పార్టీకోసం పనిచేయండి
• రాష్ట్ర బీజేపీ నాయకులకు అధినాయకత్వం దిశానిర్దేశం
• టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేసిన అధిష్టానం దూత
సాక్షి, హైదరాబాద్: నాయకులు పదవులు తీసుకోవడంతోనే సరిపెట్టకుండా పార్టీ సంస్థా గత పురోగతికి అవసరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని రాష్ట్రనేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. సంస్థాగతంగా అందరికీ అన్ని పదవులు రావని, కేంద్ర కార్యక్రమాల్లో పాలుపంచు కోవడం ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయా లని సూచించింది. దీనితో పాటు ప్రతీ నాయకుడు తప్పకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పేర్కొంది. మహిళా, యువ, ఎస్సీ తదితర మోర్చాలు, సెల్‌ల వంటి అనుబంధ విభాగాల ద్వారా కూడా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరింది.
ఈ అంశాలన్నింటిపై దృష్టి కేంద్రీకరించి వచ్చే సార్వత్రిక ఎన్నికలకల్లా పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలు, జిల్లా, మండలస్థాయిలో పార్టీ యంత్రాంగం పనితీరు, పోలింగ్‌బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితిని బీజేపీ జాతీయ సహసంఘటన ప్రధానకార్యదర్శి సతీష్ జీ పరిశీలించారు. మూడురోజుల పాటు సాగిన ఆయన రాష్ట్ర పర్యటన గురువారంతో ముగిసింది.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర, జిల్లా, మండల, బూత్‌స్థాయి నాయకులతో ఆయన సమావేశమై సమాలోచనలు జరిపారు. గురువారం పార్టీ మీడియా కమిటీ, రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ స్థాయిల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి సేకరించిన సమాచారంతో ఆయన త్వరలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నివేదిక సమర్పించనున్నారు.
వచ్చే ఎన్నికల్లో సొంతంగానే పోటీ..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండే అవకాశం లేదని సతీష్ జీ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని, తదనుగుణంగానే జాతీయ స్థాయిలోని వివిధ హోదాల్లోని వ్యక్తుల నుంచి ఆయా సందర్భాల్లో ప్రశంసలు, పొగడ్తలు లభించినంత మాత్రాన టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందేమోనన్న సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొ న్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పార్టీనాయకులు కష్టపడి పనిచేయాలని చెప్పారు.
ఇదిలా ఉండగా వివిధ కేంద్ర పథకాల ద్వారా అందుతున్న నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ పథకాలకు మళ్లించి వాటిని తమ కార్యక్రమాలుగా ›ప్రచారం చేసుకుంటున్నదని కొందరు నేతలు సతీష్ జీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అలాగే కొందరు కేంద్ర మంత్రులు బీజేపీ కార్యాలయానికి రాకుండా నేరుగా సీఎం అధికార నివాసానికి వెళ్లి ›ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతుండటంతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని మరికొందరు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఈ అంశంపై ఆలోచిస్తామని సతీష్ జీ వారికి చెప్పినట్లు తెలిసింది.