సాక్షి, హైదరాబాద్: బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఈనెల 29నుంచి ప్రారంభిస్తున్నట్టు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ సభలు రాష్ట్రంలో మూడు వరకు ఉండొచ్చునని, వాటిలో పాలమూరు, హైదరాబాద్‌లో బహిరంగసభలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరు బహిరంగసభల్లో పాల్గొంటారని తెలిపారు. మాజీమంత్రి డీకే అరుణతో కలసి శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒక్కో కేంద్రమంత్రి ఎన్నికల ప్రచార సభ ఉంటుందని చెప్పారు.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అస్త్రసన్యాసం చేసిందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణానికి సంబంధించి ఏమైనా జరుగుతుందేమోనని ఆయన భయపడుతున్నారన్నా రు. కాంగ్రెస్ వైఖరితోనే ఆ పార్టీ నాయకులు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోతుందన్నారు. మోదీ మరోసారి ప్రధాని అయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ భూస్థాపితమైంది: డీకే అరుణ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందని మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన నేత డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షపాత్ర నిర్వహణలో కాంగ్రెస్ విఫలమైందన్నా రు. టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌నేతలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనకు కాంగ్రెస్ భరోసా ఇవ్వని కారణంగానే బీజేపీలో చేరినట్టు వివరించారు. పదిహేనేళ్లుగా పార్టీ ఏమి చేయలేదా అన్న విలేకరుల ప్రశ్నకు గత ఐదేళ్లలోనే ఏమీ చేయలేకపోయామని, ప్రతిపక్షపాత్రను సమర్థవంతంగా నిర్వహించలేక పో యామన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియం తృత్వం కొనసాగుతోందని ధ్వజమెత్తారు. లోక్‌సభకు పోటీ చేయకుండానే కేసీఆర్ ప్రధాని ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు లక్ష్మణ్ నుంచి డీకే అరుణ బీ–ఫారం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment