
'జీఎస్టీ భారం తగ్గించాలని ఒత్తిడి తెస్తాం'
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. ఆదివారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎన్డీయే తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లుకు టీఆర్‌ఎస్ బేషరతుగా మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. జీఎస్టీ బిల్లు పాసయ్యేదాకా బీజేపీ ఒక మాట, బిల్లు నెగ్గిన తర్వాత మరో మాట అన్నట్టుగా ఉందన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారని, ఇప్పుడేమో తెలంగాణకు సంబంధించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం బుల్‌డోజ్ చేస్తోందని నర్సయ్యగౌడ్ విమర్శించారు.
రాష్ట్రంలో మిషన్ భగీరథ, కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాలపై పెద్ద ఎత్తున జీఎస్టీ భారం పడుతోందన్నారు. ఇవేవీ అంబానీ, ఆదానీ కంపెనీలు కావని, ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులు అని అన్నారు. వీటిపై జీఎస్టీ భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీకి మూడేళ్ల నుంచి అన్ని అంశాల్లో మద్దతును ఇస్తున్నామని, ఇప్పటికైనా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై సహకరించాలని నర్సయ్యగౌడ్ కోరారు.
రాష్ట్రానికి ఎయిమ్స్ ఇవ్వలేదని, నియోజకవర్గాల పెంపు లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిందన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై స్పందన లేదన్నారు. కనీసం జీఎస్టీ భారాన్ని తగ్గించాలని కోరారు. అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే నిరంతర ఒత్తిడి తెస్తామన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఒత్తిడి తెచ్చి హక్కులను సాధించుకోవటం టీఆర్‌ఎస్‌కు కొత్తకాదన్నారు.