భర్త మందలించాడని.. నవవధువు ఆత్మహత్యాయత్నం
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): భర్త మందలించాడని ఓ నవ వధువు హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు రక్షించారు. ఇన్‌స్పెక్టర్ కే శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం... కవాడిగూడకు చెందిన ఎస్.శాంతి అలియాస్ అశిరామల్ ఫాతిమా(20) అదే ప్రాంతానికి చెందిన తులసీరాం మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మే 6వ తేదీ ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. తులసీరాం ట్రాన్స్‌కోలో అటెండర్‌గా పనిచేస్తుండగా శాంతి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. ఈ పెళ్లి ఇష్టంలేక పోవడంతో తులసీరాం తండ్రి ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఇద్దరూ ఎవరి ఇళ్లలో వారుంటున్నారు.
కాగా, శాంతి ఇటీవల అత్తా మామలపై బేగంపేట్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అందరినీ కలసి ఉండాలని ఒప్పించి పంపారు. ఈ విషయంపై తులసీరాం భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై మధ్యాహ్నం ట్యాంక్‌బండ్‌కు చేరుకుని హుస్సేన్ సాగర్లో దూకేందుకు యత్నిస్తుండగా గస్తీ నిర్వహిస్తున్న లేక్ పోలీసులు రక్షించారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత భర్తను పిలిపించి ఆమెను అప్పగించారు.