మహాకాళేశ్వరుని సమక్షంలో మోదీ జపం
ఉజ్జయిని: ప్రధాని మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకాల్ కారిడార్ మొదటి దశను ప్రారంభించారు. అనంతరం, ధోతి, గమ్‌చా ధరించి ప్రఖ్యాత మహాకాళేశ్వరాలయం గర్భగుడిలో పూజలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. వలసపాలన సంకెళ్లను తొలగించుకుంటున్నామని, సాంస్కృతిక ప్రాముఖ్యత గల ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ‘ఉజ్జయినిలోని ప్రతి అణువులోనూ ఆధ్యాత్మికత ఉంటుంది. ఉజ్జయిని ప్రతి మూలలో దైవిక శక్తి ప్రసారం అవుతుంది. భారత దేశ శ్రేయస్సు, జ్ఞానం, గౌరవం, సాహిత్యానికి వేలాది సంవత్సరాలుగా ఉజ్జయిని సారథ్యం వహించింది’ అని పేర్కొన్నారు.
‘పునరుద్ధరణతో నవకల్పన వస్తుంది. వలస పాలనలో కోల్పోయిన వాటిని దేశం పునర్నిర్మిస్తోంది, గత కీర్తిని పునరుద్ధరించుకుంటోంది’ అని ప్రధాని చెప్పారు. మహాకాల్ కారిడార్ ప్రాజెక్ట్ ఉజ్జయిని చైతన్యాన్ని పెంచుతుందని అన్నారు. చార్‌ధామ్ యాత్రను ఏడాదంతా జరుపుకునేలా రహదారులను అభివృద్ధి చేశామన్నారు. అంతకుముందు, ఉజ్జయిని చేరుకున్న ప్రధాని మోదీకి కారిడార్ వద్ద సాధువులు, మత పెద్దలు స్వాగతం పలికారు. వారికి నమస్కరించుకుంటూ ఆయన ముందుకు సాగారు. అనంతరం ‘శివలింగం’ నమూనాను రిమోట్ బటన్ నొక్కి ఆవిష్కరించి, మహాకాల్ లోక్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. బ్యాటరీ కారులో వెళ్తూ ఆయన కారిడార్‌ను పరిశీలించారు. మల్లకంభం విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. కారిడార్‌లో ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్‌లు ఆ ప్రాంతానికి మరింత శోభనిచ్చాయి. కారిడార్ ప్రారంభంలో కొద్ది దూరంలో నంది ద్వార్, పినాకి ద్వార్ ఏర్పాటు చేశారు. ప్రధాని వెంట గవర్నర్ మంగూ భాయ్ పటేల్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి సింధియా ఉన్నారు.
రిమోట్ నొక్కిశివలింగాకృతిని ఆవిష్కరించడం ద్వారా మహాకాల్ కారిడార్ తొలిదశను జాతికి అంకితంచేస్తున్న మోదీ
కారిడార్ విశేషాలివీ...
- ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడి మహా కాళి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇలా జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలిసి ఉన్న మహాక్షేత్రాలు ఉజ్జయిని, కాశీ, శ్రీశైలం మాత్రమే.
- మత పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మహా కాళేశ్వరాలయ అభివృద్ధి కోసం దేశంలోనే పొడవైన మహాకాల్ లోక్ కారిడార్‌కు కేంద్రం శ్రీకారం చుట్టింది.
- కారిడార్ పొడవు 900 మీటర్లు. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.856 కోట్లు.
- రూ.351 కోట్లతో తొలి దశ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
- మొత్తం 108 అందమైన పిల్లర్లతో కారిడార్‌ను నిర్మిస్తున్నారు.
- ఈ పిల్లర్లపై శివుని ఆనంద తాండవంతో పాటు మరెన్నో శివపార్వతుల భంగిమలను చెక్కుతున్నారు.
- ప్రధాన ద్వారం నుంచి ఆలయం దాకా 93 శివుని విగ్రహాలతో శివపురాణాన్ని చిత్రించారు. ప్రతి విగ్రహంపైనా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే సంబంధిత సమాచారమంతా వస్తుంది.
- ప్రాజెక్టులో భాగంగా రుద్రసాగర్ వంటి హెరిటేజ్ నిర్మాణాలను కూడా పునరుద్ధరించి సుందరీకరిస్తున్నారు.
- ఆలయాన్ని క్షిప్రా నదితో అనుసంధానించేందుకు 152 భవనాలను సేకరించారు.
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కృత్రిమ మేధ సాయంతో మొత్తంప్రాంతంపై నిరంతర నిఘా ఉంటుంది.
- ఈ క్షేత్రాన్ని ఏటా కోటిన్నరకు పైగా భక్తులు సందర్శిస్తుంటారు. కారిడార్ పూర్తయ్యాక ఈ సంఖ్య రెట్టింపవుతుందని అంచనా.
- కారిడార్ ప్రాజెక్టు స్థానికంగా ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించనుంది. దీనివల్ల నగర ఆర్థికానికి కూడా ఊపు లభించనుంది.
ఇదీ చదవండి: మహాకాళేశ్వరుడి మంత్రశక్తి జ్యోతిర్లింగం.. ప్రధాని మోదీ ఆవిష్కరించబోయే కారిడార్ ప్రత్యేకతలు ఇవే!
Comments
Please login to add a commentAdd a comment