సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతల స్వీకరణ అనంతరం తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గం(పదాధికారులు)లో తెలుగు రాష్ట్రాల నుంచి డీకే అరుణ, పురందేశ్వరిలకు కీలక పదవులు దక్కాయి. తెలంగాణ మాజీ మంత్రి డి.కె.అరుణకు కీలకమైన జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కగా.. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి లభించడం విశేషం. ఏపీ నుంచి సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శి పదవి దక్కింది. పార్టీ జాతీయ కార్యవర్గంలో కీలక నేతలుగా ఉన్న రాంమాధవ్, పి.మురళీధర్‌రావుల స్థానంలో కొత్త వారికి చోటు లభించింది. ఇక, జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఉండగా.. ఆయన స్థానంలో ఎంపీ అనిల్ బెలూనీకి చోటు కల్పించారు.
మొత్తం 23 మంది అధికార ప్రతినిధుల్లో..దక్షిణాది నుంచి అధికార ప్రతినిధులుగా రాజీవ్ చంద్రశేఖర్, టామ్ వడక్కన్‌లు ఇద్దరికే చోటు దక్కింది. 12 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, ఒక ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ సహా మొత్తం 70 మంది ఉన్న ఈ నూతన కార్యవర్గానికి తోడు కార్యవర్గ సభ్యులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. కర్ణాటకకు చెందిన బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్యకు పూనమ్ మహాజన్ స్థానంలో బీజేపీ యువ మోర్చా అధ్యక్ష పదవి దక్కడం విశేషం. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరి కొద్దికాలమే అయినప్పటికీ డీకే అరు ణకు, ము కుల్ రాయ్(పశ్చిమబెంగాల్)కు ఉపాధ్యక్ష పదవులు దక్కడం విశేషం. ఉపాధ్యక్షులుగా మాజీ ముఖ్యమంత్రులు రమణ్‌సింగ్, వసుంధర రాజే, ముకుల్‌రాయ్æ తదితరులు ఎంపికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా భూపేందర్ యాదవ్, కైలాష్ విజయ్‌వర్గీయ, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు)గా బి.ఎల్.సంతోష్ ఎంపికయ్యారు.
పురందేశ్వరి.. సామాజిక సమీకరణలే కీలకం..
ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా.. మరో బలమైన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం నుంచి దగ్గుబాటు పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికచేయడం సామాజిక సమీకరణాల సమతుల్యం చేయడమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సామాజిక వర్గం అండగా ఉన్న టీడీపీ క్రమంగా బలహీనపడుతున్న తరుణంలో ఏపీలో బలోపేతమయ్యే దిశగా ఈ సమతుల్యం అవసరమని విశ్లేషిస్తున్నాయి. పురందేశ్వరికి యూపీఏ ప్రభుత్వంలో కీలకమైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఈ కీలక పదవి దక్కడంలో దోహదపడింది.
డీకే అరుణ.. రెడ్డి సామాజిక వర్గంపై గురి..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీసీ నేత బండి సంజయ్ ఉండగా.. ఇక్కడ మరో బలమైన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉంది. టీఆర్‌ఎస్ వ్యూహాలతో బలహీనపడిన కాంగ్రెస్ నుంచి ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునే దిశగా డీకే అరుణకు జాతీయస్థాయిలో కీలకమైన ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం అరుణకు కలిసొచ్చిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కేబినెట్‌లో చోటు దక్కనుందా?
బిహార్ ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాంమాధవ్‌కు చోటు దక్కవచ్చని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఆయన కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప నుంచి స్పష్టమైన హామీ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment