వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం బోనాలు. ఆషాఢమాసం ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఎటువంటి కరువులు కాటకాలు, వ్యాధుల బారినపడకుండా ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ అమ్మవారికి బోనం నైవేద్యంగా పెడతారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
శనివారం అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. బోనాల సందర్భంగా అమ్మవారికి కోడిపుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. వీరంగం బోనాల సంబరాల్లో ప్రత్యేక ఘట్టం. ఇక బోనాల్లో చివరి అంకం ఘటాల ఊరేగింపు. కాగా బోనాల సంబరాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బోనాల ఉత్సవాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం రూ. 9.98 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.