
‘ఆ ఎంపీ మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయ్’
హైదరాబాద్: టాస్క్‌ఫోర్స్ కార్యాలయం పై మానవ బాంబుదాడి విషయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ.. టాస్క్‌ఫోర్స్ కేసులో ఒకలాగా, మాలేగావ్ దాడుల మీద మరోలాగా మాట్లాడటం పై ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ఎంపీగా ఉన్న వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ఉండాలని సూచించారు.
ఇస్లాం దేశాల్లో కూడా ట్రిపుల్ తలాక్ అమలులో లేదు.. కానీ ఓవైసీ తలాక్‌కు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. మతం రంగు పులమడం మంచిది కాదన్నారు. తలాక్‌పై సుప్రీం కోర్టు తీర్పు పౌరుల హక్కు కాపాడే తీర్పు ఇది.. అందరూ శిరసా వహించాలన్నారు. సుప్రీమ్ తీర్పును రాష్ట్ర బీజేపీ స్వాగతిస్తోందన్నారు. ఇది ఎవరి విజయమో.. అపజయమో కాదనీ, ముస్లిం మహిళల ఆత్మ గౌరవం, స్వాలంబనకు సంబంధించినదన్నారు.
ట్రిపుల్ తలాక్ బాధిత మహిళలకు పెద్ద ఊరట లభించిందని ఆయన అన్నారు. ఇప్పిటికైనా సంస్థలు, పార్టీలు పేద ముస్లిం మహిళలకు అండగా ఉండాలి. తీర్పు ప్రచారం చేయాలని కె. లక్ష్మణ్ సూచించారు.