దేవుడు వరమిచ్చినా..
గిరిజన యువతి బాబీ పైలట్ ట్రైనింగ్‌కు రూ. 25 లక్షల మంజూరు వ్యవహారం
హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న సామెత ఈ ఉదంతానికి అక్షరాలా అతికినట్లుగా సరిపోతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకున్నా, విధివిధానాలు, ప్రొసీజర్స్ అంటూ సంబంధిత శాఖ అధికారులు జాప్యం చేశారనే విమర్శలొచ్చాయి. దీనిపై చివరకు సీఎం కార్యాలయం కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సిన పరిస్థితి ఎదురైంది. దీని పూర్వాపరాలిలా ఉన్నాయి. అట్టడుగువర్గానికి చెందిన గిరిజన యువతి అజ్మీరా బాబీ పైలట్ ్రైటె నింగ్ లెసైన్స్ శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షలు సాయం అందించనున్నట్లు ప్రకటిం చింది. అమెరికాలోని ఫ్లోరిడా మియామీ అంతర్జాతీయ ఫ్లయింగ్ స్కూల్‌లో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ లెసైన్స్ శిక్షణ పొందేందుకు ఆర్థిక సహాయం కింద కె.హరిరాం నాయక్ కుమార్తె అజ్మీరా బాబీకి రూ.25 లక్షలకు పరిపాలనా మంజూరునిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ఈనెల 10వ తేదీన గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి జీడీ అరుణ ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 10వ తేదీన పరిపాలనాపరమైన మంజూరును కూడా ప్రభుత్వం ఇచ్చింది.
అయితే రెండువారాలు గడుస్తున్నా ఈ మొత్తం అందకపోవడంతో బాబీ కుటుం బంలో ఆందోళన మొదలైంది. తాము మొత్తం డబ్బును ఒకేసారి చెక్కురూపంలో ఇవ్వలేమని, ముందుగా రూ.5 లక్షలు ఇస్తామని, ఈ ట్రైనింగ్‌లో చేరినట్లు ఆధారాలు చూపాక మిగతా మొత్తాన్ని విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం రూ.25 లక్షలను ఒకేసారి ఇచ్చేస్తే ఒకవేళ ఆ కోర్సులో ఆమె చేరకపోతే పరిస్థితి ఏమిటనే సందేహాల్ని సైతం వారు వ్యక్తంచేశారు. దీనితో ఈ అంశాన్ని బుధవారం గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ దృష్టికి బాబీ కుటుంబసభ్యులు తీసుకొచ్చారు.
ఆయన ఈ అంశాన్ని సీఎం కార్యాలయం దృష్టికి, ఆ తర్వాత సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం కార్యాలయం సంబంధిత అధికారులను పిలిపించి, వారి వివరణ తీసుకుంది. అప్పటికప్పుడు రూ.25 లక్షలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బాబీకి అందజేశారు. ఈ మొత్తాన్ని గురువారం విడుదల చేయాలని గిరిజనశాఖ అధికారులను సీఎం కార్యాలయం ఆదేశించినట్లు సమాచారం. అధికారుల అలసత్వం, ఆయా పనుల నిర్వహణలో విపరీతమైన జాప్యం, ప్రభుత్వపరంగా ఆదేశాలు జారీచేసినా, ప్రత్యేక ఉదంతంగా (స్పెషల్ కేసు) పేర్కొన్నా.. గిరిజన సంక్షేమశాఖే కాదు, ఏ అధికార యంత్రాంగమైనా వ్యవహరించే తీరుకు ఇదొక ప్రత్యేక నిదర్శనంగా నిలుస్తుంది.