హైదరాబాద్: తెలంగాణ రాజముద్రతో కొత్త ఆహార భద్రతా కార్డుల జారీకి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం అంతకుముందే బోగస్ రేషన్ కార్డులపై దృష్టి పెట్టింది. రెండేసి కార్డులున్న వారిని గుర్తించి బోగస్ కార్డులు తొలగించడం ద్వారా బియ్యం సబ్సిడీపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు యత్నిస్తోంది. ఇందుకోసం ఆధార్ సీడింగ్ డేటాబేస్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం జనవరి చివరి నాటికి అర్హుల గుర్తింపును పూర్తిచేసింది. ప్రస్తుతం చట్టం పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య సుమారు 2.80 నుంచి 2.90 కోట్ల మధ్య ఉంది. వీరందరికీ కిలో రూపాయికి ్రప్రతినెలా 6 కిలోల చొప్పున బియ్యం అందజేస్తోంది.
ఇందుకు ప్రభుత్వంపై ఏటా రూ.వెయ్యి కోట్ల భారం పడుతోంది. అయితే గతంలో మాదిరే కొత్తగా గుర్తించిన అర్హుల జాబితాలోనూ చాలావరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు పౌర సరఫరాల శాఖ దృష్టికి వచ్చింది. జిల్లాల నుంచి హైదరాబాద్ వలస వచ్చినవారు రాజధానితోపాటు, సొంత గ్రామాల్లోనూ కార్డులు కలిగిఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిలో కొందరు వారి రాష్ర్టంలో, ఇక్కడా కార్డులు పొందారు. దీనిపై కిందిస్థాయి అధికారుల నుంచి ఫిర్యాదులు రావడంతో కదిలిన పౌరసరఫరాల శాఖ ఆధార్ సీడింగ్ పూర్తయిన వెంటనే రెండేసి కార్డులున్న వారిని తొలగించాలని నిర్ణయించింది. ప్రసుతానికి రాష్ట్రంలో 88 శాతం వరకు ఆధార్ సీడింగ్ పూర్తయినందున ఈ ప్రక్రియపై దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని గుర్తించేందుకు ఆ రాష్ర్ట సాయం తీసుకోనుంది. ఆ రాష్ర్టం నుంచి ఆధార్ డేటాబేస్‌ను తీసుకుని దానిని ఇక్కడి డేటాబేస్‌తో సరిచూసుకుని బోగస్ కార్డులను తొలగించనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.