
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా 13 మంది , 13 మంది జాతీయ కార్యదర్శులు, 23 మంది జాతీయ అధికార ప్రతినిధులు, ఎనిమిది మందికి ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో తెలంగాణ నాయకురాలు డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి కట్టబెట్టిన అధిష్టానం, ఆంధ్రప్రదేశ్ నేత పురందేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది.
అదే విధంగా జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్‌ను నియమించింది. ఇక రామ్ మాధవ్, మురళీధర్‌రావు, జీవీఎల్ నరసింహారావుకు జాతీయ కార్యవర్గంలో చోటు లభించలేదు. కాగా ఈ ఏడాది జనవరిలో జేపీ నడ్డా పార్టీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడం గమనార్హం.
అంకిత భావంతో పనిచేస్తారని ఆశిస్తున్నా
బీజేపీ నూతన కార్యవర్గ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పార్టీ సంప్రదాయాన్ని నిలబెడుతూ దేశం కోసం నిస్వార్థంగా, అంకిత భావంతో పని చేయాలని ఆకాంక్షించారు. పేద ప్రజలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తారని ఆశిస్తున్నానన్నారు.
ధన్యవాదాలు: రామ్ మాధవ్
బీజేపీ నూతన కార్యవర్గానికి ఆ పార్టీ నేత రామ్ మాధవ్ అభినందనలు తెలిపారు. అదే విధంగా.. ఇప్పటిదాకా ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు నిర్వహించే అవకాశం తనకు కల్పించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రామ్ మాధవ్ ట్వీట్ చేశారు.
బీజేపీ జాతీయ మోర్చా అధ్యక్షులు
- యువ మోర్చా అధ్యక్షుడు- ఎంపీ తేజస్వి సూర్య
- జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు- డాక్టర్ లక్ష్మణ్
- కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు- ఎంపీ రాజ్ కుమార్ చాహర్
- ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు- లాల్ సింగ్ ఆర్య
- ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు- సమీర్ ఒరాన్
- మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు- జమాల్ సిద్ధికి
Comments
Please login to add a commentAdd a comment