స్టేషన్‌ఘన్‌పూర్(వరంగల్ జిల్లా): ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతైన ఘటన స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కొత్తపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాసాని పెద్దాపురం, రూప దంపతుల ఒక్కగానొక్క కుమారుడు విజయ్ (14) తోటి మిత్రులతో కలిసి గ్రామ సమీపంలోని వాగులో ఉన్న వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అందరూ బావిలో దూకి ఈతకొడుతుండగా... కొద్ది సేపటి తర్వాత విజయ్ దూకాడు. ఎంతసేపటికీ విజయ్ నీటిపైకి రాకపోవడంతో పిల్లలు గ్రామస్తులకు సమాచారం అందించారు.
వారు అక్కడికి వెళ్లి బావిలో గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, బావి బాగా లోతుగా ఉండటంతో బాలుడి ఆచూకీ దొరకలేదు. దీంతో రాత్రి 7గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు చీకటి పడటంతో వెలికితీత పనులు విరమించుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.