలోచనలు
జిల్లాలోని ఆయా నియోకజ వర్గాలకు చెందిన నేతలు శనివారం షబ్బీర్‌అలీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు ఓటములపై పార్టీ నేతలతో మాట్లాడారు. ఎల్లారెడ్డి అభ్యర్థి సురేందర్, బాన్సువాడ అభ్యర్థి కాసుల బాల్‌రాజు తదితరులతో పాటు జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment