కరీంనగర్ అర్బన్ : వ్యవసాయ పంపుసెట్లకు నూతన విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం నిలిపివేసింది. దరఖాస్తు చేసుకుని కొద్ది నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రైతులు రేపో మాపో కనెక్షన్ వస్తుందనే ఆశతో ఉండగా... ప్రభుత్వ నిర్ణయం వారిలో తీవ్ర నిరాశ నింపింది. నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జిల్లాలోని వివిధ డివిజన్లలో 3101 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దపల్లి, మంథని, హుస్నాబాద్, హుజూరాబాద్ డివిజన్లలో అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రబీ సీజన్ మొదలు కావడంతో తమకు ఎలాగైనా విద్యుత్ కనెక్షన్ మంజూరవుతుందనే ధీమాతో పలువురు రైతులు సాగుకు సిద్ధమయ్యారు. కనెక్షన్ ఇవ్వాలని కొద్ది రోజులుగా విద్యుత్‌శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మంజూరు కోసం చెల్లించాల్సిన డబ్బును కూడా సమకూర్చుకున్నారు.
అక్రమ కనెక్షన్లవైపు చూపు
కరెంటు కొరత దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరంలో నూతన కనెక్షన్లు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్‌శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో 3 వేల మంది రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రబీ సీజన్ పూర్తయ్యే వరకు కొత్త కనెక్షన్లు లేవని అధికారులు చెబుతున్నారు.
దీంతో కనెక్షన్ ఎలాగూ మంజూరవుతుందనే ధీమాతో పంటలు సాగు చేసుకున్న రైతులు ఇప్పుడు వాటిని కాపాడుకునేందుకు అక్రమ కనెక్షన్లవైపు దృష్టి సారిస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్‌లోనే పలువురు రైతులు అక్రమ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని పంటలు కాపాడుకునే యత్నం చేశారు. కానీ, కరెంటు కోతలు, వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు కూడా మళ్లీ అక్రమ కనెక్షన్లవైపు దృష్టి సారిస్తుండడంతో లోడ్ పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి అసలుకే ఎసరొచ్చే ప్రమాదముందని ట్రాన్స్‌కో అధికారులు అభిప్రాయపడుతున్నారు.
డీడీ వద్దన్నారు
కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌కు డీడీ కట్టేందుకు వెళ్లా. ఇప్పుడు తీసుకోవడం లేదని తర్వాత రమ్మని చెప్పిండ్రు. పంట చేతికొచ్చి డబ్బులు చేతిలో ఉన్నప్పుడు కరెంట్ కనెక్షన్ ఇవ్వకపోతే మళ్లా ఎప్పుడు తీసుకుంటం. వెంటనే కనెక్షన్ ఇస్తే బాగుండు.
- నారాయణ, కొయ్యూర్
పేర్లు నమోదు చేసుకుంటున్నం
డిమాండ్‌కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో తాత్కాలికంగా కొత్త కరెంట్ కనెక్షన్లకు దరఖాస్తు తీసుకోవడంలేదు. కనెక్షన్ కావాలని వచ్చే వారి పేరు మాత్రం నమోదు చేసుకుంటున్నం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాం.
- మాధవరావు, డీఈఈ,
ఎన్‌పీడీసీఎల్ మంథని
కొత్త కనెక్షన్లకు బ్రేక్
Published Sun, Dec 7 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM
Advertisement
Advertisement