బ్లాక్ మార్కెట్ | black market | Sakshi
Sakshi News home page

బ్లాక్ మార్కెట్

Published Sat, Jun 14 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

బ్లాక్ మార్కెట్

బ్లాక్ మార్కెట్

 కరీంనగర్ క్రైం/పెద్దపల్లి/జగిత్యాల : ఎరువులు, విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి తద్వారా కృత్రిమ కొరత సృష్టించి రైతులను దోచుకునేందుకు వ్యాపారులు రంగం సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగి శుక్రవారం జగిత్యాల, పెద్దపల్లిలోని పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు చోట్ల పెద్ద ఎత్తున ఎరువులు, విత్తనాల నిల్వలు బయట పడ్డాయి. పెద్దపల్లిలో రూ.35 లక్షలు, జగిత్యాలలో రూ.13 లక్షలు.. మొత్తం రూ.48 లక్షల విలువైన నిల్వలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
 
 మూడు బృందాలుగా విడిపోయిన కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారులు జగిత్యాల, పెద్దపల్లితో పాటు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో ఎరువుల దుకాణాలపై దాడులు చేశారు. లక్సెట్టిపేటలో సైతం రూ.37 లక్షల విలువైన ఎరువులు, విత్తనాల అక్రమ నిల్వలను పట్టుకున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి రూ.85 లక్షల విలువైన 4,644 బస్తాల ఎరువులు, 1,271 ప్యాకెట్ల విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ప్రైవేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున ఎరువులు, విత్తనాలు తెప్పించి దాచి ఉంచారు. గతంలో ఎరువులు, విత్తనాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారి కూడా ముందుగానే ఎరువులు, విత్తనాలు బ్లాక్‌మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరత సృష్టించేందుకు వ్యాపారులు రంగం సిద్ధం చేశారు. పెద్దపల్లి, జగిత్యాలలోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలువురు వ్యాపారులు పెద్ద ఎత్తున ఎరువులు, విత్తనాలు తెప్పించి నిల్వలు చేశారని సమాచారం. అక్రమ నిల్వలపై సమాచారం ఉందని, దాడులు కొనసాగించి వాటన్నింటిని బయటపెడుతామని విజిలెన్స్ సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు.
 
 పెద్దపల్లిలో..
 పట్టణంలోని ఆవునూరి సత్యనారాయణ, సాయిరాం, శ్రీలక్ష్మి, ప్రమీల వేర్ హౌసింగ్ స్టాక్ పాయింట్లపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు జరిపారు. ఆవునూరి సత్యనారాయణ, సాయిరాం దుకాణాల్లో ఉన్న స్టాక్‌కు, రిజిస్టర్లలో నమోదు చేసిన రికార్డులకు తేడా రావడంతో 148 టన్నుల డీఏపీ బస్తాలను సీజ్ చేశారు. ఈ దాడుల్లో వ్యవసాయ శాఖ అధికారులు అశోక్‌రెడ్డి, ప్రకాశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆవునూరి సత్యనారాయణ షాపులో అధికారులు సోదా చేస్తున్న విషయం తెలుసుకున్న మిగతా వ్యాపారులు షాపులకు తాళాలు వేసి వెళ్లారు.
 
 జగిత్యాలలో..
 జగిత్యాలలోని రెండు ఎరువుల దుకాణాలపై శుక్రవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గోపీకృష్ణ, మణిదీప్ ఫర్టిలైజర్స్‌లో ఉన్న ఎరువులకు, రికార్డుల్లోని స్టాక్‌కు పొంతన కుదరకపోవడంతో దుకాణాలను సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ బలరాంరెడ్డి, ఎఫ్‌ఆర్వో విష్ణువర్ధన్,  ఏవో రాంచందర్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement