హర్షవర్ధన్
లక్ష్మణచాంద(నిర్మల్) : అభం శుభం తెలియని ఓ విద్యార్థిపై అగంతకుడు జరిపిన కత్తిపోట్లతో విద్యార్థి జీవితం బలయింది. ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవిష్యత్ పొందుతాడని భావించిన విద్యార్థి తల్లిదండ్రుల ఆశలు నీరుగారిపోతున్నాయి. కత్తిపోట్లకు బలైన విద్యార్థి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రుల వేదన మాటలకు అందనిదిగా మారింది. వివరాలలోకి వెళితే.. మండలంలోని చామన్‌పెల్లి గ్రామానికి చెందిన అరటి మమత–శ్రీనివాస్‌ల దంపతుల రెండోకుమారుడు హర్షవర్ధన్ (12) కుభీర్‌లోని జాంగామ్‌లోని మహాత్మజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
గతనెల2వ తేదీ ఉదయం మూడు గంటలకు గురుకుల పాఠశాలలో విద్యార్థి పడుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్‌లోకి ప్రవేశించి కత్తితో దాడి చేశాడు. దీంతో విద్యార్థి అరవడంతో అగంతకుడు అక్కడ నుంచి పరారయ్యాడు. విద్యార్థికి వెన్నుపూస సమీపంలో రెండు కత్తిపోట్ల గాయాలయ్యాయి. విద్యార్థి హర్షవర్ధన్‌ను ఇన్‌చార్జి ఉపాధ్యాయుడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కి తరలించారు.
అక్కడ వారం చికిత్స పొందాడు. వెన్నుపూస వద్ద ఉన్న నరాల్లో ఒకదానికి కొంత గాయం తగిలిందని వైద్యులు నిర్ధారించారు. వారంచికిత్స అనంతరం కూడా విద్యార్థి కాళ్లు రెండు పని చేయడంలేదు. ఇంటి వద్ద ఫిజియోథెరపీ చేయిస్తే నయం అవుతాయని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో వైద్యంకోసం అయిన రూ.2 లక్షల బిల్లులు చెల్లించి ఇంటికి తీసుకొచ్చామని కన్నీటితో విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
పట్టించుకోని బీసీ గురుకుల అధికారులు
ఇంతటి సంఘటన పాఠశాల హాస్టల్‌లో జరిగినా నేటివరకు బీసీ గురుకుల అధికారులు వైద్యంకోసం నయాపైసా ఇవ్వలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. నిత్యం వెయ్యి ఖర్చు విద్యార్థిని ఇంటికి తీసుకు వచ్చిన నుంచి నేటి వరకు నిత్యం నిర్మల్‌కు చెందిన ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ కిరణ్‌తో ఇంటి వద్ద ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. ఒక కాలు మాత్రమే పని చేస్తోంది. నేటి వరకు ఎడమ కాలు పూర్తిగా చచ్చుబడి పని చేయకపోవడంతో విద్యార్థి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు.
మంత్రి ఎల్‌వోసీ ఇచ్చినా అందని వైద్యం
విద్యార్థి విషయం తెలుసుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ , దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.1.50 లక్షల ఎల్‌వోసీని ఇప్పించారు. అయినా నిమ్స్ వైద్యులు చికిత్స అందించలేదు. ఏదైనా శస్త్ర చికిత్సలకు మాత్రమే వర్తిస్తుందని ఫిజియోథెరపీకి వర్తించవని వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
దాతలు సాయం చేయాలి
మధ్యతరగతికి చెందిన తాము ఉన్న డబ్బు ఇప్పటివరకు ఖర్చు చేశాం. ఇతరుల వద్ద అప్పులు తీసుకువచ్చి వైద్యం చేయించాం. కాని ప్రస్తుతం నిత్యం రూ.700 నుంచి వెయ్యి అవుతున్నాయి. ఇంత ఖర్చు తాము భరించలేం. ప్రభుత్వం చొరవతీసుకొని వైద్యం అందించేలా చూడాలి. సాయం చేయాలనుకునే వారు 9441629815 అనే ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. – శ్రీనివాస్, విద్యార్థి తండ్రి
Comments
Please login to add a commentAdd a comment