
బాలుడి దారుణ హత్య
రామకృష్ణాపూర్: ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్‌లో 3 రోజుల క్రితం అదృశ్యమైన ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇనుప తీగతో ఉరివేసి గోనె సంచిలో కట్టి మృతదేహాన్ని దుండగులు బాలుడి ఇంటి సమీపంలోనే పడేసి వెళ్లారు. మల్లిఖార్జున్‌నగర్‌కు చెందిన సుధాకర్-నాగలక్ష్మి పెద్దకుమారుడు పెండ్యాల వినయ్(6) ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆడుకునేందుకు వెళ్లి తిరిగిరాలేదు. సాయంత్రం వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా.. శనివారం వేకువజామున బాలుడి ఇంటి సమీపంలోని ఓ హోటల్ వెనుక గోనె సంచి పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి దానిని తెరిచి చూడగా వినయ్ మృతదేహం ఉంది. గొంతుకు ఇనుప తీగతో ఉరి బిగించి అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటాన్ని బట్టి చూస్తే అదృశ్యమైన రోజునే హత్యకు గురై ఉంటాడని తెలుస్తోంది. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి దర్యాప్తు సాగిస్తున్నారు.