attack by knife
-
ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.. తీరా గర్భిణి అయ్యాక..
ఖమ్మం క్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై గొడవల కారణంగా ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం రేవతి థియేటర్ ప్రాంతానికి చెందిన ప్రీతిని అదే ప్రాంతానికి చెందిన తేజానూత్ సాయి మూడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సాయి పాత బస్టాండ్ వద్ద అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. వివాహమైనప్పటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా, ఇరువర్గాల కుటుంబీకులు సర్ది చెప్పడం.. మళ్లీ కలసిపోవడం జరుగుతోంది. కాగా, సైకోలా వ్యవహరించే సాయి.. ఆమెను ఇష్టారీతిగా కొట్టడమేకాకుండా, చుట్టుపక్కల వారు అడ్డుకుంటే వారిపైనా దాడికి పాల్పడుతుండేవాడు. ఇటీవల గర్భం దాల్చిన ఆమెను అలాగే కొడుతుండటంతో పుట్టింటికి వచ్చింది. వీరిద్దరూ కలసి ఉండడం సాధ్యం కాదని భావించిన పెద్దమనుషులు విడాకుల పత్రం రాయించారు. అయినా సాయి వచ్చి ప్రీతికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఎప్పటిలాగే మూడు రోజుల క్రితం సాయి మళ్లీ కొట్టడంతో ప్రీతి పుట్టింటికి వచ్చింది. బుధవారం సాయంత్రం ప్రీతి వద్దకు వచ్చిన సాయి, మాట్లాడే పని ఉందని సమీపంలోని తన ఇంటికి తీసుకెళ్లి గొడవ పడుతూ అరటి పండ్లు కోసే కత్తితో ఇష్టారీతిగా శరీరం పై పొడిచి తలుపు వేసి వెళ్లిపోయాడు. అయితే కత్తితో పొడుస్తున్నప్పుడు ఆమె గట్టిగా కేకలు వేసినా, ఎప్పుడూ జరిగే గొడవలే కావొచ్చని ఎవరూ పట్టించు కోలేదు. చివరకు ఆమె గావుకేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి చూసే సరికి రక్తం మడుగులో ఉంది. వెంటనే ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె శరీరంపై అయిన గాయాలకు 80కుట్లు వేశారు. టూటౌన్ సీఐ శ్రీధర్, ఎస్సై రాము పరారీలో ఉన్న సాయి కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రేమించుకున్నాం.. రక్షణ కల్పించండి.. -
టైం కోసం వేచి చూసి.. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో..
వీరులపాడు కృష్ణా (నందిగామ): వివాహితపై ఓ యువకుడు కత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని అల్లూరు గ్రామానికి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన యువకుడు యర్రంశెట్టి లక్ష్మీనారాయణ ఆ వివాహితను కొంత కాలంగా వేధిస్తున్నాడు. తనతో మాట్లాడాలని, లేకుంటే అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఆదివారం ఉదయం వివాహిత ఒంటరిగా ఇంటిలో ఉంది. ఆ సమయంలో పూటుగా మద్యం తాగి లక్ష్మీనారాయణ ఆమె ఇంటిలోకి ప్రవేశించి, లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన అతను తనతో తెచ్చుకున్న కత్తితో వివాహితపై దాడిచేసి గాయపరిచాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన వివాహిత భర్త రక్తపు మడుగులో ఉన్న తన భార్యను చూసి కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు వచ్చేలోగా తన బైకును అక్కడే వదిలి లక్ష్మీనారాయణ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మహిళను 108 అంబులెన్స్‌లో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దాడికి పాల్పడిన లక్ష్మీనారాయణ తన ఇంటిలోనే ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ సోమేశ్వరరావు చెప్పారు. కఠిన చర్యలు తీసుకోవాలి వివాహితపై దాడి జరిగిన ఘటనను తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ బాధిత కుటుంబాన్ని ఫోనులో పరామర్శించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. -
మహిళ గొంతుకోసిన కానిస్టేబుల్
కోవూరు: వివాహిత మహిళపై ఓ ఏపీఎస్పీ కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేశాడు. బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. తన భార్య ఆత్మహత్యకు మహిళ, ఆమె భర్త కారణమన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన కోవూరులోని లక్ష్మీనగర్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ సర్వేపల్లి సురేష్ కుటుంబం రెండేళ్లక్రితం లక్ష్మీనగర్‌లో రవి, షకున్ దంపతుల ఇంటి పక్కన అద్దెకుండేది. రెండు కుటుంబాల మధ్య విభేదాలు రావడంతో వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు. ఈ ఫిబ్రవరిలో కానిస్టేబుల్ భార్య హరిప్రియ ఆత్మహత్య చేసుకుంది. తన భార్య మృతికి షకున్ భర్త రవి కారణమని సురేష్ అనుమానించాడు. ఇందుకు ప్రతిగా రవి భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శనివారం లక్ష్మీనగర్‌కు వెళ్లాడు. ఆ సమయంలో రవి తన పిల్లలను స్కూల్ వద్ద వదిలేందుకు వెళ్లాడు. సురేష్ ను చూసి ‘అన్నా మంచినీళ్లు ఇవ్వమంటావా..’ అని షకున్ అడిగింది. నీళ్లు వద్దు.. కొద్దిగా పాలు ఇవ్వమనడంతో ఆమె కిచెన్‌లోకి వెళ్లింది. వెంటనే సురేష్ ఇంటి తలుపుకు గడియపెట్టి కిచెన్‌లోకి వెళ్లాడు. ఆమెపై దాడికి దిగి బ్లేడుతో గొంతు కోశాడు. ఈలోగా ఇంటికి చేరుకున్న రవి తలుపు పగులగొట్టి లోపలికెళ్లగా.. అతనిపైనా సురేష్ దాడికి యత్నించాడు. అతను తప్పించుకుని బయటకు పరుగుతీశాడు. దీంతో సురేష్ అక్కడినుంచి పరారయ్యాడు. షకున్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆమె కోలుకుంటోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. -
ప్రేమనాటకం.. పెళ్లనగానే ప్రేయసి పరార్
మణికొండ: అతడికి అప్పటికే పెళ్లి అయ్యింది. ఆ విషయాన్ని దాచి మరో యువతితో ప్రేమ నాటకానికి తెరలేపాడు. అతడిని నమ్మిన యువతి తన మతం, కులం వేరైనా వివాహానికి సిద్ధమైంది. అంతలోనే అతడికి పెళ్లయిన విషయం తెలిసి దూరం పెట్టింది. ఇది జీర్ణించుకోలేకపోయిన అతను ఆమెను అంతం చేయాలని పథకం వేసి పోలీసులకు చిక్కాడు. మంగళవారం రాత్రి నార్సింగి ఠాణా పరిధిలోని హైదర్షాకోట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై జరిగిన దాడి కేసులో పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. హరియాణా రాష్ట్రానికి చెందిన షారూఖ్ సల్మాన్ (23) కొన్నేళ్లుగా స్థానికంగా ఉన్న జావెద్ హబీబ్ సెలూన్లో పనిచేస్తున్నాడు. బాధితురాలు పలుమార్లు అదే సెలూన్‌కు వెళ్లడంతో పరిచయం చేసుకున్న అతడు ప్రేమనాటకం మొదలు పెట్టాడు. ఓ దశలో అతడిని వివాహం చేసుకునేందుకు యువతి సిద్ధమైంది. ఈ క్రమంలో అతనికి గతంలోనే వివాహం అయ్యిందని, భార్యాపిల్లలు ఉన్నారనే విషయం తెలిసింది. దీంతో యువతి అతడిని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఆ విషయాన్ని తట్టుకోలేక ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే దురుద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా ఆమె మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో ఏకంగా తనను మట్టుపెట్టాలనే పథకం వేశాడు. మంగళవారం రాత్రి చివరిసారిగా మాట్లాడాలని అపార్ట్మెంట్ కిందికి రప్పించి ఉన్నట్టుండి తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడికి పాల్పడ్డాడు. యువతి బిగ్గరగా కేకలు వేయడంతో ఆమె తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల వారు రాగానే షారూఖ్ పారిపోయిందుకు యత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని కోర్టు రిమాండ్ విధించినట్టు ఎస్సై అన్వేశ్‌రెడ్డి తెలిపారు. -
షిర్డీ వెళ్లొస్తుండగా తెలుగువారిపై దారి దోపిడీ
ముంబై: దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన తెలుగు వారిపై మహారాష్ట్రలో దోపిడీ దొంగలు దాడికి పాల్పడి దొరికిన సొమ్మును దోచుకెళ్లారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని వాసీలో చోటుచేసుకుంది. బాధితులు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అయితే దోపిడీ దొంగల దాడిలో గాయపడిన తెలుగువారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వికారాబాద్ జిల్లా బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కె.రాములు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. కుల్కచర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రమేశ్. వీరిద్దరూ తమ కుటుంబంతో కలిసి మహారాష్ట్రలోని షిర్డీకి కారులో వెళ్లారు. షిర్డీ యాత్ర ముగించుకుని శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. కర్నాటకలోని వాసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రాగానే దొంగలు వీరి కారును అడ్డగించారు. రోడ్డుపై మేకులు వేసి కారు పంక్చరయ్యేలా చేశారు. అయితే దొంగలను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో దొంగలు రెచ్చిపోయారు. ఆ కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కొడుతూ.. కత్తులతో బెదిరిస్తూ డబ్బులు, ఆభరణాలు వసూల్ చేశారు. దీంతో ప్రాణభయంతో వారంతా తమ వద్ద ఉన్న ఆభరణాలు, నగదు ఇచ్చేశారు. ప్రస్తుతం కర్నాటకలోని హుమ్నాబాద్‌లో ఉన్న ఓ ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా కత్తులు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారని తెలుస్తోంది. వీరి దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి వద్ద నుంచి 8 తులాల బంగారు నగలను దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన వాసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని రావాల్సి ఉంది. -
ప్రేమించిన యువకుడిపై కత్తితో దాడి
సాక్షి, కృష్ణా: ప్రేమించిన యువకుడిపై ఓ యువతి కత్తితో దాడి చేసింది. ఈ ఘటన జిల్లాలోని చల్లపల్లి మండలం వక్కలగడ్డలో చోటు చేసుకుంది. అనంతరం దాడికి పాల్పడ్డ యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతిని స్థానికులు మచిలీపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంకు చెందిన యువతి మాగంటి నాగలక్ష్మి ఆర్కే కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. గూడూరు గ్రామానికి చెందిన గొరిపర్తి పవన్ కుమార్ పెడన తహసీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఇరువురి మధ్య గత రెండేళ్లుగా పరిచయం ఉంది. ‘వివాహం చేసుకోవాలని నాగలక్ష్మి తనపై ఒత్తిడి తెస్తోంది. చివరి సారిగా ఒకసారి కలిసి మాట్లాడుకుని విడిపోదామని చెబితే సోమవారం ఉదయం వక్కలగడ్డ వచ్చాను. నేను పెళ్లికి ఒప్పుకోకపోవటంతో ఇద్దరం కలిసి చనిపోదామంటూ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా నాపై కత్తితో దాడి చేసింది’ అని పవన్ కుమార్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు. -
కత్తులతో ఒకరిపై ఒకరు దాడి
సాక్షి, కాజీపేట : పాత గొడవలను మనసులో పెట్టుకుని ఇద్దరు ఆటో డ్రైవర్లు ఒక్కరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాజీపేట పట్టణం బాపూజీనగర్ ప్రాంతంలో అడ్డాను ఏర్పాటు చేసుకుని ఆటో యూనియన్ నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీజిల్‌కాలనీకి చెందిన బబ్లూ, ఎర్ర రాజేష్ రెండు వర్గాలుగా విడిపోయి పోటీపడ్డారు. ఎన్నికలు సజావుగా ముగిసినప్పటికీ వీరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు పెరుగుతూ వస్తున్నాయి. వారం రోజుల్లో బబ్లూ, రాజేష్‌లు రెండుసార్లు ఘర్షణలు పడ్డారు. మంగళవారం సాయంత్రం అడ్డాపై ఉన్న రాజేష్‌పై బబ్లూ దాడి చేయడంతో ఘర్షణ పడ్డారు. దీంతో ఇద్దరికీ గాయాలు కాగా పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరినీ ఆస్పత్రికి పంపించి పోలీసులు ఘటన విషయమై విచారిస్తున్నారు. -
అల్లుడిపై కత్తితో దాడి చేసిన మామ
సాక్షి, తిర్యాణి(ఆదిలాబాద్) : కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం నాయకపుగూడలో పరువు దాడి చోటు చేసుకుంది. కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని తండ్రి అల్లుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. నాయకపుగూడకు చెందిన సత్యంచారికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు కావ్య అదే గ్రామానికి చెందిన నవీన్ గత కొద్ది ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. మూడు నెలల క్రితం పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. నూతన దంపతులు మంచిర్యాల జిల్లాలోని సోమంగూడెంకు మకాం మార్చారు. దసరా సందర్భంగా నవీన్ వాళ్ల తల్లిదండ్రులు భార్యభర్తలిద్దరిని నాయకపుగూడకు తీసుకొచ్చారు. కూతురు గ్రామంలోకి వచ్చిందని తెలుసుకున్న సత్యంచారి నవీన్‌పై కోపం పెంచుకున్నాడు. అదను కోసం ఎదురుచూస్తున్న సత్యంచారి ఆదివారం అర్ధరాత్రి నవీన్ ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. దీంతో నవీన్ చేతిపై, పక్కటెములకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిని ప్రతిఘటించి అరుపులు వేయడంతో పక్క గదిలో ఉన్న నవీన్ సోదరుడు కిరణ్ వచ్చాడు. కిరణ్ రాకను గమనించిన సత్యంచారి అక్కడి నుంచి పారిపోయాడు. నవీన్‌ను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. నవీన్ సోదరుడి ఫిర్యాదు మేరకు సత్యంచారిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామరావు తెలిపారు. -
పబ్జీ కోసం.. బావపై కత్తితో దాడి!
చిన్నా పెద్దా తేడా లేకుండా అందర్నీ తన మాయలో పడేసుకుంటోంది పబ్జీ. ఈ ఆన్లైన్ గేమ్ ఉచ్చులో పడి తిండి తిప్పలు కూడా మానేస్తున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ ఆడుకుంటూ ఉంటున్నారు. పిల్లలు దీని బారిన పడి స్కూల్లో కూడా పాఠాలు వినకుండా గేమ్ ఆడుకుంటున్నారంటే దీని ప్రభావం ఏ రేంజ్లో ఉందో తెలుస్తోంది. పబ్జీ ఆడుతూ.. జనాలు పిచ్చి వారు కూడా అవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పబ్జీ ఆడుతూ.. ఫోన్లో చార్జీంగ్ అయిపోయిందని ఇంట్లో నానా హంగామా చేశాడు. థానేకు చెందిన రజనీష్ రాజ్‌భర్ పబ్జీ ఆడుతూ ఉండగా.. మధ్యలో చార్జింగ్ అయిపోయింది. ఇంట్లో చార్జర్ కనబడకపోయే సరికి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంట్లో గొడవ చేస్తుండగా.. అడ్డువచ్చిన అక్క భర్తపై కత్తితో దాడి చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ గేమ్‌ను భారత దేశంలో నిషేధించాలని అన్ని వైపులనుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పబ్జీని నిషేధించిన సంగతి తెలిసిందే. -
అగంతకుడి కత్తిపోట్లకు విద్యార్థి జీవితం బలి
లక్ష్మణచాంద(నిర్మల్) : అభం శుభం తెలియని ఓ విద్యార్థిపై అగంతకుడు జరిపిన కత్తిపోట్లతో విద్యార్థి జీవితం బలయింది. ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవిష్యత్ పొందుతాడని భావించిన విద్యార్థి తల్లిదండ్రుల ఆశలు నీరుగారిపోతున్నాయి. కత్తిపోట్లకు బలైన విద్యార్థి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రుల వేదన మాటలకు అందనిదిగా మారింది. వివరాలలోకి వెళితే.. మండలంలోని చామన్‌పెల్లి గ్రామానికి చెందిన అరటి మమత–శ్రీనివాస్‌ల దంపతుల రెండోకుమారుడు హర్షవర్ధన్ (12) కుభీర్‌లోని జాంగామ్‌లోని మహాత్మజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. గతనెల2వ తేదీ ఉదయం మూడు గంటలకు గురుకుల పాఠశాలలో విద్యార్థి పడుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్లోకి ప్రవేశించి కత్తితో దాడి చేశాడు. దీంతో విద్యార్థి అరవడంతో అగంతకుడు అక్కడ నుంచి పరారయ్యాడు. విద్యార్థికి వెన్నుపూస సమీపంలో రెండు కత్తిపోట్ల గాయాలయ్యాయి. విద్యార్థి హర్షవర్ధన్‌ను ఇన్చార్జి ఉపాధ్యాయుడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కి తరలించారు. అక్కడ వారం చికిత్స పొందాడు. వెన్నుపూస వద్ద ఉన్న నరాల్లో ఒకదానికి కొంత గాయం తగిలిందని వైద్యులు నిర్ధారించారు. వారంచికిత్స అనంతరం కూడా విద్యార్థి కాళ్లు రెండు పని చేయడంలేదు. ఇంటి వద్ద ఫిజియోథెరపీ చేయిస్తే నయం అవుతాయని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో వైద్యంకోసం అయిన రూ.2 లక్షల బిల్లులు చెల్లించి ఇంటికి తీసుకొచ్చామని కన్నీటితో విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. పట్టించుకోని బీసీ గురుకుల అధికారులు ఇంతటి సంఘటన పాఠశాల హాస్టల్లో జరిగినా నేటివరకు బీసీ గురుకుల అధికారులు వైద్యంకోసం నయాపైసా ఇవ్వలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. నిత్యం వెయ్యి ఖర్చు విద్యార్థిని ఇంటికి తీసుకు వచ్చిన నుంచి నేటి వరకు నిత్యం నిర్మల్‌కు చెందిన ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ కిరణ్‌తో ఇంటి వద్ద ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. ఒక కాలు మాత్రమే పని చేస్తోంది. నేటి వరకు ఎడమ కాలు పూర్తిగా చచ్చుబడి పని చేయకపోవడంతో విద్యార్థి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. మంత్రి ఎల్వోసీ ఇచ్చినా అందని వైద్యం విద్యార్థి విషయం తెలుసుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ , దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.1.50 లక్షల ఎల్వోసీని ఇప్పించారు. అయినా నిమ్స్ వైద్యులు చికిత్స అందించలేదు. ఏదైనా శస్త్ర చికిత్సలకు మాత్రమే వర్తిస్తుందని ఫిజియోథెరపీకి వర్తించవని వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. దాతలు సాయం చేయాలి మధ్యతరగతికి చెందిన తాము ఉన్న డబ్బు ఇప్పటివరకు ఖర్చు చేశాం. ఇతరుల వద్ద అప్పులు తీసుకువచ్చి వైద్యం చేయించాం. కాని ప్రస్తుతం నిత్యం రూ.700 నుంచి వెయ్యి అవుతున్నాయి. ఇంత ఖర్చు తాము భరించలేం. ప్రభుత్వం చొరవతీసుకొని వైద్యం అందించేలా చూడాలి. సాయం చేయాలనుకునే వారు 9441629815 అనే ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. – శ్రీనివాస్, విద్యార్థి తండ్రి -
మరదలి గొంతు కోశాడు
సాక్షి, నేలకొండపల్లి : కుటుంబ కలహాల కారణంగా ఓ బావ మరదలి గొంతు కోసిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామానికి చెందిన షేక్ రబ్బాని భార్య ఇటీవల భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి రబ్బాని మానసిక స్థితి బాగాలేదు. ఇంటి చుట్టు పక్కల వారితో మీ వల్లనే నా భార్య వెళ్లిపోయిందని ఇటు కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో కొంత మందితో తరుచూ గొడవ పడి చంపుతానని బెదిరించే వాడని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే సోమవారం తన మరదలు షేక్ రియాన్ బేగం(25)తన పిల్లలకు స్నానం చేయించి ఇంట్లో వరండాలో బట్టలు ఆరవేస్తుండగా అదే సమయంలో రబ్బాని 18 ఇంచుల కత్తితో వెళ్ళి ఆమె గొంతు కోయడమేకాక విచక్షణారహితంగా మూడు చోట్ల పొడిచాడు. ఎడమ చేయి, మెడ మీద, కుడి భుజం మీద మూడు చోట్ల కత్తితో దాడి చేశాడు. దీంతో రియాన్బేగం స్పృహతప్పి పడిపోయింది. అప్పుడే ఇంటికి వచ్చిన ఆమె భర్త మహ్మద్ సంఘటన చూసి బోరున విలపించాడు. వెంటనే 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గొంతు కొసి కత్తితో సహా రబ్బాని పారిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఇన్చార్జీ ఎస్సై లవణ్‌కుమార్ వివరాలు సేకరించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రియాన్బేగంకు ఇద్ధరు పిల్లలు ఉన్నారు. -
డబ్బు ఇమ్మన్నందుకు కత్తితో పొడిచాడు..
అనంతపురం : మంగళవారం ఉదయం ఓ మహిళపై ఆటోడ్రైవర్ కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కమలానగర్‌కు చెందిన మోమిన్బేగం అనే మహిళ చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. కాగా స్థానికంగా ఆటో నడుపుకునే వెంకటకృష్ణ అనే వ్యక్తి గతంలో ఆమె వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని మోమిన్బేగం అడుగుతుండగా కొంతకాలంగా అతను వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అతన్ని గట్టిగా నిలదీయగా ఆమెను కత్తితో పొడిచాడు. ఆమె కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి రాగా నిందితుడు పారిపోయాడు. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు.