
బోనాల సందడి
బోనాల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలో భక్తిభావం ఉప్పొంగింది. భక్తులు భారీగా తరలిరావడంతో సందడి వాతావరణం కన్పించింది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి ఆలయంలో శిఖర పూజతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
రాంగోపాల్‌పేట్ : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం భక్తులు పోటెత్తారు. బోనాలకు ముందుగా వచ్చే శుక్రవారం కావడంతో వేలాది మంది భక్తుల రాకతో దేవాలయంతోపాటు పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. బోనాలతో వచ్చిన వారిని నేరుగా అమ్మవారి దర్శనానికి పంపించగా మిగతా భక్తులను క్యూ లైన్ ద్వారా పంపించారు.
రద్దీ బాగా ఉండడంతో సుభాష్‌రోడ్‌లోని మసీదు వరకు భక్తులు క్యూ కట్టారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెర్నకోల చేతపట్టుకుని డ్యాన్సు చేస్తూ అందరిని ఉత్సాహపరిచారు. సిక్‌విలేజ్‌కు చెందిన భక్తుడు నరేష్‌రాజు భక్తులకు అన్నదానం చేశారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, నాయకులు మల్లికార్జున్‌గౌడ్, శీలం ప్రభాకర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
119 కుండలతో అమ్మవారికి సాక
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా బన్సీలాల్‌పేట్‌కు చెందిన బంగారు తెలంగాణ లష్కర్ బోనాల ఉత్సవ కమిటీ నాయకులు కె.సతీష్, సుధాకర్ ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి 119 కుండలతో సాక పెట్టారు. తెలంగాణలో 119 నియోజకవర్గాలుండగా ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసి వాటిపై ఒక్కో నియోజకవర్గం పేరు రాశారు. మహిళలంతా పసుపు రంగు చీరలు ధరించి ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి సాక పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.