కొత్త ఆలోచనలతో బ్రాండ్ హైదరాబాద్
- ప్రారంభమైన ‘అర్బన్ హ్యాకథాన్’
రాయదుర్గం: ప్రభుత్వంలో ప్రజల్ని భాగస్వాములను చేయడమే ‘అర్బన్ హ్యాకథాన్’ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో శనివారం తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, ది మెట్రో పోలిస్ వరల్డ్ కాంగ్రెస్, ఐఎస్‌బీ సంయుక్తంగా రెండు రోజులపాటు నిర్వహించే ‘హైదరాబాద్ అర్బన్ హ్యాకథాన్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు 400 మంది(70 బృందాలు) ఔత్సాహికులు తమ వినూత్న ఆలోచనలతో వచ్చారన్నారు. ఐడియాలను జ్యూరీ పరిశీలించి 20 బృందాలను ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. ఫైనల్‌లో ఎంపికైన ఐదు ఐడియాలకు ప్రభుత్వం, ఐఎస్‌బీ ద్వారా ఇంక్యుబేషన్‌కు అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమే్‌శ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఆలోచనకు ఒక సమయం వస్తుందని, దాన్ని అప్పుడు ఉపయోగించుకున్నప్పుడే సార్థకత చేకూరుతుందన్నారు.
అర్బన్ హ్యాకథాన్‌లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన వారి ఐడియాలను ‘బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణ ’ రూపొందించడంలో భాగస్వామ్యం చేస్తామని వివరించారు. హెచ్‌ఐసీసీలో అక్టోబర్ 6న మెట్రో పోలిస్ హ్యాకథాన్ ఫైనల్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ ఎ. బాబు, మెక్స్-స్మార్ట్ సిటీస్ కో ఫౌండర్ అల్ఫాన్సో గోవెలా థామస్ పాల్గొన్నారు.