
బీజేపీది ఒంటరి పోరే
ఇదే రాష్ట్ర శాఖ నిర్ణయం: కిషన్‌రెడ్డి
టీడీపీ లీకులకు రోజూ జవాబులు చెప్పలేం
బీజేపీ సభ్యత్వం తీసుకున్న జీవిత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలన్నదే బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కి షన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పార్టీ జాతీయ నాయకత్వం తమను సంప్రదించకుండా పొత్తులపై ఎటువంటి నిర్ణయం తీసుకోదని తెలిపారు. సినీ నటి జీవిత సోమవారం కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. పొత్తులపై వస్తున్న కథనాలను ఖండించారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో తాను రోజూ మాట్లాడుతుంటానని, ఆయనెప్పుడూ పొత్తుల గురించి ప్రస్తావించలేదని చెప్పారు. తమ పార్టీతో పొత్తుపై టీడీపీ లీకులిస్తూ పత్రికల్లో రాయించుకుంటున్న కథనాలకు రోజూ జవాబు చెప్పలేమని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలోనూ బీజేపీకి సానుకూల పవనాలు ఉన్నాయని, అనేక మంది నేతలు తమ పార్టీలోకి వస్తుండటమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపిక కొనసాగుతోందన్నారు. తెలంగాణలోని లోక్‌సభ నియోజకవర్గాలకు చాలా మంది పోటీ పడుతున్నారని చెప్పారు.
కొన్ని స్థానాలకు ఐదారుగురు పోటీ పడుతున్నారన్నారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టబోయే పార్టీ ఎంతకాలం ఉంటుందన్నది భవిష్యత్‌లో తేలుతుందని చెప్పారు. విభజన నేపథ్యంలో రెండు ప్రాంతాలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు కాకపోయినప్పటికీ, అభ్యర్థుల ఎంపికకు పార్టీ నేతల మధ్య పని విభజన జరిగిందని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీమాంధ్రలో జరిగే ఎంపిక కార్యక్రమాలలోనూ తాను పాల్గొంటానని తెలిపారు. రెండు రాష్ట్రాలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, ఇతర ప్రలోభాలకు తావు లేకుండా ఉండేందుకు కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున, లేదంటే ఆ మరుసటి రోజున చైర్‌పర్సన్ల ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, పుష్పలీల తదితరులు పాల్గొన్నారు.
దేశ సమగ్రాభివృద్ధి బీజేపీతోనే : దేశ సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో బీజేపీ ఎన్జీవోస్ విభాగం కన్వీనర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో డాక్టర్ ఎం.ఆర్.సి.నాయుడు, డాక్టర్ జి.ఎల్.ఎన్.మల్లేశ్వరరావు, ధర్మకీర్తి, వేణుగోపాలరావు, రాము తదితరులు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు.
టీడీపీతో పొత్తు ఖాయం.. రఘురామ కృష్ణంరాజు
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో తమ పార్టీ పొత్తు దాదాపు ఖరారైనట్టేనని ఇటీవల బీజేపీలో చేరిన రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు ఏర్పడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ త్వరలోనే విచారణకు రానుందని తెలిపారు.
నేడు బీజేపీ తెలంగాణ ఆవిర్భావ సభ
నిజాం కాలేజీ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం...
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఆవిర్భావ సభ నిర్వహించనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్‌సింగ్, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. నిజాం కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమవుతుంది. మంగళవారం మధ్యాహ్నం రాజ్‌నాథ్, అరుణ్ జైట్లీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత బీజేపీనిర్వహిస్తున్న తొలి కార్యక్రమమిదే. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల శంఖారావం కూడా పూరించనుంది. సభకు జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం సాయంత్రం కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఇతర నాయకులు పరిశీలించారు. సభను ప్రజలు జయప్రదం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.