
నాగిరెడ్డిపేట: ఒకవైపు తల్లి మృతి.. మరోవైపు తండ్రితోపాటు నానమ్మ, తాతయ్య జైలుపాలవడం రెండేళ్ల బాలుడి భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి. ఏ తప్పు చేయకపోయినా నెలరోజులుగా జైలులో ఉండాల్సిన దుస్థితి కల్పించాయి. వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని ఎర్రారం గ్రామానికి చెందిన గుట్టమీది స్వాతి(22) సెప్టెంబర్ 15న మరణించింది. ఆమెకు రెండేళ్ల కుమారుడు జశ్విత్ ఉన్నాడు. అయితే స్వాతిని ఆమె భర్త తిరుపతి, అత్తమామలు కలిసి చంపారని ఆరోపిస్తూ ఆమె తల్లి తులసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్వాతి భర్త తిరుపతితోపాటు మామ నర్సింలును మొదట అరెస్ట్‌చేసి జైలుకు పంపారు.
గతనెల 12న స్వాతి అత్త భూమవ్వతో పాటు మరిది నాగరాజును సైతం అరెస్ట్‌చేసి జైలుకు తరలించారు. దీంతో జశ్విత్‌ను ఇంటివద్ద చూసుకునేవారెవరూ లేకపోవడంతో తప్పనిసరైన పరిస్థితుల్లో నానమ్మ భూమవ్వ తనవెంటే జైలుకు తీసుకెళ్లింది. అప్పటినుంచి జశ్విత్ తన తండ్రి, నాన్నమ్మ, బాబాయితో కలిసి నిజామాబాద్ జిల్లా జైలులోనే ఉంటున్నాడు. జశ్విత్ జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి రావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.