
వెంకయ్యనాయుడు జీవితం తెరచిన పుస్తకం
హైదరాబాద్‌సిటీ: కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌పై తెలంగాణ బీజేపీ నేతలు మండిపడ్డారు. వెంకయ్య నాయుడుపై జైరాం రమేష్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ ఆరోపణలు చేయడం చూస్తే కాంగ్రెస్ దివాళా కోరుతనానికి నిదర్శనంగా ఉన్నాయని విమర్శించారు. వెంకయ్య నాయుడు జీవితం తెరిచిన పుస్తకమని, సాధారణ స్థాయి నుంచి ఉప రాష్ట్రపతిగా ఎదిగిన తెలుగు వారి ఆత్మస్తైర్యం దెబ్బ తీయడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
స్వచ్చంద సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం పరిపాటిగా ఉన్నదని, జైరాం రమేష్ ఇలాంటి ఆరోపణలు చేయడం దొంగే దొంగ అని అరిచినట్లుందని ఎద్దేవా చేశారు. పంచ భూతాలను సైతం దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. అవినీతి కుంభకోణాలలో కూరుకుపోయిన కాంగ్రెస్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండి తెలుగు ప్రజలకు మేలు చేయక పోగా నష్టం చేసిన వ్యక్తి జైరాం రమేష్ అని తూర్పారబట్టారు. ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రజలు అవకాశం ఇవ్వక పోయినా కాంగ్రెస్‌కు బుద్ది రాలేదని విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ను ప్రజలు తరిమి కొడుతున్నారని వ్యాఖ్యానించారు.