
ఇండియాగేట్ ఎదుట బోనాల ఉత్సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఘట్టం ఊరేగింపు మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు బాజాభజంత్రీల మధ్య అమ్మవారి ఘట్టాన్ని ఊరేగించారు. అనంతరం అమ్మవారి ఘట్టాన్ని భవన్‌లో ప్రతిష్టించారు. పోతురాజుల నృత్యం, సంప్రదాయ వేషధారణలో కళాకారుల కోలాహలం మధ్య ఊరేగింపు ఘనంగా జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం, లాల్‌దర్వాజా సింహవాహిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్ర తెజావత్, మందా జగన్నాథం ఆలయ కమిటీ చైర్మన్ కైలాశ్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, స్థానికంగా ఉన్న తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.