బీజేపీ ‘పుర’ పోరు దిశగా..   | BJP Special Focus On Yellandu And Kothagudem In Municipal Elections | Sakshi
Sakshi News home page

బీజేపీ ‘పుర’ పోరు దిశగా..  

Published Tue, Jul 2 2019 10:57 AM | Last Updated on Tue, Jul 2 2019 10:58 AM

BJP Special Focus On Yellandu And Kothagudem In Municipal Elections - Sakshi

సాక్షి, కొత్తగూడెం : గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో కొంతమేరకు బలం కలిగిన బీజేపీ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో సరికొత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. జిల్లాలో మొత్తం ఆరు మున్సిపాలిటీలు ఉండగా, కేవలం రెండు మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో మాత్రమే అధికార యంత్రాంగం వార్డుల హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ల సర్వే చేపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ రెండు మున్సిపాలిటీల్లో బలం పెంచుకునేందుకు తగిన ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగూడెం పట్టణంలో ఆ పార్టీకి కొంతమేరకు ఓటింగ్‌ ఉండగా, ఇల్లెందు మున్సిపాలిటీలో మాత్రం కొన్ని వార్డుల్లో బహుముఖ పోటీ జరిగితే గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నేడు ఇల్లెందులో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు.

సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు హాజరుకానున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం, ఇల్లెందు పట్టణాలకు వరుసగా కేంద్రమంత్రులను తీసుకొచ్చేందుకు జిల్లా పార్టీ నాయకత్వం తగిన ప్రణాళికలు తయారు చేసుకుంటోంది. వివిధ పార్టీల్లోని అసంతృప్త నాయకులను కేంద్ర మంత్రుల సమక్షంలో చేర్చుకునేందుకు తగినవిధంగా పలువురితో మంతనాలు సైతం జరుపుతున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న రెండు మున్సిపాలిటీలపై ఎక్కువ దృష్టి సారించారు. వార్డుల్లో బహుముఖ పోటీ ఉంటే గెలుపొందే అవకాశాలున్న నాయకులపై మరింత నజర్‌ పెట్టారు. ఓటింగ్‌ శాతాన్ని పెంచుకునేలా తగినవిధంగా వ్యూహాలు రచిస్తున్నారు. 

6 నుంచి సభ్యత్వం.. 
మరోవైపు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సైతం ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. జిల్లాలోని 23 మండలాల్లో మొత్తం 75వేలకు పైగా సభ్యత్వాలు చేయించేందుకు ఆ పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగనుంది. అనంతరం ఆగస్టు 12వ తేదీ నుంచి బూత్‌ కమిటీలను వేయనున్నారు. సెప్టెంబర్‌ ప్రణాళికలు పొందించుకుంటున్న బీజేపీ  ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి ఈ నెల 6 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ  నేడు ఇల్లెందులో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం 1వ తేదీ నుంచి మండల, పట్టణ కమిటీలు ఎన్నుకునేందుకు నిర్ణయించారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకోనున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలోనే పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఉండడంతో మరింత ముమ్మరంగా చేపట్టేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమైంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉండడంతో పాటు, రాష్ట్రంలోనూ 4 పార్లమెంటు స్థానాలు గెలవడంతో కొంతమేరకు జిల్లాలోనూ జోష్‌ పెరిగిందని జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చెబుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ జిల్లా కావడంతో జిల్లాలో ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావును తరచూ పర్యటించేలా ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు చెప్పారు. ఆదివాసీ గిరిజనుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉండి, సుదీర్ఘకాల పోరాటాలు చేసిన బాపూరావు పర్యటనల వల్ల పార్టీకి మేలు కలుగుతుందని, బలపడేందుకు అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. జిల్లాలోనూ ఆదివాసీల పోడుభూముల సమస్య ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో ఆదివాసీల సమస్యల విషయంలోనూ ఏజెన్సీలో బాపూరావును విస్తృతంగా తిప్పాలని యోచిస్తున్నారు. ఇప్పటికే గ్యాస్‌ పంపిణీ ద్వారా మహిళలకు దగ్గరయ్యామని, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్‌ ద్వారా యువతకు దగ్గరయ్యామని, తాజాగా మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టినట్లు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు టచ్‌లో ఉన్నట్లు పార్టీ నాయకత్వం చెబుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement