బోనాలకు సర్వం సిద్ధం
- నేడు జాతర
- హాజరు కానున్న మంత్రులు
- ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు
చార్మినార్: ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు పాతబస్తీలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం ఉదయం జాతరకు పలువురు మంత్రులు హాజరవుతున్నట్టు మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు పొటేల్ రాము యాదవ్, కార్యదర్శి దత్తాత్రేయ, మాజీ అధ్యక్షుడు అంజయ్య తెలిపారు.
పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయంతో పాటు, మీరాలంమండి, ఉప్పుగూడ, సుల్తాన్‌షాహి, గౌలిపురా, మురాద్‌మహాల్, అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయాలు.. బేలా ముత్యాలమ్మ ఆలయం, బంగారు మైసమ్మ, రాంబక్షి బండ తదితర ఆలయాలను సిద్ధం చేసినట్టు వారు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారన్నారు.
బోనాలకు గట్టి పోలీసు బందోబస్తు
సిటీబ్యూరో: గొల్కొండ, లష్కర్ బోనాలను శాంతియుతంగా నిర్వహించిన నగర పోలీసులు నేడు పాతబస్తీలో జరిగే బోనాల ఉత్సవాలపై దృష్టి సారించారు. ఈ మేరకు పాతబస్తీలో పోలీసు బలగాలను మోహరించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు పికె ట్లను ఏర్పాటు చేశారు. గస్తీ పోలీసులను, శాంతి కమిటీలను అప్రమత్తం చేశారు. లాల్‌దర్వాజ బోనాలకు వీఐపీలు, వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో పోలీసు కమిషనర్ ఎమ్.మహేందర్‌రెడ్డి ఈ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. బందోబస్తు చర్యలపై ఆయన అన్ని జోన్‌ల డీసీపీలతో చర్చించారు.
అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి టీఎన్‌జీవో రాష్ర్ట అధ్యక్షుడు దేవి ప్రసాద్ శనివారం పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఎన్‌జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.