ఆర్‌కే నగర్‌లో కూర్చున్న బ్రాహ్మణులు
మల్కాజిగిరి: ఏ ఇంటిలో ఎలాంటి కార్యక్రమం జరగాలన్నా బ్రాహ్మణులు కీలకం. వీరిలో పురోహితం చేసేవారు కొందరైతే, అపరకర్మలు, జపదానాలు తీసుకునే బ్రాహ్మణులు, భోక్తలుగా వెళ్లే బ్రాహ్మణలు వారి వీలునుబట్టి వృత్తిగా ఎంచుకుని జీవనం సాగిస్తున్నారు. మల్కాజిగిరి ఆర్‌కెనగర్‌లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ వద్ద నిత్యం పదుల సంఖ్యలో బ్రాహ్మణులు ఉదయం నుంచి కూర్చొని ఉంటారు. లాక్‌డౌన్ కన్నా ముందు వారి పరిస్థితి కొంత మెరుగ్గానే ఉండేది. ఎవరైనా జపదానాలు చేసే వారు ఉంటే దానం తీసుకునే వారు, శార్ధకర్మలకు భోక్తలుగా వెళ్లేవారు కొంత మంది , అపరకర్మలు నిర్వహించడానికి మరికొంత మందికి పనిదొరికేది.
లాక్‌డౌన్‌తో తప్పని తిప్పలు
లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి వారి పరిస్థితి దయనీయంగా మారింది. ప్రధానంగా దేవాలయాల్లో కొంత మంది వారి వారి గ్రహస్థితిని బట్టి జపాలు చేయించుకొని దానాలు చేస్తుంటారు. ఇప్పుడు దేవాలయాల్లో అటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. అపరకర్మ కార్యక్రమాలు కూడా తక్కువగా జరుగతుండడంతో ఎక్కువ సంఖ్యలో బ్రాహ్మణులకు పని దొరకడం లేదు. దీనితో రోజూ వారు పనికోసం వచ్చి ఆశగా ఎదురుచూసి తిరిగి నిరాశతో ఇంటికి వెళ్లిపోతున్నారు. వీరిలో సొంత ఇండ్లు లేకపోవడంతో అద్దె చెల్లించే కష్టంతో పాటు ఇల్లు గడవడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఎవరినీ అడగలేని పరిస్థితిలో వీరు జీవనం సాగిస్తున్నారు.ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
పరిస్థితి దారుణంగా ఉంది
లాక్‌డౌన్ వచ్చిన తర్వాత పరిస్థితి దారుణంగా మారింది. పనులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ఇంటి అద్దెలతో పాటు ఇల్లు గడవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్ధానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి. మల్కాజిగిరిలోనే సుమారు వంద మంది పైగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. – అనంత క్రిష్ణ
ప్రభుత్వం ఆదుకోవాలి
దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయాల్లో పనిచేసే వారికి వేతనాలు అందజేస్తున్నది. మరి కొన్ని దేవాలయాల్లో ధూపదీపాలకు, పూజార్లకు కొంత మొత్తాన్ని అందజేస్తున్నారు. అదే విధంగా నిత్యం పురోహితం చేసేవారు, భోక్తలుగా వెళ్లేవారు, అపరికర్మలు నిర్వహించే వారికి ఆర్ధికంగా చేయూత నందించాలి. అర్హులైన వారికి ఫించను అందేలా చూడాలి– వి. సుధాకర శర్మ
Comments
Please login to add a commentAdd a comment