Mahakali Temple
-
Axar Patel Latest Photos: ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అక్షర్ పటేల్ (ఫొటోలు)
-
మహాకాల్ కారిడార్: ఉజ్జయిని నిండా ఆధ్యాత్మికతే
ఉజ్జయిని: ప్రధాని మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకాల్ కారిడార్ మొదటి దశను ప్రారంభించారు. అనంతరం, ధోతి, గమ్చా ధరించి ప్రఖ్యాత మహాకాళేశ్వరాలయం గర్భగుడిలో పూజలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. వలసపాలన సంకెళ్లను తొలగించుకుంటున్నామని, సాంస్కృతిక ప్రాముఖ్యత గల ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ‘ఉజ్జయినిలోని ప్రతి అణువులోనూ ఆధ్యాత్మికత ఉంటుంది. ఉజ్జయిని ప్రతి మూలలో దైవిక శక్తి ప్రసారం అవుతుంది. భారత దేశ శ్రేయస్సు, జ్ఞానం, గౌరవం, సాహిత్యానికి వేలాది సంవత్సరాలుగా ఉజ్జయిని సారథ్యం వహించింది’ అని పేర్కొన్నారు. ‘పునరుద్ధరణతో నవకల్పన వస్తుంది. వలస పాలనలో కోల్పోయిన వాటిని దేశం పునర్నిర్మిస్తోంది, గత కీర్తిని పునరుద్ధరించుకుంటోంది’ అని ప్రధాని చెప్పారు. మహాకాల్ కారిడార్ ప్రాజెక్ట్ ఉజ్జయిని చైతన్యాన్ని పెంచుతుందని అన్నారు. చార్ధామ్ యాత్రను ఏడాదంతా జరుపుకునేలా రహదారులను అభివృద్ధి చేశామన్నారు. అంతకుముందు, ఉజ్జయిని చేరుకున్న ప్రధాని మోదీకి కారిడార్ వద్ద సాధువులు, మత పెద్దలు స్వాగతం పలికారు. వారికి నమస్కరించుకుంటూ ఆయన ముందుకు సాగారు. అనంతరం ‘శివలింగం’ నమూనాను రిమోట్ బటన్ నొక్కి ఆవిష్కరించి, మహాకాల్ లోక్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. బ్యాటరీ కారులో వెళ్తూ ఆయన కారిడార్‌ను పరిశీలించారు. మల్లకంభం విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. కారిడార్‌లో ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్లు ఆ ప్రాంతానికి మరింత శోభనిచ్చాయి. కారిడార్ ప్రారంభంలో కొద్ది దూరంలో నంది ద్వార్, పినాకి ద్వార్ ఏర్పాటు చేశారు. ప్రధాని వెంట గవర్నర్ మంగూ భాయ్ పటేల్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి సింధియా ఉన్నారు. రిమోట్ నొక్కిశివలింగాకృతిని ఆవిష్కరించడం ద్వారా మహాకాల్ కారిడార్ తొలిదశను జాతికి అంకితంచేస్తున్న మోదీ కారిడార్ విశేషాలివీ... ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడి మహా కాళి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇలా జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలిసి ఉన్న మహాక్షేత్రాలు ఉజ్జయిని, కాశీ, శ్రీశైలం మాత్రమే. మత పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మహా కాళేశ్వరాలయ అభివృద్ధి కోసం దేశంలోనే పొడవైన మహాకాల్ లోక్ కారిడార్‌కు కేంద్రం శ్రీకారం చుట్టింది. కారిడార్ పొడవు 900 మీటర్లు. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.856 కోట్లు. రూ.351 కోట్లతో తొలి దశ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 108 అందమైన పిల్లర్లతో కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఈ పిల్లర్లపై శివుని ఆనంద తాండవంతో పాటు మరెన్నో శివపార్వతుల భంగిమలను చెక్కుతున్నారు. ప్రధాన ద్వారం నుంచి ఆలయం దాకా 93 శివుని విగ్రహాలతో శివపురాణాన్ని చిత్రించారు. ప్రతి విగ్రహంపైనా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే సంబంధిత సమాచారమంతా వస్తుంది. ప్రాజెక్టులో భాగంగా రుద్రసాగర్ వంటి హెరిటేజ్ నిర్మాణాలను కూడా పునరుద్ధరించి సుందరీకరిస్తున్నారు. ఆలయాన్ని క్షిప్రా నదితో అనుసంధానించేందుకు 152 భవనాలను సేకరించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కృత్రిమ మేధ సాయంతో మొత్తంప్రాంతంపై నిరంతర నిఘా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని ఏటా కోటిన్నరకు పైగా భక్తులు సందర్శిస్తుంటారు. కారిడార్ పూర్తయ్యాక ఈ సంఖ్య రెట్టింపవుతుందని అంచనా. కారిడార్ ప్రాజెక్టు స్థానికంగా ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించనుంది. దీనివల్ల నగర ఆర్థికానికి కూడా ఊపు లభించనుంది. ఇదీ చదవండి: మహాకాళేశ్వరుడి మంత్రశక్తి జ్యోతిర్లింగం.. ప్రధాని మోదీ ఆవిష్కరించబోయే కారిడార్ ప్రత్యేకతలు ఇవే! -
ఆలయం ముందు మహిళలపై వీరంగం
ఉజ్జయినీ : ఆలయం ముందు పూల వ్యాపారుల మధ్య నడిరోడ్డు మీద గొడవ జరిగింది. ఆలయం ముందు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మహిళలపై దారుణంగా దాడి చేశాడు. ప్రత్యర్థి వ్యక్తిని కిందపడేసి కొట్టడమే కాదు.. అతనికి అండగా వచ్చిన మహిళలపైనా విచక్షణారహితంగా దాడి చేశాడు. మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలోని ‘మహంకాళి’ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూల వ్యాపారుల మధ్య గొడవ ఎందుకు జరిగింది? వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఆలయం ముందు జరిగిన ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అర్ధనగ్నంగా ఉన్న ఓ యువకుడు వీరంగం వేశాడు. ప్రత్యర్థి యువకుడిని కిందపడేసి చితకబాదడమే కాదు.. మహిళలని చూడకుండా కిరాతకంగా దాడి చేశాడు. మహిళలను కర్రతో చితకబాదడమే కాకుండా.. వారిపై ఎగిరిదూకి సినిమా తరహాలో స్టంట్లు చూశాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రభావం ఆ యువకుడిపై కనిపిస్తోందని, మహిళలను కిరాతకంగా కొడుతున్నా.. చుట్టూ ఉన్నవారు వినోదం చూస్తున్నారే తప్ప.. ఎవరూ ఎందుకు స్పందించలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
వైభవంగా మహాకాళి తిరునాళ్ళు
గుంటూరు : గుంటూరు జిల్లా నరసరావుపేట ఇస్సప్పాలెంలోని శ్రీ మహాకాళీ అమ్మవారి దేవస్థానం 40వ వార్షిక మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా తిరునాళ్ళను పురస్కరించుకొని ఆలయాన్ని పూలతో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు పొంగళ్ళు పొంగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులు, నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించి పూజలు జరిపారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పట్టణం నుంచి బాలప్రభలు అమ్మవారి ఆలయానికి తరలివచ్చాయి. ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల జాగరణ కోసం ఆలయప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. భక్తులకు అన్న సంతర్పణ జరిగింది. పలు స్వచ్చంద సంస్థలు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశాయి. -
వైభవంగా ఘటాల ఊరేగింపు
చార్మినార్/ చాంద్రాయణగుట్ట: డప్పుల వాయిద్యాలు.. యువకుల నృత్యాలు.. కళాకారుల ప్రదర్శన.. విచిత్ర వేషధారణలతో పాతబస్తీలో శ్రీ మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు వైభవంగా సాగింది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన అక్కన్నమాదన్న దేవాలయ ఘటం సాయంత్రం 5.10 గంటలకు హిమ్మత్‌పురా చౌరస్తాకు చేరుకోగా.. దానిని అనుసరిస్తూ మిగతా ఊరేగింపు కదిలింది. సకాలంలో ఘటాల ఊరేగింపు ముగియడంతో పోలీసులు, ఉత్సవాల నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు. ఊరేగింపు సాగిందిలా.. ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో ప్రారంభమైన మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు ఛత్రినాక ద్వారా లాల్‌దర్వాజా సింహ వాహిని ఘటాలలో కలిసింది. అక్కన్న మాదన్న దేవాలయం, మురాద్ మహాల్, గౌలిపురా, సుల్తాన్షాహి, హరిబౌలిల ఘటాలు లాల్‌దర్వాజా మోడ్‌కు చేరుకున్నాయి. ఈ ఊరేగింపు శాలిబండ, హిమ్మత్‌పురా చౌరస్తా, మక్కా మసీదు, చార్మినార్, గుల్జార్‌హౌజ్‌ల మీదుగా నయాపూల్ మూసి నదిలోని ఢిల్లీ దర్బార్ మైసమ్మ దేవాలయం వరకు కొనసాగింది. మీరాలంమండి నుంచి ప్రారంభమైన శ్రీ మహాంకాళి అమ్మవారి ఘటం కోట్ల అలీజా, సర్దార్‌మహాల్ ద్వారా చార్మినార్ చేరుకొని ఊరేగింపులో కలిసింది. వెల్లివిరిసిన మతసామరస్యం పాతబస్తీలో మరోసారి మతసామరస్యం వెల్లివిరిసింది. ఘటాల ఊరేగింపు సందర్భంగా రంజాన్ మార్కెట్ మూసేసి ముస్లిం సోదరులు హిందువులకు సహకరించగా.. ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా మక్కా మసీదులో నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం రాత్రి కొద్ది సేపు ఘటాల ఊరేగింపును హిమ్మత్‌పురా చౌరస్తా వద్ద నిలిపివేసి హిందువులు స్నేహా భావాన్ని చాటుకున్నారు. మక్కా మసీదులో రాత్రి ఇఫ్తార్ అనంతరం నిర్వహించిన మగ్రీబ్ నమాజ్ ప్రార్థనలు ముగిసిన వెంటనే తిరిగి ఊరేగింపు ప్రారంభించి... ముస్లింలు తిరిగి రాత్రి 8.30 గంటలకు మక్కా మసీదులో నిర్వహించే ఇషాకి నమాజ్ ప్రారంభం లోపే (8 గంటలకు) చార్మినార్ కట్టడాన్ని దాటేసారు. ఇలా ఉత్సవాల సందర్భంగా ఇరువర్గాల ప్రజలు సహకరించుకున్నారు. -
బోనాలకు సర్వం సిద్ధం
నేడు జాతర హాజరు కానున్న మంత్రులు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు చార్మినార్: ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు పాతబస్తీలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం ఉదయం జాతరకు పలువురు మంత్రులు హాజరవుతున్నట్టు మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు పొటేల్ రాము యాదవ్, కార్యదర్శి దత్తాత్రేయ, మాజీ అధ్యక్షుడు అంజయ్య తెలిపారు. పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయంతో పాటు, మీరాలంమండి, ఉప్పుగూడ, సుల్తాన్షాహి, గౌలిపురా, మురాద్‌మహాల్, అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయాలు.. బేలా ముత్యాలమ్మ ఆలయం, బంగారు మైసమ్మ, రాంబక్షి బండ తదితర ఆలయాలను సిద్ధం చేసినట్టు వారు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారన్నారు. బోనాలకు గట్టి పోలీసు బందోబస్తు సిటీబ్యూరో: గొల్కొండ, లష్కర్ బోనాలను శాంతియుతంగా నిర్వహించిన నగర పోలీసులు నేడు పాతబస్తీలో జరిగే బోనాల ఉత్సవాలపై దృష్టి సారించారు. ఈ మేరకు పాతబస్తీలో పోలీసు బలగాలను మోహరించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు పికె ట్లను ఏర్పాటు చేశారు. గస్తీ పోలీసులను, శాంతి కమిటీలను అప్రమత్తం చేశారు. లాల్‌దర్వాజ బోనాలకు వీఐపీలు, వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో పోలీసు కమిషనర్ ఎమ్.మహేందర్‌రెడ్డి ఈ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. బందోబస్తు చర్యలపై ఆయన అన్ని జోన్ల డీసీపీలతో చర్చించారు. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి టీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు దేవి ప్రసాద్ శనివారం పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన లాల్‌దర్వాజా ఉత్సవాలు
చాంద్రాయణగుట్ట:చారిత్రాత్మతకమైన లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి ఆలయంలో 106వ వార్షిక బ్రహోత్మవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్ దంపతులు నిర్వహించిన దేవి అభిషేకంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఉదయం 11 గంటలకు నగర్ పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి, అదనపు కమిషనర్ అంజనీ కుమార్, జాయింట్ కమిషనర్ మల్లారెడ్డి, దక్షిణ మండలం డీసీపీ ఎస్ఎస్ త్రిపాఠి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆలయం పెకైక్కి శిఖర పూజ చేశారు. అనంతరం ధ్వజారోహణ చేశారు. సాయంత్రం 6.15 గంటలకు కలశ స్థాపన జరిగింది. దేవి ఉపాసకులు దైవజ్ఞశర్మ, లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ బి.బల్వంత్ యాదవ్, మాజీ చైర్మన్లు కె.విష్ణుగౌడ్, బంగ్లా రాజు యాదవ్, రంగ రమేశ్ గౌడ్, సలహా కమిటీ చైర్మన్ జి.మహేశ్‌గౌడ్, కోశాధికారి టి.నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్, గౌలిపురా కార్పొరేటర్ ఆలే జితేంద్రతోపాటు ఆలయ కమిటీ సభ్యులు బీఆర్ సదానంద్ ముదిరాజ్, పోసాని సదానంద్ ముదిరాజ్, మాణిక్ ప్రభుగౌడ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఎం.బాలసుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు. -
నేటి నుంచి పాతబస్తీలో బోనాల సంబరాలు
చార్మినార్: పాతబస్తీలో శుక్రవారం నుంచి బోనాల సంబరాలు ప్రారంభం కానున్నాయి. కలశస్థాపన, ద్వజారోహణం, అంకురార్పణ తో బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. లాల్‌దర్వాజా సింహావాహిణి దేవాలయం, మీరాలంమండి మహంకాళి దేవాలయం, అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం, బేలా ముత్యాలమ్మ దేవాలయం, సుల్తాన్షాహి జగదాంబ దేవాలయం, ఉప్పుగూడ మహంకాళి తదితర దేవాలయాల్లో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 13వ తేదీన పాతబస్తీలోని వివిధ అమ్మవారి దేవాలయాల ఘటస్థాపన ఊరేగింపు కొనసాగుతుంది. 20వ తేదీన బోనాల సమర్పణ, 21వ తేదీన అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు పెద్ద ఎత్తున జరుగుతాయి.