ఎముకల నుంచి నూనె, డాల్డా తయారీ
రాజేంద్రనగర్, న్యూస్‌లైన్: ఆకలి వేస్తోంది కదా అని కనిపించిన ప్రతీ హోటల్‌లో ఏది బడితే అది తినకండి. అలా తిన్నారా.. చేజేతులా మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకున్నవారవుతారు. కాసులకు కక్కుర్తిపడి కొందరు ఎముకల నుంచి నూనె, డాల్డా తయారు చేస్తున్నారు. కొన్ని హోటళ్లలో వీటితో ఆహారాన్ని వండి ప్రజల ఆరోగ్యానికి హానికలిగిస్తున్నారు. పశువుల ఎముకల నుంచి అక్రమంగా నూనె, డాల్డా తయారు చేస్తున్న ఓ పరిశ్రమ గుట్టును గగన్‌పహాడ్ గ్రామస్తులు బుధవారం రట్టు చేశారు.
స్థానికుల కథనం ప్రకారం... గగన్‌పహాడ్ గ్రామ పరిధిలో దాదాపు ఒక ఎకరం స్థలంలో నగరానికి చెందిన హమీద్ అనే వ్యక్తి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి డీసీఎంలో ఎముకలను తీసుకొస్తున్నాడు. పెద్ద పెద్ద కళాయిల్లో ఎముకలను వేసి మరిగించి వాటితో నూనె, డాల్డా తయారు చేయిస్తున్నాడు. అస్సాం, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన కార్మికులను ఈ పనికి ఉపయోగిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి సమయంలో మాత్రమే ఈ పని చేస్తున్నారు. లారీల కొద్దీ ఎముకలు ఈ ప్రాంతం మీదుగా వెళ్తుండటంతో స్థానిక యువకులకు బుధవారం ఉదయం అనుమానం వచ్చింది. వారు డీసీఎంను అనుసరించగా విషయం బయటపడింది.
యువకులు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో పెద్దసంఖ్యలో ఆ పరిశ్రమ వద్దకు వెళ్లి తరలివచ్చి దాడి చేశారు. అక్కడి పని చేస్తున్న కార్మికులపై చేసుకున్నారు. వారు ఉంటున్న మూడు గదులను, ఎముకల లోడ్‌తో వచ్చిన డీసీఎం వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. దాడితో భయకంపితులైన 12 మంది కార్మికులు మూటాముల్లె సర్దుకొని పారిపోయారు. ఇంత జరిగినా శంషాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి రాకపోవడం గమనార్హం. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని విధాలా సహకరిస్తుండటంతోనే నిర్వాహకుడి ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు.
నగరంలోని హోటళ్లకు....
నగరంలోని హోటళ్లకు ఇక్కడి నుండి నూనె, డాల్డాను సరఫరా చేస్తున్నట్లు ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది చెప్పారు. హోటళ్ల నిర్వాహకులు ప్రతీ రోజు ఇక్కడికి వచ్చి.. తాము తయారు చేసిన నూనె, డాల్డా తీసుకెళ్తున్నట్టు వారు తెలిపారు. ఘటనా స్థలంలో 50 డ్రమ్ములలో తయారైన డాల్డా, నూనె నిల్వచేసి ఉంది.
గతంలో రెండుసార్లు
ఇదే స్థలంలో గతంలో రెండుసార్లు ఎముకల నుంచి నూనె, డాల్డాను తయారు చేస్తుండగా శంషాబాద్ పోలీసులకు పట్టించామని గ్రామస్తులు తెలిపారు. ఆ సమయంలో కేవలం కార్మికులను సామగ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అసలు నిందితున్ని అదుపులోకి తీసుకోలేదని వారు ఆరోపించారు.