సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లకు 2 విడతల కౌన్సెలింగ్‌ల్లో కొందరికి అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదు రావడంతో మూడో విడతను ప్రభుత్వం వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు దాదాపు 30–40 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 550 జీవో సక్రమంగా అమలు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి వ్యక్తులు భావిస్తు న్నారు. ఒకవేళ రెండు విడతల కౌన్సెలింగ్‌ల్లో పొరపాట్లు జరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీల సీట్లు అగ్రవర్ణాలకు వెళ్లినట్లయితే దాన్ని ఎలా సరిదిద్దాలన్న దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అక్రమంగా సీటు పొందారని భావించినా, ఇప్పటికే విద్యార్థులు ఆయా సీట్లల్లో చేరి ఉన్నట్లయితే ఆ సీటును రద్దు చేసే అవకాశమే ఉండదు. పోనీ తదుపరి మూడో విడత కౌన్సెలింగ్‌లో అన్యాయం జరిగిందని భావి స్తున్న 30–40 సీట్లను ఓసీ కేటగిరీలో కోత విధించడమూ సాధ్యంకాదు.
కాబట్టి ఎలా దిద్దుబాటు, సర్దుబాటు చేస్తారన్న దానిపై అస్పష్టత నెలకొంది. అసలు 550 జీవో అమలు కాలేదన్న దానిపైనా ఇంకా స్పష్టమైన వైఖరిని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ప్రకటించలేదు. ఈ అంశం వివాదం కావడంతో ఏం చేయాలన్న దానిపైనా, ప్రత్యామ్నాయ చర్యలపైనా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సోమవారం సమావేశమయ్యారు. విచిత్రమేంటంటే వైద్య ఆరోగ్యశాఖ జరిపిన ఉన్నతస్థాయి సమావేశానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను కానీ, రిజిస్ట్రార్‌ను కానీ ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్కడే సమస్య ఉందని భావించినప్పుడు వారిని ఎందుకు పిలవలేదన్న చర్చ సాగుతోంది.
కౌన్సెలింగ్‌పై అస్పష్టత... విద్యార్థుల్లో ఆందోళన
మూడో విడత కన్వీనర్ సీట్ల కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం బ్రేక్ వేసినా, తదుపరి ఎప్పుడు నిర్వహించేదీ స్పష్టత ఇవ్వలేదు. ఎలా చేస్తారోననేది కూడా వెల్లడించలేదు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొదటి ఏడాది తరగతులు ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో మూడో విడత కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుందోనన్న ఆందోళన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధిస్తోంది. రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం కన్వీనర్ కోటాలో దాదాపు 160 ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోయాయి.
వాటితోపాటు జాతీయ కోటాలో మిగిలిపోయి రాష్ట్రానికి వచ్చిన 67 సీట్లు, అగ్రవర్ణ పేదల (ఈడబ్లు్యఎస్)కు కేటాయించిన 190 సీట్లకు ఇప్పు డు మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అయితే రిజర్వేషన్లలో ఎటువంటి పొరపాట్లు జరగలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు భావిస్తున్నాయి. అన్నీ సక్రమంగానే నిర్వహించామని చెబుతున్నాయి. కానీ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు మాత్రం ఈ వాదనను ఏకీభవించడంలేదు. సర్కారు పరిధిలోని ఒకే శాఖలో రెండు రకాల వాదనలు వినిపిస్తుండటంతో ఏది వాస్తవమో ఏది అవాస్తవమోనన్న చర్చ జరుగుతోంది.
మూడో కౌన్సెలింగ్‌కు బ్రేక్
Published Tue, Aug 6 2019 2:49 AM | Last Updated on Tue, Aug 6 2019 2:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment